Telangana: తెలంగాణలో బీఆర్ఎస్‌కు ఊహించని షాక్.. కాంగ్రెస్‌లో చేరిన పోచారం
తెలంగాణ మాజీ స్పీకర్, BRS ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి పోచారం, ఆయన కుమారుడికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

తెలంగాణలో బీఆర్ఎస్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పోచారం శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ బలరాం నాయక్ సహా పలువురు ఆయన ఇంటికి వెళ్లారు. ఆయనతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి ఇతర కాంగ్రెస్ నేతల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రైతులకు మేలు చేసేందుకు తమకు అండగా ఉండాలని పోచారం శ్రీనివాసరెడ్డిని కోరామని సీఎం రేవంత్ చెప్పారు. అందుకు సమ్మతించి ఆయన కాంగ్రెస్‌లో చేరారని తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధికి సహకరిస్తామని.. పోచారం శ్రీనివాసరెడ్డికి సముచిత స్థానం కల్పిస్తామని సీఎం రేవంత్ తెలిపారు. రైతుల శ్రేయస్సు కోసం పోచారం అనుభవాన్ని వినియోగించుకుంటామన్నారు.
సీఎం రేవంత్ రైతు పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. రైతుల సంక్షేమం కోసమే కాంగ్రెస్‌లో చేరినట్టు తెలిపారు. సమస్యలను అధిగమిస్తూ సీఎం రేవంత్ ముందుకెళుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రగతి కోసం అందరం కలిసి పనిచేస్తామన్నారు. తన రాజకీయ భవిష్యత్తు కాంగ్రెస్‌తోనే మొదలైందని గుర్తు చేశారు. మరో 20 ఏళ్లు రాష్ట్రానికి నాయకత్వం వహించే సామర్థ్యం సీఎం రేవంత్‌కు ఉందన్నారు పోచారం.
ఇక పోచారం శ్రీనివాసరెడ్డితో సీఎం రేవంత్ భేటీ సందర్భంగా ఆయన ఇంటి దగ్గర కాసేపు ఉద్రిక్తత నెలకొంది. సీఎం రేవంత్, కాంగ్రెస్ నేతలు పోచారం ఇంట్లో ఉన్న సమయంలోనే అక్కడికి బాల్క సుమన్ సహా పలువురు బీఆర్‌ఎస్ నేతలు చేరుకున్నారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బాల్క సుమన్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమ MLAను కలవడానికి వస్తే అడ్డుకోవడం ఏంటని బాల్క సుమన్ ప్రశ్నించారు. తమ ఎమ్మెల్యేను కలవకూడదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బాల్క సుమన్ సహా, BRS నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై కేసులు పెట్టారు. అయితే బీఆర్ఎస్ నేతల తీరుపై కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు ఇలాంటి పిచ్చి చర్యలు మానుకోవాలని హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




