Hyderabad: ఘోర రోడ్డు ప్రమాదం! కుటుంబమంతా స్పాట్‌ డెడ్.. మధ్యాహ్నం వస్తానని అంతలోనే..

మేడ్చల్ జిల్లా పరిధిలోని బాచుపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందని నలుగురు సభ్యులు సోమవారం (జులై 18) ఉదయం జరిగిన ఘోర కారు ప్రమాదంలో..

Hyderabad: ఘోర రోడ్డు ప్రమాదం! కుటుంబమంతా స్పాట్‌ డెడ్.. మధ్యాహ్నం వస్తానని అంతలోనే..
Bachupalli Road Accident
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 19, 2022 | 4:36 PM

Bachupalli family died in road accident: మేడ్చల్ జిల్లా పరిధిలోని బాచుపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందని నలుగురు సభ్యులు సోమవారం (జులై 18) ఉదయం జరిగిన ఘోర కారు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకెళ్తే.. బాచుపల్లి క్రాంతినగర్‌ కాలనీలో నివాసముంటున్న పూర్ణిమా రంజన్‌ (30) స్థానికంగా ఉన్న సిల్వర్‌ ఓక్స్‌ స్కూల్‌లో మూడేళ్లుగా ఇంగ్లిష్‌ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఈమె భర్త ప్రదీప్‌ సక్సేనా (35) ప్రైవేటు ఉద్యోగి. వీరికి కుమారుడు జతిన్‌ (12), కుమార్తె మోహిన్‌ (7) సంతానం. మోహిన్‌ కూడా తల్లి పనిచేస్తున్న పాఠశాలలోనే మూడో తరగతి చదువుతోంది. వరుస వర్షాల నేపథ్యంలో తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పూర్ణిమా కుటుంబ సభ్యులతో కలిసి వారి సొంత కారులో బయటకు వెళ్లారు. ఐతే సరదాగా ఇంటినుంచి బయటికి వెళ్లిన వీరిని లారీ రూపంలో మృత్యువు కబలించింది.

కర్ణాటక రాష్ట్రం సింధనూరు పట్టణం దాటి హైదరాబాద్‌ వైపు వెళ్తుండగా బాలయ్య క్యాంపు వద్ద ఎదురుగా వస్తున్న లారీ హఠాత్తుగా కారును ఢీకొట్టి, తుప్పల్లోకి ఈడ్చుకుపోయింది. ఈ ఘటనలో కారు నుజ్జవ్వగా అందులోనున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న బెళగానూరు గ్రామీణ పోలీసులు హుటాహుటీనా అక్కడికి చేరుకుని జేసీబీ సహాయంతో మృత దేహాలను బయటికి తీశారు. మృతులు ప్రదీప్‌ సక్సేనా, పూర్ణిమ, జతిన్‌, మోహిన్‌గా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్‌ పరారయ్యాడు. మృతదేహాలను సింధనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో మోహిన్‌ చదువుతున్న పాఠశాల గుర్తింపు కార్డు దొరకడంతో ప్రమాద సమాచారాన్ని పోలీసులు స్కూలుకు అందించడంతో ఈ వార్త వెలుగులోకొచ్చింది.