Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఎంపీ సీట్ల కేటాయింపులో బీజేపీ మాస్టర్‌ ప్లాన్‌.. ఆ వర్గాలకు ప్రాధాన్యత దక్కేలా

తెలంగాణలో 17 లోక్ సభ స్థానాల్లో పోటీచేయడానికి బీజేపీ నేతలు రెడీ అవుతున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన నలుగురు సిట్టింగ్ ఎంపీలకు ఇప్పటికే టికెట్లు కన్ఫార్మ్ చేసేశారు. మిగతా పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై హోం మంత్రి అమిత్ షా టీం.. రహస్య సర్వేలు చేసింది. గెలుపు గుర్రాలనే బరిలో దించాలని కమలనాథులు...

Telangana: ఎంపీ సీట్ల కేటాయింపులో బీజేపీ మాస్టర్‌ ప్లాన్‌.. ఆ వర్గాలకు ప్రాధాన్యత దక్కేలా
Telangana BJP
Follow us
Sridhar Prasad

| Edited By: Narender Vaitla

Updated on: Jan 28, 2024 | 7:07 PM

పార్లమెంట్ ఎన్నికల సమరానికి తెలంగాణ కమలనాథులు సిద్ధమవుతున్నారు. కాషాయ పార్టీలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న ప్రధాన సామాజిక వర్గాలకు ప్రాధాన్యత దక్కేలా ఎంపీ టికెట్ల కేటాయింపు ఉండనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ వేస్తున్న సామాజిక లెక్కలేంటీ ? ఏ సామాజిక వర్గానికి ఎన్ని టికెట్లు కేటాయించనుంది ?

తెలంగాణలో 17 లోక్ సభ స్థానాల్లో పోటీచేయడానికి బీజేపీ నేతలు రెడీ అవుతున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన నలుగురు సిట్టింగ్ ఎంపీలకు ఇప్పటికే టికెట్లు కన్ఫార్మ్ చేసేశారు. మిగతా పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై హోం మంత్రి అమిత్ షా టీం.. రహస్య సర్వేలు చేసింది. గెలుపు గుర్రాలనే బరిలో దించాలని కమలనాథులు భావిస్తున్నారు. టికెట్ల కేటాయింపు ప్రక్రియ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ముందుగానే ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫిబ్రవరి మొదటివారంలోనే అభ్యర్థుల ఎంపిక ఉండే ఛాన్స్ ఉంది. టికెట్ల కేటాయింపులో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలున్నాయి.

తెలంగాణలో ఉన్న 17 స్థానాల్లో రెండు ఎస్టీ రిజర్వ్ డ్ కాగా… ఆదిలాబాద్ స్థానంలో ఆదివాసీ అభ్యర్థిని, మహబూబాబాద్ నుంచి గిరిజన అభ్యర్థిని పోటీలో దింపాలని బీజేపీ భావిస్తోంది. ఇక ఎస్సీ రిజర్వ్డ్ గా ఉన్న పెద్దపల్లి, నాగర్ కర్నూల్, వరంగల్ మూడు స్థానాల్లో ఇద్దరు మాదిగ, ఒకరు మాల నేతను పోటీ చేయించాలని లెక్కలు వేస్తున్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలకే ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మల్కాజిగిరిలో ముదిరాజ్ నేతను, మెదక్ లో వెలమ నేతకు అవకాశం ఇవ్వనున్నట్లు ప్రచారం సాగుతోంది. హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని బ్రహ్మణ సామాజిక వర్గానికి కేటాయించే ఛాన్స్ ఉంది.

రెడ్డి సామాజిక వర్గానికి మూడు పార్లమెంట్ స్థానాలు కేటాయించే అవకాశాలున్నాయి. సిట్టింగ్ సికింద్రాబాద్ ఎంపీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తిరిగి అక్కడి నుంచే పోటీ చేసే అవకాశాలున్నాయి. ఇక మహబూబ్ నగర్, చేవెళ్ల పార్లమెంట్ స్థానాల్లో రెడ్డి వర్గ నేతలు పోటీలో దిగే అవకాశాలున్నాయి. ఖమ్మం జిల్లా నుంచి కమ్మ నేతను, నల్లొండ నుంచి యాదవ, భువనగిరి నుంచి గౌడ సామాజిక వర్గానికి చెందిన నేతలకు అవకాశం ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. జహీరాబాద్ పార్లమెంట్ నుంచి వీరశైవ లింగాయత్ లేదా వైశ్య సామాజిక వర్గానికి చెందిన నేతను పోటీలో దింపితే ఎలా ఉంటుందనే దానిపై చర్చ సాగుతోంది.

సామాజిక సమీకరణాలను సమతుల్యం చేస్తూ… గెలుపుగుర్రాలను ఎంపిక చేసే పనిలో కమలనాథులు ఉన్నారు. వచ్చే వారం రోజుల్లోనే అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు.బీజేపీ అధిష్టానం వేస్తున్న సామాజిక లెక్కలు కాస్తా.. టికెట్ ఆశించే నేతల అవకాశాలపై నీళ్లు చల్లే ప్రమాదం కనిపిస్తోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ సీఎం నినాదంతో బొక్కబోర్లా పడ్డ కమలనాథులు… పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తారో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..