నర్సిరెడ్డి కుటుంబానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆర్థిక సాయం… పిల్లలను చదివిస్తానని హామీ…
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన వరకాంతం నర్సిరెడ్డి కుటుంబానికి భువనగిరి ఎంపీ...
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన వరకాంతం నర్సిరెడ్డి కుటుంబానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆర్థిక సాయాన్ని ప్రకటించాడు. రూ. లక్ష నగదును బాధిత కుటుంబ సభ్యులకు పార్టీ శ్రేణుల ద్వారా అందజేయించాడు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత నర్సిరెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తానని ఎంపీ తెలిపారు. అంతేకాకుండా నర్సిరెడ్డి పిల్లల చదువులకయ్యే ఖర్చు తాను భరిస్తానని ప్రకటించారు.
ఇల్లు లేదు… ఇప్పుడు ఇంటిపెద్దా లేడు…
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన వరకాంతం నర్సిరెడ్డి బోరు డ్రిల్లర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఆదివారం మోత్కూరులో పెట్రోలు బంకుకు వెళ్లిన నర్సిరెడ్డి హైబీపీతో పడిపోయారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఈయన్ను ఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మెదడులో రక్త స్రావమైందని చెప్పారు. సోమవారం ఆయన బ్రెయిన్‌డెడ్ అయినట్లు ధ్రువీకరించారు.
జీవన్ దాన్ ట్రస్ట్ సహకారంతో…
నర్సిరెడ్డి బ్రెయిన్ డెడ్ అయినట్లు జీవన్‌దాన్ ట్రస్టుకు సమాచారం అందడంతో వారు అవయవదానం కోసం కుటుంబ సభ్యులను సంప్రదించారు. అందుకు నర్సిరెడ్డి భార్య నిర్మల అంగీకరించారు. ఆయన నుంచి గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, కాలేయం సేకరించారు. గుండెను ప్రత్యేకంగా మెట్రో రైలులో అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ మృత్యువుతో పోరాడుతున్న ఓ 44 ఏళ్ల వ్యక్తికి వైద్యులు అమర్చాలని నిర్ణయించారు. మిగతా అవయవాలను గ్రీన్ ఛానల్ ద్వారా ఇతర ఆసుపత్రులకు తరలించిన విషయం తెలిసిందే. కాగా.. నర్సిరెడ్డి కుటుంబం పేదరికంలో మగ్గుతోందని, కనీసం ఆ కుటుంబానికి ఇల్లు కూడా లేదని గ్రామస్తులు అంటున్నారు. నర్సిరెడ్డి కుటుంబానికి ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read : Hyderabad Metro: మెట్రో అధికారులను అభినందించిన కేటీఆర్… అవయవ దానానికి ముందుకు రావడంపై ప్రశంస…