Telangana: ‘జయ జయహే తెలంగాణ’ పాటను అందుకే వాడలేకపోయాం.. బీఆర్‌ఎస్ క్లారిటీ
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి, తెలంగాణ అస్తిత్వానికి చిరునామాగా నిలిచింది "జయ జయహే తెలంగాణ" అనే గేయం..! అందెశ్రీ రచించిన ఈ జయ జయహే తెలంగాణ పాటను.. రాష్ట్రీయ గీతంగా ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కాకముందే ఈ పాటను రచించారు అందెశ్రీ.. అయితే ఈ గీతాన్ని గత ప్రభుత్వం అధికారికంగా గుర్తించకపోవడం.., ఇప్పుడు ఈ పాటకు రాష్ట్ర గీతం హోదాను ప్రభుత్వం కల్పించడంతో.. కాంగ్రెస్-బీఆర్‌ఎస్ మధ్య రాజకీయ రగడ రాజుకుంది.
తెలంగాణ, ఫిబ్రవరి 7: జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతం విషయంలో జరుగుతున్న వివాదంపై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పందించారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ… లోక్‌సభ ఎన్నికలకు ముందు పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకుంటోందని ఆరోపించారు. అసలు జయ జయహే తెలంగాణ పాటకు కర్త కర్మ క్రియ… బీఆర్‌ఎస్ పార్టీనే అని అన్నారు.
2003 -2004 లో అందెశ్రీ ఈ పాటను రాసారని, కేసీఆర్ ప్రోత్సాహంతో ఆ పాటను రికార్డ్ చేశామన్నారు రసమయి. అయితే అందెశ్రీ రాసిన ఒరిజినల్ పాటలో 12 చరణాలు ఉండటంతో వాటిని 4 చరణాలకు తగ్గించాలనే ప్రతిపాదనకు అందెశ్రీ ససేమిరా ఒప్పుకోలేదన్నారు. తన పాటను యథాతథంగా 12 చరణాలతో వాడాలని చెప్పడంతోనే ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా వాడలేకపోయాం తప్ప, వేరు దురుద్దేశం మాజీ సీఎం కేసీఆర్‌కు లేదన్నారు రసమయి బాలకిషన్.
జయ జయహే తెలంగాణ అనే పాటని రాష్ట్రీయ గీతంగా అప్పుడు ప్రకటించాలని కేసీఆర్ అనుకున్నా… కేవలం అందెశ్రీ ఒప్పుకోకపోవడం వల్లే ఆగిపోయిందన్నారు రసమయి. కేసిఆర్ కర్త కర్మ క్రియగా ఉండి రికార్డు చేసిన పాటను… రేవంత్ కేవలం పొలిటికల్ మైలేజ్ కోసమే ఇప్పుడు తెరపైకి తీసుకువచ్చి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. మొత్తానికి… ఒక పాట.. రెండు స్వరాలు.. తెలంగాణ రాజకీయాల్లో రచ్చ రేపుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..