AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raghunandan Rao: దుబ్బాక కమలంలో అసలేం జరుగుతోంది.? రఘునందన్‌ రావును టార్గెట్‌ చేస్తోంది ఎవరు.?

రాష్ట్ర రాజకీయాల్లో దుబ్బాక ఉప ఎన్నిక సృష్టించిన సంచలనం... ఇప్పట్లో మర్చిపోయేది కాదు. దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణం తర్వాత జరిగిన ఈ వార్‌లో చావోరేవో రేంజ్‌లో పోరాడింది గులాబీ దండు. అయినా... తక్కువ మెజారిటీతో గెలిచినా షార్ప్‌ షూటర్‌ అనిపించుకున్నారు రఘునందన్‌రావు..

Raghunandan Rao: దుబ్బాక కమలంలో అసలేం జరుగుతోంది.? రఘునందన్‌ రావును టార్గెట్‌ చేస్తోంది ఎవరు.?
Dubbaka Political Heat
Narender Vaitla
|

Updated on: Jan 31, 2023 | 6:29 PM

Share

రాష్ట్ర రాజకీయాల్లో దుబ్బాక ఉప ఎన్నిక సృష్టించిన సంచలనం… ఇప్పట్లో మర్చిపోయేది కాదు. దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణం తర్వాత జరిగిన ఈ వార్‌లో చావోరేవో రేంజ్‌లో పోరాడింది గులాబీ దండు. అయినా… తక్కువ మెజారిటీతో గెలిచినా షార్ప్‌ షూటర్‌ అనిపించుకున్నారు రఘునందన్‌రావు. కానీ… ఆ తర్వాత దుబ్బాకలో రాజకీయ చిత్రంలో వస్తున్న ఈ మార్పులేంటి? స్టేట్ బీజేపీ దూసుకుపోవాలని చూస్తుంటే.. దుబ్బాక బీజేపీ మాత్రం వెనక్కు చూస్తోంది. గెలిచిన సీటులో కూడా గందరగోళానికి వెల్‌కమ్ చెబుతోంది. ఎమ్మెల్యే రఘునందన్‌కుకు వ్యతిరేకంగా గ్రూపులు కట్టి రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ గడబిడ క్రియేట్ చేస్తున్నారన్నది దుబ్బాకలో తాజా గుసగుస. ఉపఎన్నికల్లో బీజేపీ తరపున రఘునందన్ గెలుపు కోసం కష్టపడ్డవాళ్లలో కొందరు గుర్తింపు దొరక్క అలక పాన్పు పట్టారన్నది ఒక ప్రచారం. దాని ఫలితమే… దుబ్బాకలో రఘునందన్‌కు యాంటీ వేవ్స్.

రఘునందన్ ఎన్నికల మందు ఉన్నట్లు ఇప్పుడు లేడని, ఆయన వ్యవహార శైలి మారిపోయిందని, తమను పట్టించుకోవడం లేదని తమలో తాము కుమిలిపోతున్నారట కొందరు కార్యకర్తలు. దుబ్బాక బీజేపీలో సీనియర్లంతా రఘునందన్‌రావుకి వ్యతిరకంగా గళమెత్తారు. ఎమ్మెల్యే రఘునందన్ బీఆర్‌ఎస్‌ పార్టీ కోవర్టుగా వ్యవహరిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేసేదాకా వెళ్లింది వ్యవహారం. ఈనెల 29న అసంతృప్త నేతలంతా భేటీ కావాలని నిర్ణయించుకున్నారట. నియోజకవర్గంలోని బీజేపీ సీనియర్ నేత ఒకరు… ‘బావి దగ్గర విందు’ పేరుతో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారని.. ఈ రహస్య సమావేశానికి చేగుంట, దౌల్తాబాద్, తొగుట, దుబ్బాక, మిర్‌దొడ్డి మండలాల నుంచి నాయకులంతా హాజరయ్యారని తెలుస్తోంది. రఘునందన్‌ని ఎలా దారిలోకి తెచ్చుకోవాలి… పార్టీని ఎలా గాడిలో పెట్టాలి… ఆల్టర్నేటివ్ స్టెప్స్ ఏంటి… ఇలా భవిష్యత్ కార్యాచరణపై ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఎమ్మెల్యే రఘునందన్ వర్గం మాత్రం టేకిటీజీ అంటోంది. రహస్య సమావేశాల ప్రచారాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదని, బీజేపీ సీనియర్‌ నేతలుగా చెప్పుకుంటూ హల్‌చల్‌ చేసేవాళ్లంతా అనామకులేనని చెబుతోంది రఘునందన్ క్యాంప్. వీళ్లంతా రీసెంట్ బైపోల్‌లో కూడా బీజేపీకి వ్యతిరేకంగా పని చేసినవాళ్లేనట. అందుకే.. స్పందించకుండా ఆచితూచి వ్యవహరించాలన్నది రఘునందన్‌ వర్గం ఆలోచన. పైగా… దుబ్బాక బీజేపీని బలహీనపర్చే కుట్రలో బీఆర్ఎస్ స్పెషల్ టీమ్ పనిచేస్తోందనేది ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే సైలెంట్‌గా ఉన్నప్పటికీ… మిగతా కార్నర్స్ మాత్రం కోడై కూస్తున్నాయి. రహస్య సమావేశాలపై ఎవరూ స్పందించకపోయినా… మిర్‌దొడ్డి మండలానికి చెందిన ఒక నేత మాత్రం అసమ్మతిపై బాహాటంగానే చెబుతున్నారు. పొలం దగ్గర జరిగిన మైసమ్మ పండుగకు జిల్లా నేతలంతా వచ్చారని, దీన్ని రహస్య సమావేశం అంటూ బీఆర్‌ఎస్ ప్రచారం చేస్తోందని విమర్శిస్తోంది బీజేపీ. దుబ్బాక బీజేపీలో మాత్రం సమ్‌థింగ్ సమ్‌థింగ్ జరుగుతోందన్నది మాత్రం నిజం. ఎన్నికల్లో పోరాడి గెలిచిన రఘునందన్… క్యాడర్‌నీ, లీడర్లనీ గాడిలో పెట్టడంలో మాత్రం ఓడిపోతున్నారన్న ఊసు… దుబ్బాకను హీటెక్కిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..