AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సన్న బియ్యం Vs స్టీమ్ బియ్యం.. ఆరోగ్యానికి ఏవి మంచివి..? ఈ తేడాలు 100 శాతం ఎవ్వరికీ తెలీదు..

మన రోజువారీ ఆహారంలో అన్నానికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే సన్న బియ్యం, స్టీమ్‌ బియ్యం రెండూ చూడటానికి ఒకేలా కనిపించినా.. వాటి తయారీ విధానం, పోషక విలువలు, జీర్ణమయ్యే తీరు, ఆరోగ్యంపై ప్రభావంలో తేడాలు ఉంటాయి. సాధారణ సన్న బియ్యంతో పోలిస్తే స్టీమ్‌ లేదా ఉప్పుడు బియ్యంలో కొన్ని పోషకాలు మెరుగ్గా నిలిచే అవకాశం ఉంటుంది.

సన్న బియ్యం Vs స్టీమ్ బియ్యం.. ఆరోగ్యానికి ఏవి మంచివి..? ఈ తేడాలు 100 శాతం ఎవ్వరికీ తెలీదు..
Raw Rice Vs Steamed Rice
Shaik Madar Saheb
|

Updated on: Aug 10, 2026 | 3:09 PM

Share

బియ్యం ధరలు భగ్గుమంటున్నాయి.. మంచి రకాన్ని బట్టి క్వింటాలు రూ.7వేల వరకు ధర పలుకుతోంది.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రోజువారీ ఆహారంలో బియ్యానిదే అగ్రస్థానం.. ఉదయం టిఫిన్ల నుంచి రాత్రి భోజనం వరకు మన పళ్లెంలో అన్నం ఉండాల్సిందే.. లేదా బియ్యం పిండితో చేసుకున్న పదార్థాలు తింటారు. అయితే, సూపర్‌మార్కెట్‌కో లేదా కిరాణా కొట్టుకో వెళ్లినప్పుడు మనకు చాలా రకాల బియ్యం అందుబాటులో కనిపిస్తాయి.. వీటిలో గింజ పరిమాణం, తయారీ విధానంలో మార్పులు ఉంటాయి.. ప్రధానంగా చాలా మంది ఉపయోగించే బియ్యం విషయానికి వస్తే.. ఒకటి సంప్రదాయ సన్న బియ్యం (Raw Rice / Sona Masuri), కాగా, రెండోది స్టీమ్ బియ్యం (Steamed Rice)..

బాహ్య రూపానికి రెండూ తెల్లగా, సన్నగా ఒకేలా కనిపిస్తున్నప్పటికీ.. వాటి తయారీ విధానం, పోషక విలువలు, శరీరంలో జీర్ణమయ్యే తీరు, ఆరోగ్య ప్రయోజనాల్లో గణనీయమైన వ్యత్యాసాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అసలు సన్న బియ్యం, స్టీమ్ బియ్యం.. ఈ రెండింటి మధ్య ఉన్న ప్రధాన తేడాలేంటి? ఆరోగ్యానికి ఏవి మంచివి అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం..

తయారీ ప్రక్రియలోనే అసలు తేడా..

సాధారణ సన్న బియ్యం (Raw Rice): చేను నుంచి కోసిన వరి ధాన్యాన్ని ఎండబెట్టి, నేరుగా రైస్ మిల్లులో ఆడించి పొట్టు (Hull), ఊక పొరను (Bran) తొలగిస్తారు. ఈ ప్రక్రియలో బియ్యం గింజకు ఎటువంటి ఉష్ణ లేదా ఆవిరిని అందించరు. ఇవి చాలా సన్నగా, పొడవుగా లేదా మధ్యస్తంగా ఉంటాయి

స్టీమ్ బియ్యం (Steamed Rice): ధాన్యం రూపంలో ఉన్నప్పుడే అధిక పీడనం కలిగిన వేడి ఆవిరి (Steam) ద్వారా ప్రాసెస్ చేస్తారు. బియ్యం నుంచి పొట్టు తీయడానికి ముందే ఈ ఆవిరి పట్టే ప్రక్రియ జరగడం వల్ల, వెలుపలి ఊక పొరలో ఉన్న విటమిన్లు, ఖనిజాలు బియ్యం గింజ లోపలికి చొచ్చుకుపోతాయి. ఆ తర్వాత ధాన్యాన్ని ఆరబెట్టి మిల్లింగ్ చేస్తారు. ఇవి కొంచెం గట్టిగా, లావుగా ఉంటాయి.

సన్న బియ్యం – స్టీమ్ బియ్యం స్వభావం..

సాధారణ సన్న బియ్యం మెత్తగా, కాస్త అంటుకునేలా ఉడుకుతుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ అధికం, వేగంగా జీర్ణమవుతుంది.. మిల్లింగ్ ప్రాసెస్ వల్ల పోషకాలు తగ్గుతాయి.. పురుగులు పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

స్టీమ్ బియ్యం విషయానికి వస్తే.. పొడిపొడిగా, గింజ గింజ విడివిడిగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ మధ్యస్థంగా ఉంటుంది. నెమ్మదిగా జీర్ణమై, ఎక్కువ సమయం ఆకలి వేయనివ్వదు. ఆవిరి వల్ల బి-విటమిన్లు, ఐరన్ సురక్షితంగా ఉంటాయి. ఆవిరి పట్టడం వల్ల త్వరగా పాడవవు..

ఆరోగ్య పరంగా ఏవి మేలైనవి?

పోషకాహార మరియు వైద్య నిపుణుల విశ్లేషణ ప్రకారం, సాధారణ సన్న బియ్యం కంటే స్టీమ్ బియ్యం (Steamed Rice) తినడమే ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేకూరుస్తుంది.

ప్రధాన కారణాలు:

విటమిన్-బి సమృద్ధి: ఆవిరి పట్టే క్రమంలో పొట్టులో ఉండే బి-కాంప్లెక్స్ విటమిన్లు, ఐరన్, మెగ్నీషియం వంటి మూలకాలు బియ్యం గింజ కణజాలంలోకి వ్యాపిస్తాయి. ఫలితంగా స్టీమ్ బియ్యంలో పోషక నష్టం చాలా తక్కువగా ఉంటుంది.

మధుమేహ నియంత్రణ (Diabetes Control): స్టీమ్ బియ్యం గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల, ఇవి తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా స్థిరంగా ఉంటాయి.

బరువు తగ్గడానికి సహాయకారి: స్టీమ్ బియ్యంలో ‘రెసిస్టెంట్ స్టార్చ్’ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థలో మెల్లగా కరుగుతూ ఎక్కువ సేపు పొట్ట నిండిన భావనను కలిగిస్తుంది. దీనివల్ల అతిగా తినే అలవాటు తగ్గి, బరువు అదుపులో ఉంటుంది.

పేగుల ఆరోగ్యం: ఇందులో ఉండే స్టార్చ్ పేగుల్లోని మేలు చేసే బ్యాక్టీరియాకు (Good Bacteria) ఆహారంగా ఉపయోగపడి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఇలాంటి వారికి సన్న బియ్యం..

అయితే.. చిన్న పిల్లలు, కోలుకుంటున్న రోగులు, జీర్ణశక్తి బలహీనంగా ఉన్న వృద్ధులు: త్వరగా అరిగిపోయే సాధారణ సన్న బియ్యం లేదా పాత బియ్యం అనుకూలంగా ఉంటాయి.

మధుమేహ బాధితులు, బరువు తగ్గాలనుకునేవారు స్టీమ్ బియ్యం లేదా ఉప్పుడు బియ్యాన్ని ఎంచుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us