Congress-BRS: టైమ్ ఫిక్స్.. డేట్ ఫిక్స్.. సెంటర్‌కు వస్తా.. తేల్చుకుందాం.. భూపాలపల్లి రగులుతున్న రాజకీయం..
ఎమ్మెల్యే అవినీతిపరుడు.. కాంగ్రెస్ ఆరోపణ! నిరూపించగలరా.. అంబేద్కర్ సెంటర్‌కు వస్తా.. ఎమ్మెల్యే సవాల్!! టైమ్ ఫిక్స్ అయ్యింది, డేట్ ఫిక్స్ అయ్యింది!!! భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్‌కు వచ్చేది ఎవరు? తన వాదనను నిరూపించుకునేది ఎవరు? రేపు ఏం జరగబోతుంది?

భూపాలపల్లి రాజకీయం రగులుతోంది. సెంటర్‌లో తేల్చుకుందాం రా అంటున్నారు అధికార, ప్రతిపక్ష నేతలు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటనతో మొదలైన విమర్శలు అంబేద్కర్ సెంటర్‌లో తొడలు కొట్టే వరకు వెళ్లాయి. డేట్, టైమ్, సెంటర్ ఫిక్స్ చేసుకొని మరీ సవాల్ విసురుకున్నారు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి పేదల భూములను కొట్టేశారన్నది టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపణ. ఇసుక దందా, కల్తీ పెట్రోల్ దందా చేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డితో పాటు భూపాలపల్లి కాంగ్రెస్ ఇంఛార్జ్ గండ్ర సత్యనారాయణ తనపై చేసిన అవినీతి ఆరోపణలపై ఘాటుగా స్పందించారు సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. దమ్ముంటే రా.. నా పై చేసిన ఆరోపణలు రుజువు చేయాలంటూ సవాల్ విసిరారు. రేపు ఉదయం 11 గంటలకు భూపాలపల్లిలోని అంబేద్కర్ చౌరస్తాకు వస్తున్నా.. దమ్ముంటే రా.. నా పై చేసిన ఆరోపణలు రుజువు చేయాలంటూ కాంగ్రెస్ నేతలకు సవాల్ చేశారు గండ్ర.
నువ్వే సవాల్ చేస్తే మేం తగ్గుతామా అంటూ కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణ కూడా సవాల్ చేశారు. పోలీసులు అడ్డుపెట్టుకుని తప్పించుకోవడం కాదు.. దమ్ముంటే మీడియాను తీసుకుని రా.. నీ అవినీతిపై ఆధారాలతో మేమూ వస్తాం తేల్చుకుందామంటున్నారు సత్యనారాయణ. మీరు చెప్పిన సమయానికే.. మీరు ఇచ్చిన టైమ్‌కే వస్తామని ప్రతిసవాల్ చేశారు గండ్ర సత్యనారాయణ.
మొత్తానికి భూపాలపల్లి సవాళ్లు రాజకీయంగా హీట్ పుట్టిస్తున్నాయి. మరి రేపు అంబేద్కర్ సెంటర్లో ఇద్దరు నేతలు బహిరంగచర్చకు వస్తారా? రాజకీయ సవాళ్లకే పరిమితం అవుతారా? ఇంత హీట్‌లో పోలీసులు ఇద్దరు నేతలను అంబేద్కర్ సెంటర్ వెళ్లేందుకు అనుమతిస్తారా? అన్న ఉత్కంఠపై కౌంట్‌డౌన్ కంటిన్యూ అవుతుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం