AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banakacharla Project: తెలుగు రాష్ట్రాల్లో బనకచర్ల ప్రాజెక్టు భగభగలు.. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

బనకచర్ల ప్రాజెక్టుపై తెలుగు రాష్ట్రాల్లో భగభగలు మొదలయ్యాయ్..! పోలవరానికి బనకచర్ల అనుసంధానం అద్భుతమంటూ ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తుంటే.. అదెలా కుదురుతుంది, ఏపీ సర్కార్‌ జలదోపిడీకి పాల్పుడుతోంది అంటూ తెలంగాణలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. లేటెస్ట్‌గా మంత్రి ఉత్తమ్‌ సైతం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఘాటుగా రియాక్టవ్వడం హాట్‌టాపిక్‌గా అయ్యింది.

Banakacharla Project: తెలుగు రాష్ట్రాల్లో బనకచర్ల ప్రాజెక్టు భగభగలు.. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
Banakacharla Project
Shaik Madar Saheb
|

Updated on: Jun 04, 2025 | 10:21 AM

Share

బనకచర్ల ప్రాజెక్టుపై తెలుగు రాష్ట్రాల్లో భగభగలు మొదలయ్యాయ్..! పోలవరానికి బనకచర్ల అనుసంధానం అద్భుతమంటూ ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తుంటే.. అదెలా కుదురుతుంది, ఏపీ సర్కార్‌ జలదోపిడీకి పాల్పుడుతోంది అంటూ తెలంగాణలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. లేటెస్ట్‌గా మంత్రి ఉత్తమ్‌ సైతం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఘాటుగా రియాక్టవ్వడం హాట్‌టాపిక్‌గా అయ్యింది. దీంతో నెక్ట్స్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం న్యాయపోరాటానికి సిద్ధమైంది..? కేంద్రంతో చర్చించి ప్రాజెక్టును అడ్డుకోబోతోందా…? మరిన్ని వివరాలు అతిత్వరలోనే వెల్లడిస్తామన్న ఉత్తమ్‌.. ఏం చెప్పబోతున్నారు..?

ఏపీని సస్యశ్యామలం చేయాలన్నా.. నీటి కొరత తీర్చాలన్నా బనకచర్లతోనే సాధ్యమని భావిస్తున్న కూటమి ప్రభుత్వం… ఆ దిశగా వేగంగా అడుగులేస్తోంది. ఇప్పటికే కేంద్రంతో సంప్రదింపులు సైతం జరిపి.. ప్రజెంటేషన్లు కూడా ఇచ్చింది. అయితే ఇప్పుడీ బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పందించడం చర్చనీయాంశమైంది.

బనకచర్ల ప్రాజెక్ట్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాజెక్టును అడ్డుకోవడానికి ఇప్పటికే అన్ని ప్రయత్నాలు చేశామన్నారు. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. ఇప్పటికే తమ అభ్యంతరాలను కేంద్రానికి తెలియజేశామన్న ఆయన… ఇంకా ఎన్ని ప్రయత్నాలు ఉంటే అన్నీ చేస్తామంటూ బనకచర్లపై తమ స్టాండ్‌ ఏంటో తెలియజేశారు. అంతేకాదు.. రెండు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నారు మంత్రి ఉత్తమ్.

ఇక బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు తీరని అన్యాయమంటూ ఎప్పట్నుంచో వాదిస్తూ వస్తోంది బీఆర్ఎస్. జలదోపిడీ జరుగుతుంటే అడ్డుకోవడంలేదని రేవంత్‌ సర్కార్‌ టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తూనే ఉంది. అంతేకాదు.. అవసరమైతే తామే సుప్రీంకోర్టులో కేసు వేస్తామన్నారు గులాబీపార్టీ నేతలు.

ఇక అంతకుముందు బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ అధికారులు కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి అజయ్‌సేత్‌కు ప్రజంటేషన్ ఇచ్చారు. పోలవరం నుంచి బనకచర్లకు నీటి తరలింపు గురించి కేంద్ర ఆర్థిక శాఖకు పూర్తి వివరాలను అందించారు. 81వేల కోట్లతో నిర్మించబోయే ఈ ప్రాజెక్ట్‌తో రైతులు, ప్రజలకు కలిగే ప్రయోజనాలను ప్రజంటేషన్ ద్వారా వివరించారు. తెలంగాణ లేవనెత్తుతున్న అభ్యంతరాలపైనా ప్రజంటేషన్‌లో సమాధానం ఇచ్చారు ఏపీ అధికారులు. ఇటు సీఎం చంద్రబాబు సైతం పలువురు కేంద్రమంత్రులను కలిసి ప్రాజెక్టుపై మాట్లాడారు. సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని మాత్రమే ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదని చెబుతూ వస్తున్న చంద్రబాబు… పైగా తెలంగాణకు కొంత మేలు కూడా జరుగుతుందంటున్నారు.

మొత్తంగా.. మంత్రి ఉత్తమ్‌ కామెంట్స్‌తో బనకచర్ల భగభగలు నెక్ట్స్‌ లెవల్‌కి వెళ్లాయి. ఇప్పటికే ప్రాజెక్టును అడ్డుకోవడానికి ఎంతో చేశామని ఆయన చెప్పడంతో తర్వాత స్టెప్‌ ఏంటన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. అలాగే.. ఉత్తమ్‌ కామెంట్స్‌పై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది కూడా ఆసక్తి పెంచుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..