గోధుమ పిండితో ఈజీగా చేసుకునే సూపర్ టేస్టీ వెజ్ ప్యాకెట్స్.. చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు..
సాయంత్రం వేళ ఆకలిగా ఉన్నప్పుడు పిల్లలకు ఏం పెట్టాలా అని ఆలోచిస్తున్నారా? గోధుమ పిండితో తయారుచేసే ఈ క్రిస్పీ వెజ్ ప్యాకెట్స్ రుచితో పాటు కూరగాయల పోషకాలను అందించే మంచి స్నాక్‌గా నిలుస్తాయి. బయట క్రిస్పీగా, లోపల బంగాళదుంప, క్యారెట్, ఉల్లిపాయలతో తయారైన కమ్మని స్టఫింగ్‌తో ఉండే ఈ ప్యాకెట్స్‌ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.

సాయంత్రం వేళ ఆకలిగా ఉన్నప్పుడు లేదా పిల్లలు స్కూల్ నుండి వచ్చాక తినడానికి రుచికరమైన, ఆరోగ్యకరమైన స్నాక్ ను అందించడం ప్రతి తల్లికి ఒక సవాలు.. ఈ సవాలును సులభతరం చేస్తూ.. ఈ రోజు గోధుమ పిండితో తయారుచేసే సూపర్ టేస్టీ వెజ్ ప్యాకెట్స్ రెసిపీని ఈ కథనంలో పరిచయం చేయనున్నాం.. ఈ ప్యాకెట్స్ బయట క్రిస్పీగా, లోపల కమ్మని వెజిటేబుల్ స్టఫింగ్ తో ఉండి, తిన్న కొద్దీ తినాలనిపిస్తాయి. మరి ఈ సులువైన, రుచికరమైన స్నాక్ ను ఎలా తయారుచేయాలో వివరంగా చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
- గోధుమ పిండి: 1 కప్పు
- బొంబాయి రవ్వ: 1/4 కప్పు
- ఉప్పు: చిటికెడు
- నెయ్యి (వేడిచేసి): 1 టేబుల్ స్పూన్
- నీళ్లు: సరిపడా
స్టఫింగ్ కోసం:
- నూనె: 1-1.5 టేబుల్ స్పూన్
- జీలకర్ర: 1/2 టీస్పూన్
- అల్లం వెల్లుల్లి పేస్ట్ (తాజాగా దంచినది): 1 టీస్పూన్
- పచ్చిమిర్చి: 1 (సన్నగా తరిగినది)
- ఉల్లిపాయ: 1 (సన్నగా తరిగినది)
- బంగాళదుంపలు: 1 కప్పు (సన్నగా తరిగినవి)
- క్యారెట్ తురుము: 1/2 కప్పు
- పసుపు: 1/4 టీస్పూన్
- ధనియాలపొడి: 1 టీస్పూన్
- కారం: 1 టీస్పూన్
- ఉప్పు: రుచికి సరిపడా
- గరం మసాలా పొడి: 1/2 టీస్పూన్
- కొత్తిమీర ఆకు: సన్నగా తరిగినది
- నిమ్మరసం: 1/2 చెక్క
- కోటింగ్ కోసం (ఐచ్ఛికం):
- కార్న్ ఫ్లోర్: 2 టేబుల్ స్పూన్లు
- ఉప్పు: చిటికెడు
- నీళ్లు: సరిపడా (మిశ్రమాన్ని తయారుచేయడానికి)
- బ్రెడ్ క్రంబ్స్: సరిపడా
- వేయించడానికి నూనె: సరిపడా
తయారుచేయు విధానం:
పిండి తయారీ: ముందుగా ఒక బౌల్ లో గోధుమ పిండి, బొంబాయి రవ్వ, చిటికెడు ఉప్పు తీసుకుని బాగా కలపాలి. ఇప్పుడు వేడి చేసిన ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, పిండికి బాగా పట్టేలా కలపాలి. ఇలా కలపడం వలన ప్యాటీస్ క్రిస్పీగా మారతాయి. వేయించేటప్పుడు నూనెను తక్కువగా పీల్చుకుంటాయి. పిండి ముద్ద చేస్తే ముద్దలా రావాలి. అవసరమైతే కొద్దిగా నూనె కలిపి, సరిపడా నీళ్లు పోస్తూ సాఫ్ట్ గా పిండిని కలపాలి. పిండి మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్ గా ఉండాలి. దీన్ని 10 నిమిషాలు పక్కన పెట్టి నానబెట్టాలి.
స్టఫింగ్ తయారీ: స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి, ఒకటిన్నర టేబుల్ స్పూన్ నూనె వేయాలి. నూనె వేడయ్యాక అర టీస్పూన్ జీలకర్ర, ఒక టీస్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఒక కప్పు సన్నగా తరిగిన బంగాళదుంపలు వేసి హై ఫ్లేమ్ లో రెండు మూడు నిమిషాలు వేయించాలి. బంగాళదుంపలు సన్నగా తరిగినందున త్వరగా మెత్తబడతాయి.
ఇప్పుడు అర కప్పు గ్రేట్ చేసిన క్యారెట్ తురుము వేసి కలపాలి. (మీరు స్టఫింగ్ కోసం ఉల్లిపాయలతో లేదా గుడ్డు బుర్జీతో లేదా ఉడకబెట్టిన ఆలూ మసాలాతో కూడా చేసుకోవచ్చు.)
పావు టీస్పూన్ పసుపు, ఒక టీస్పూన్ ధనియాలపొడి, ఒక టీస్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, అర టీస్పూన్ గరం మసాలా పొడి వేసి, మంటను లో ఫ్లేమ్ లో పెట్టి బాగా కలపాలి. మూత పెట్టి రెండు మూడు నిమిషాలు మగ్గించాలి, మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. బంగాళదుంపలు ఉడికి, స్టఫింగ్ సిద్ధమయ్యాక, సన్నగా తరిగిన కొత్తిమీర, అరచెక్క నిమ్మరసం వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. స్టఫింగ్ ను ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన ఉంచాలి.
ప్యాటీస్ తయారుచేయు విధానం: నానబెట్టిన పిండిని మరోసారి బాగా నీడ్ చేసి, చిన్న బాల్ సైజ్ అంత పిండి ముద్దను తీసుకుని పొడి పిండిలో అద్ది, పరాటాలా కాస్త మందంగా రోల్ చేయాలి. మరీ పల్చగా రోల్ చేయకూడదు.
అన్ని ప్యాటీస్ ఒకే సైజులో రావడానికి ఒక బాక్స్ మూతతో గుండ్రంగా కట్ చేయాలి. కట్ చేసిన వాటి మధ్యలో సరిపడా స్టఫింగ్ పెట్టి, మీకు నచ్చిన ఆకారంలో (ఒకే సైడ్ కి మలిచి లేదా అంచులు కలిపి గుండ్రంగా) మడవాలి. అంచులు ఊడిపోకుండా బాగా క్లోజ్ చేయాలి.
కోటింగ్ (ఐచ్ఛికం): ఒక బౌల్ లో రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, చిటికెడు ఉప్పు, కొంచెం నీళ్లు వేసి మరీ చిక్కగా కాకుండా మీడియం థిక్నెస్ గా కలిపి స్లర్రీ తయారుచేయాలి. (దీని బదులు మైదాపిండి లేదా గోధుమ పిండిని కూడా వాడవచ్చు).
తయారుచేసిన ప్యాటీస్ ను ఈ కార్న్ ఫ్లోర్ స్లర్రీలో ముంచి, బ్రెడ్ క్రంబ్స్ (లేదా మక్క అటుకులు) తో బాగా కోట్ చేయాలి. ఎక్స్ట్రా బ్రెడ్ క్రంబ్స్ ను దులిపేయాలి.
వేయించడం: మీడియంగా వేడవుతున్న నూనెలో, సరిపడా ప్యాటీస్ వేసి, మంటను మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి, స్లోగా తిప్పుతూ బంగారు రంగు వచ్చేవరకు, క్రిస్పీగా అయ్యేవరకు వేయించాలి. బబుల్స్ తగ్గాయంటే అవి చక్కగా ఫ్రై అయినట్లు. నూనె నుండి తీసి ప్లేట్ లోకి తీసుకోవాలి.
ఈ రుచికరమైన గోధుమ పిండి వెజ్ ప్యాకెట్స్ ను వేడివేడిగా టమాటో కెచప్ తో లేదా మయోనైస్ తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఈ టేస్టీ స్నాక్ రెసిపీని మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఆస్వాదించండి..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
