AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఒకే మొక్కకు 4 వేల పూలు.. జడ్చర్లలో ప్రకృతి వింత.. అసలు సీక్రెట్ తెలిస్తే..

ప్రకృతి ఎన్నో అద్భుతాలకు నిలయం. ఒక్కోసారి మొక్కలు ప్రదర్శించే తీరు అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలను సైతం నివ్వెరపోయేలా చేస్తుంది. సరిగ్గా అలాంటి అరుదైన, ఆశ్చర్యకరమైన దృశ్యమే మహబూబ్‌‌నగర్ జిల్లా జడ్చర్లలో వెలుగుచూసింది. సాధారణంగా కొన్ని పదుల సంఖ్యలో మాత్రమే పూసే ఒక అరుదైన ఔషధ మొక్క.. ఒకేసారి ఏకంగా సుమారు 4 వేల పుష్పాలను పూసి అందరినీ అబ్బురపరుస్తోంది.

Telangana: ఒకే మొక్కకు 4 వేల పూలు.. జడ్చర్లలో ప్రకృతి వింత.. అసలు సీక్రెట్ తెలిస్తే..
Ceropegia Juncea 4000 Flowers Jadcherla
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: Oct 04, 2026 | 7:16 PM

Share

జడ్చర్లలోని డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అభివృద్ధి చేస్తున్న తెలంగాణ బొటానికల్ గార్డెన్‌లోని కాక్టస్‌ హౌస్‌ ఈ అద్భుతానికి వేదికైంది. అంతరించిపోతున్న అరుదైన జాతికి చెందిన “సీరోపీజియా జన్సియా” అనే మొక్క ప్రస్తుతం కాక్టస్ హౌస్ అంతటా పందిరిలా అల్లుకుని వేలాది పూలతో కనువిందు చేస్తోంది. గత ఏడాది మే నెలలో మహబూబ్‌నగర్‌ శివారు ప్రాంతంలో క్షేత్రస్థాయి పరిశీలన చేస్తుండగా ఈ మొక్క లభించింది. అంతరించిపోతున్న ఈ అరుదైన జాతిని సంరక్షించేందుకు గాను చిన్న కాండాన్ని సేకరించి తెచ్చి, బొటానికల్ గార్డెన్‌లోని కాక్టస్‌‌ హౌస్‌లో నాటారు. ఈ మొక్క ఎదుగుదలకు సహజ వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇసుక, ఎర్రమట్టిని 3:1 నిష్పత్తిలో కలిపి, దానికి అతి స్వల్ప పరిమాణంలో కోకోపీట్‌ను జోడించి ప్రత్యేక మట్టి మిశ్రమాన్ని సిద్ధం చేశారు. ఈ అనుకూల వాతావరణాన్ని త్వరగానే అందిపుచ్చుకున్న మొక్క.. కాక్టస్ హౌస్‌ అంతటా విస్తరించి అనూహ్యంగా ఒకేసారి వేల సంఖ్యలో మొగ్గలు తొడిగి పూయడం ప్రారంభించింది.

ఇంతలా పూయడానికి అసలు కారణం ఏంటి?

ఒకే మొక్కకు నాలుగు వేల పుష్పాలు రావడం వెనుక ప్రత్యేకమైన శాస్త్రీయ కారణాలు ఉన్నాయని గార్డెన్‌ సమన్వయకర్త, ప్రముఖ వృక్షశాస్త్రవేత్త డాక్టర్‌ సదాశివయ్య వెల్లడించారు. మొక్కకు ప్రతిరోజూ నీరు పోయకుండా.. 15 రోజులకు ఒకసారి మాత్రమే అతి తక్కువ పరిమాణంలో నీటిని అందిస్తున్నారు. వర్షపు నీరు సైతం లోపలికి చేరకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నీరు తక్కువై ప్రాణానికి ముప్పు వాటిల్లుతుందనే భావన కలిగినప్పుడు.. మొక్క తన సంతతిని కాపాడుకోవడానికి అత్యవసరంగా విత్తనాలను ఉత్పత్తి చేయాలని చూస్తుంది. అందుకోసమే అసాధారణ స్థాయిలో పుష్పోత్పత్తి జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. సిద్ధం చేసిన మట్టి మిశ్రమంలో నైట్రోజన్ శాతం చాలా తక్కువగా ఉండటం కూడా పూలు విపరీతంగా పూయడానికి అనుకూలంగా మారింది. సాధారణంగా నైట్రోజన్ ఎక్కువైతే ఆకులు పెరుగుతాయి.. నైట్రోజన్ తక్కువగా ఉండి భాస్వరం, పొటాష్ సమపాళ్లలో ఉంటే పుష్పోత్పత్తి వేగవంతమవుతుంది.

అంతరించిపోతున్న జాతులకు జీవం..

సీరోపీజియా జన్సియా వంటి మొక్కలు సహజసిద్ధమైన అటవీ ప్రాంతాల్లో కనుమరుగైపోతున్నాయి. వాటిని రక్షించి, వాటి సహజ అవసరాలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయడం బొటానికల్ గార్డెన్‌లో నిరంతరం సాగుతోంది. ఒకే మొక్కకు 4 వేల పూలు రావడం నా జీవితంలోనే ఎప్పుడూ చూడలేదు” అని డాక్టర్ సదాశివయ్య తెలిపారు. ఈ అరుదైన దృశ్యం బొటనీ, లైఫ్ సైన్సెస్ విద్యార్థులకు, పరిశోధకులకు ప్రత్యక్ష ప్రయోగశాలగా మారింది. మొక్కలలో పర్యావరణ అనుకూలనాలు, నీటి ఒత్తిడి, నేల స్వభావం ఎలాంటి ఫలితాలనిస్తాయో తెలుసుకోవడానికి ఈ పరిశీలన ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Follow Us