TSRTC: తెలంగాణ ఆర్టీసీకి గుడ్‌న్యూస్.. రూ.1000 కోట్లు రుణం ఇచ్చేందుకు బ్యాంకు అఫ్ ఇండియా అంగీకారం

నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ రోడ్డు రవాణా సంస్థకు ఊరట లభించింది. టీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం హామీ మేరకు బ్యాంకు అఫ్ ఇండియా రూ.1,000 కోట్లు రుణం ఇచ్చేందుకు అంగీకరించింది.

TSRTC: తెలంగాణ ఆర్టీసీకి గుడ్‌న్యూస్.. రూ.1000 కోట్లు రుణం ఇచ్చేందుకు బ్యాంకు అఫ్ ఇండియా అంగీకారం
Bank Of India Agreement With Tsrtc
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 14, 2021 | 7:50 PM

Good News for TSRTC: నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ రోడ్డు రవాణా సంస్థకు ఊరట లభించింది. టీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం హామీ మేరకు బ్యాంకు అఫ్ ఇండియా రూ.1,000 కోట్లు రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. మొదటి దఫాగా రూ.500 కోట్లు విడుదల చేసింది. మిగిలిన రూ. 500 కోట్లను నెల తర్వాత విడుదల చేస్తామని తెలిపింది. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన తర్వాత, ఈ డబ్బులను ప్రాధాన్యతను బట్టి ఎంత వినియోగించాలన్న దానిపై చర్చిస్తామని ఆర్టీసీ సీఎండీ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ఈ డబ్బులను వినియోగిస్తామన్నారు.

తెలంగాణ ఆర్టీసీ చాలాకాలంగా అప్పులపై నెట్టుకొస్తున్న సంగతి తెలిసిందే. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండటం, సిబ్బంది జీతాల ఖర్చు బాగా పెరిగిపోవటంతో బ్యాంకు రుణాల ద్వారా సర్దుబాటు చేస్తోంది. అయితే, అలా తీసుకున్న రుణం సకాలంలో చెల్లించకపోవటం తరచూ జరుగుతుండటంతో ఆర్టీసీని బ్యాంకులు మొండి బకాయిల జాబితాలోకి చేర్చాయి. తద్వారా సంస్థ నిరర్ధక ఆస్తుల (ఎన్‌పీఏ) జాబితాలో చేరిపోయింది. ఒకసారి బ్యాంకులు మొండి బకాయిదారుగా నిర్ధారిస్తే కొత్తగా రుణం పుట్టదు. ఇప్పుడు ఆర్టీసీకి అదే పరిస్థితి ఎదురైంది. గతంలో బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పుల్లో ఇంకా రూ.190 కోట్ల మేర బకాయి ఉంది. చాలాకాలంగా ఈ మొత్తాన్ని తీర్చకపోవటంతో మొండిబకాయిగా ముద్రపడింది.

అసలే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంస్థపై కోవిడ్‌ రెండో దశ మరింత నష్టాలకు నెట్టివేసింది. ప్రస్తుతం ఆదాయం పూర్తిగా పడిపోయింది. దీంతో జీతాలు కూడా చెల్లించే పరిస్థితి లేకుండా పోయింది. మరోవైపు అద్దె బస్సు నిర్వాహకులకు ఐదు నెలలుగా రూ.100 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. దీంతో బస్సుల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఆర్టీసీ సహకార పరపతి సంఘం బకాయిలు దాదాపు రూ.2 వేల కోట్లు అలాగే ఉన్నాయి. ఇప్పటి వరకు కోవిడ్ మహమ్మారి కారణంగా ఆర్టీసీకి రూ. 2,600 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. మొత్తంగా చూస్తే టీఎస్‌ఆర్‌టీసీ రూ.4600 కోట్ల మేరకు అప్పుల్లో కూరుక్కుపోయింది. దీంతో ఆర్టీసీ చెల్లించాల్సిన బ్యాంకులోన్లు, సిసిఎస్, పీఎఫ్ బకాయిలు పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరడంతో బడ్జెట్‌లో కేటాయించిన మొత్తంలోంచి రూ.1,000 కోట్లను ప్రభుత్వ పూచీకత్తు రుణంగా ఇచ్చేందుకు అంగీకరించింది.

ఆ మేరకు పూచీకత్తు జారీ చేసింది. దానికి స్పందించిన బ్యాంకు అఫ్ ఇండియా రూ.1,000 కోట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. అయితే, రూ.190 కోట్ల అప్పు మరో బ్యాంకుకు బకాయిపడి చాలాకాలం కావ టంతో, అది చెల్లిస్తేగానీ రూ.1,000 కోట్ల కొత్త అప్పు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చి చెప్పింది. ఈనేపథ్యంలో బ్యాంకు అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. దీంతో ఆ రూ.190 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం తరుఫున సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. దీంతో తెలంగాణ ఆర్టీసీకి రూ.1,000 కోట్లు రుణం ఇచ్చేందుకు బ్యాంకు అఫ్ ఇండియా అంగీకరించింది.

Tsrtc

Read Also… Jayalalitha Death: ఆర్ముగస్వామి కమిషన్ ద్వారానైనా జయలలిత మరణ రహస్యం వీడేనా? ప్రజల అనుమానాలు తీరేనా?