AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏంది మావ ఇట్టా ఉన్నావ్.. దొంగతనం చేసి వెళ్తూ.. ఎస్సైనే లిఫ్ట్ అడిగాడు..

ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను కత్తితో బెదిరించి 7 సవర్ల బంగారు గొలుసు దోచుకున్న దొంగ… పారిపోయే క్రమంలో పోలీసులకే లిఫ్ట్ అడిగి చివరికి వారి చేతికే చిక్కాడు. తూత్తుకుడిలో జరిగిన ఈ విచిత్ర ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ..

ఏంది మావ ఇట్టా ఉన్నావ్.. దొంగతనం చేసి వెళ్తూ.. ఎస్సైనే లిఫ్ట్ అడిగాడు..
Thief Caught By Police
Ram Naramaneni
|

Updated on: Mar 07, 2026 | 4:50 PM

Share

తమిళనాడులో చోటుచేసుకున్న ఓ విచిత్రమైన దొంగతనం ఘటన ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను కత్తితో బెదిరించి గొలుసు దోచుకున్న దొంగ.. చివరికి పోలీసులకే లిఫ్ట్ అడిగి పట్టుబడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి నగరంలోని శివజ్యోతి నగర్ ప్రాంతంలో మహారాజన్ అనే వ్యక్తి నివసిస్తున్నారు. ఆయన ఒక షిప్పింగ్ కంపెనీ నిర్వహిస్తున్నారు. ఈ నెల 6వ తేదీన మహారాజన్ ఇంట్లో ఆయన భార్య శివకమల మాత్రమే ఒంటరిగా ఉన్నారు. ఈ విషయాన్ని గమనించిన ఓ దొంగ, వారి ఇంట్లోకి చొరబడ్డాడు. చేతిలో కత్తి పట్టుకుని శివకమలను బెదిరించి, ఆమె మెడలో ఉన్న సుమారు 7 సవర్ల బంగారు గొలుసును లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే ఆ సమయంలో ధైర్యం చేసిన శివకమల, దొంగ చేతిని బలంగా కొరికినట్లు సమాచారం. దాంతో చేతికి గాయం అయినప్పటికీ, దొంగ ఆమెను తప్పించుకుని గొలుసుతో అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే శివకమల సిప్కాట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. దొంగ ఫోటోను సేకరించి వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇతర పోలీసులకు కూడా పంపించారు. ఇదే సమయంలో తూత్తుకుడి పసుంపోన్ నగర్ ప్రాంతంలో వెళ్తున్న పోలీస్ ఎస్సై ప్రేమ్‌కుమార్‌ను ఒక వ్యక్తి లిఫ్ట్ అడిగాడు. ఆ వ్యక్తి చేతిపై కొరికినట్లు గాయం ఉండటం ప్రేమ్‌కుమార్ గమనించారు. వెంటనే ఆయన వాట్సాప్ గ్రూపులో ఉన్న దొంగ ఫోటోను చూసి పోల్చగా అనుమానం మరింత బలపడింది. దాంతో వెంటనే ఈ కేసు విచారణలో ఉన్న పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. విచారణలో అతడు తూత్తుకుడి డీఎంబీ కాలనీకి చెందిన ససికుమార్ అని తేలింది. కాంక్రీట్ పనులు చేసే కార్మికుడిగా నటిస్తూ, జనసంచారం తక్కువగా ఉండే ఇళ్లను గమనించి దొంగతనాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. తర్వాత అతని వద్ద ఉన్న గొలుసును పోలీసులు స్వాధీనం చేసుకుని, నిందితుడు శశికుమార్‌పై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.

Follow Us