Telangana: మళ్ళీ తెరపైకి కృష్ణా జలాల వ్యవహారం.. కాంగ్రెస్ తీరును తప్పుబట్టిన బీఆర్ఎస్ నేతలు..
కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించడంపై బీఆర్ఎస్ ఫైర్ అయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేతకాదని.. ఇందుకు ఇదే ఉదాహరణ అని విమర్శించింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినే పరిస్థితి నెలకొందని ఆరోపించింది. కేఆర్‌ఎంబీకి కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను అప్పగించడాన్ని బీఆర్‌ఎస్ తీవ్రంగా తప్పుబట్టింది.

కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించడంపై బీఆర్ఎస్ ఫైర్ అయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేతకాదని.. ఇందుకు ఇదే ఉదాహరణ అని విమర్శించింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినే పరిస్థితి నెలకొందని ఆరోపించింది. కేఆర్‌ఎంబీకి కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను అప్పగించడాన్ని బీఆర్‌ఎస్ తీవ్రంగా తప్పుబట్టింది. తెలంగాణ వాటా తేల్చకుండానే ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడం ఏంటని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. భవిష్యత్తులో ఏ ప్రాజెక్ట్ కట్టాలన్నా.. ప్రాజెక్ట్ నుంచి చుక్క నీరు తీసుకోవాలన్న వారి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని అన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారని ఆరోపించారు. గతంలోనే దీనిపై తాము ప్రభుత్వాన్ని హెచ్చరించామని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించబోమని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అందుకు విరుద్ధంగా వ్యవహరించి తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతినేలా చేసిందని విమర్శించారు. 2021లో నిర్ణయం తీసుకున్నా.. అప్పట్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించలేదన్నారు హరీశ్ రావు.
నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడంపై బీఆర్‌ఎస్ ఎంపీలు నిరసన తెలిపారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిసిన ఎంపీలు.. కేఆర్‌ఎంబీ తీసుకునే నిర్ణయాల వల్ల రాష్ట్రానికి కలిగే నష్టాల గురించి వివరించారు. ప్రాజెక్టుల అప్పగింతపై తమకున్న అభ్యంతరాలను తెలుపుతూ లేఖను అందజేశారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. కృష్ణా ట్రిబ్యునల్‌లో విచారణ పూర్తయ్యేవరకు ఇరు రాష్ట్రాలకు 50:50 పద్ధతిలో నీటి కేటాయింపులు ఉండేలా చూడాలని కోరారు. ఈ అంశంపై తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ మరోసారి వివరణ ఇచ్చారు. త్రిసభ్య కమిటీ నిర్ణయాల ప్రకారమే నీటి నిర్వహణ ఉంటుందని ఆయన అన్నారు. గతంలో కూడా ఇదే విధానం ఉందని.. ఇది కొత్తదేమీ కాదని తెలిపారు. ఔట్‌లెట్ల నిర్వహణ బోర్డు ద్వారా జరుగుతుందని అన్నారు. సిబ్బంది విషయంపై కసరత్తు జరగాలని అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




