Marri Shashidhar Reddy: కాంగ్రెస్‌కు మర్రి శశిధర్‌రెడ్డి గుడ్‌బై.. బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటన.. కారణం ఇదేనట..
ఊహించినట్లే కాంగ్రెస్‌కు హ్యాండిచ్చారు మర్రి.. వెళుతూ వెళుతూ హస్తం పార్టీ నాయకత్వంపై చాలా ఆరోపణలే చేశారు. రేవంత్‌ను, ఠాగూర్‌ను గట్టిగా టార్గెట్ చేశారు. మర్రి ఒక్కరే కాదు మరింత మంది సీనియర్లు రాబోతున్నారంటూ సంచలన టీజర్ ఇచ్చారు డీకె అరుణ..

కాంగ్రెస్ సీనియర్ మోస్ట్ లీడర్, ఏఐసీసీ స్థాయిలో పని చేసిన మర్రి శశిధర్‌రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఇటీవల ఆయన హోంమంత్రి అమిత్‌షాను కలిసినట్లు ప్రచారం జరిగింది. దాంతో రాష్ట్ర పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ తిరిగి వచ్చిన మర్రి రాజీనామా చేస్తూ లేఖను ఏఐసీసీ అధ్యక్షుడికి, సోనియాకు లేఖ రాశారు. రాజీనామాకు కారణాలను వివరిస్తూ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక ఎప్పుడూ లేని పరిస్థితులు కాంగ్రెస్‌లో వచ్చాయన్నారు. ఇన్‌ఛార్జులు కూడా దౌర్భాగ్యంగా తయారయ్యారని వ్యాఖ్యానించారు. రేవంత్ బ్లాక్‌మెయిల్‌కే పనికొస్తారన్నారు. కాంగ్రెస్‌లో హోంగార్డు పోస్టు నుంచి తప్పుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు మర్రి శశిధర్ రెడ్డి.
మర్రి రాజీనామా సమయంలోనే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ నాయకురాలు డీకె అరుణ. కాంగ్రెస్ పరిస్థితి ఏంటో మునుగోడు ఉప ఎన్నికతోనే తేలిపోయిందన్నారు. ఆ పార్టీలో ఐక్యత లేదని, మరికొంత మంది సీనియర్లు బీజేపీలోకి వస్తారని చెప్పారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మర్రి శశిధర్‌రెడ్డి త్వరలోనే బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని మర్రి శశిధర్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో నేటి పరిస్థితిని ఊహించలేదని పేర్కొన్న ఆయన పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మణిక్కం ఠాగూర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మణిక్కం ఠాగూర్ పుట్టక ముందు నుండి తాను రాజకీయాలు చూస్తున్నానని పేర్కొన్న మర్రి శశిధర్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ పీసీసీ చీఫ్ అయిన తర్వాత రాష్ట్రంలో అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని అసహనం వ్యక్తం చేశారు మర్రి శశిధర్ రెడ్డి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
