Khammam Politics: ఖమ్మం కేంద్రంగా తెలంగాణ రాజకీయం.. ఖిల్లాపై కన్నేసిన జాతీయ పార్టీలు..
Khammam Politics: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని నెలల్లో జరగనున్నాయి. దీంతో అధికార పార్టీ బీఆర్ఎస్ సహా.. ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, లెఫ్ట్ పార్టీలు వ్యూహాలకు పదునుపెట్టాయి. మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీఆర్ఎస్.. గట్టి పోటీ ఇచ్చి ఆ పార్టీకి చెక్ పెట్టాలని కాంగ్రెస్, బీజేపీ సన్నాహాలను ప్రారంభించాయి.
Khammam Politics: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని నెలల్లో జరగనున్నాయి. దీంతో అధికార పార్టీ బీఆర్ఎస్ సహా.. ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, లెఫ్ట్ పార్టీలు వ్యూహాలకు పదునుపెట్టాయి. మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీఆర్ఎస్.. గట్టి పోటీ ఇచ్చి ఆ పార్టీకి చెక్ పెట్టాలని కాంగ్రెస్, బీజేపీ సన్నాహాలను ప్రారంభించాయి. ఈ తరుణంలో అన్ని పార్టీలు ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లాపై ఫోకస్ పెంచడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సత్తా చాటాలని ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో బలమైన నేతగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో ఖమ్మం జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఆయన ఏ పార్టీలో చేరనప్పటికీ.. వరుస పర్యటనలు చేస్తూ రాజకీయాలను హీటెక్కిస్తుండటం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.. అదే రితీలో బీఆర్‌ఎస్ పార్టీ నేతలు, లెఫ్ట్ పార్టీలు సైతం ఉమ్మడి జిల్లాలో వరుస పర్యటనలు చేస్తూ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో ఓ వైపు బీఆర్‌ఎస్.. మరోవైపు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం.. ఖమ్మం దృష్టి సారించగా.. అదేరీతిలో బీజేపీ సైతం ఖమ్మంపై కన్నేసింది.. దీంతో ఖమ్మం రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ క్రమంలో అన్ని జాతీయపార్టీలు ఖమ్మం గుమ్మంలో సత్తా చాటేందుకు తహతహలాడుతున్నాయి.ఈ నెలలోనే కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు సైతం ఖమ్మానికి రానున్నారు. ఖమ్మంలో 15న హోంమంత్రి అమిత్‌షా సభ జరగనుంది.. 20 లేదా 25న రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ ఎవరో ఒకరితో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీనికిముందు.. ఖమ్మంలో ఈ నెల 9న బండి సంజయ్ పర్యటించనున్నారు. సర్దార్ పటేల్ స్టేడియంలో లక్ష మందితో బిజెపి భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు యోచిస్తోంది. ఈ సభకు అమిత్ షా హాజరుకానున్నారు.
అంతేకాకుండా ఈ నెల 11న కొత్తగూడెంలో సీపీఐ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు జాతీయ నేతలు హాజరుకానున్నారు. ఇప్పటికే.. కొత్తగూడెం నుంచి పోటీ చేస్తున్నట్లు సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. 2009లో కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలిచిన కూనంనేని.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించడం.. అటు సీపీఎం పార్టీ సైతం పోటీకి సిద్దమవుతుండటం రాజకీయాలను మరింత హీటెక్కిస్తోంది. అయితే.. ప్రస్తుతం సీపీఐ, సీపీఎం బీఆర్‌ఎస్ తో సఖ్యతగా ఉన్నాయి.. లెఫ్ట్ పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళితే.. అధికార పార్టీ బీఆర్‌ఎస్ లెఫ్ట్ పార్టీలకు సీట్లు ఇస్తుందా..? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే, ఇప్పటికే లెఫ్ట్ పార్టీల నాయకులు సీట్లపై సీఎం కేసీఆర్‌తో చర్చించినట్లు సమాచారం.. లెఫ్ట్ పార్టీల ప్రాబల్యం ఉన్న ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్ వాటితో జోడి కట్టి అన్ని సీట్లను కైవసం చేసుకోవాలని ప్లాన్ రచించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ ఎన్నికలకు ముందు రాజకీయాలకు ఖమ్మం కేంద్ర బిందువుగా మారుతుండటం.. అన్ని పార్టీలు ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ఫోకస్ పెంచడం.. ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..