Asaduddin Owaisi: మజ్లీస్ ఎంపీ ఓవైసీ జిమ్‌లో వర్కౌట్స్.. నెట్టింట వీడియో వైరల్
యువత ఆరోగ్యంగా ఉండాలన్నా, చెడు అలవాట్ల బారిన పడకుండా జాగ్రత్త పడాలన్నా క్రమం తప్పకుండా వ్యాయామం అలవాటు చేసుకోవాలని, తద్వారా మంచి ఫలితాలు ఉంటాయని హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు, AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ సూచించారు. తాజాగా ఏర్పాటు చేసిన ఓ జిమ్ ప్రారంభోత్సవానికి హాజరైన ఓవైసీ యువతకు పలు కీలక సూచనలు చేశారు. మంచి ఆరోగ్యానికి వ్యాయామం అలవాటు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు.

హైదరాబాద్ నగరం పాతబస్తీ తాడ్‌బన్ ప్రాంతంలో కొత్తగా ఏర్పాటు చేసిన జిమ్ ప్రారంభోత్సవానికి హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు, AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జిమ్‌లోని పరికరాలపై స్వయంగా వ్యాయామం చేసి అక్కడి యువతను ఆకట్టుకున్నారు. సమాజంలో నేటి యువతే రేపటి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తారని, యువత ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండడం ఎంతో అవసరం అని యువకులను ఉద్దేశించి మాట్లాడారు. ఓవైసీ మాట్లాడుతూ.. ఎదుగుతున్న వయసులోనే చెడు దారులు తొక్కే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ఈ వయసులో క్రమశిక్షణ చాలా అవసరం అని అన్నారు. యవ్వనంలో ఎంచుకునే మార్గం బట్టి భవిష్యత్తు ఎలా ఉండాలో ఒక అవగాహన ఏర్పడుతుందని, అప్పుడే విజయాలు సాధించే అవకాశం ఉంటుందని తెలిపారు. అందువల్ల యువత ఆరోగ్యంగా ఉండాలన్నా, చెడు అలవాట్ల బారిన పడకుండా జాగ్రత్త పడాలన్నా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం రోజువారీ దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యాన్ని సమతుల్యంగా ఉంచుకోవడానికి వ్యాయామమే ఉత్తమ మార్గమని, శారీరక దృఢత్వం మానసిక బలాన్ని సైతం పెంపొందిస్తుందని ఆయన అన్నారు.
ఇదిలా ఉండగా.. ఓవైసీ యువతను ప్రోత్సహించే తీరుకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల ముందర ప్రసంగాల ద్వారా తన అభిప్రాయాలను బలంగా వ్యక్తపరుస్తూ, మరోవైపు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ యువతకు ఒక ఆదర్శంగా నిలుస్తున్నారని పలువురు అభిమానులు అభిప్రాయపడ్డారు. ఓవైసీ మాటల్లోనే కాదు.. ఆచరణలోనూ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారని పొగుడుతున్నారు. ఓవైసీ అవలంభించే విధానాలు, క్రమశిక్షణ చూసి యువత ఎంతో నేర్చుకోవచ్చని, భవిష్యత్తులో మరింత రాణించేలా ప్రేరణ పొందవచ్చని అభిప్రాయపడ్డారు. కాగా, తాడ్‌బన్ జిమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న వారంతా ఓవైసీ వ్యాయామ నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. జిమ్ పరికరాలను సులభంగా వినియోగిస్తూ ప్రావీణ్యం చూపిన ఓవైసీని అభినందించారు. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనే సందేశాన్ని తన నడవడికతో నిరూపిస్తూ, యువతకు వ్యాయామం ఎంత ముఖ్యమో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తన ప్రసంగంలో గుర్తు చేశారు.
ఇది చదవండి: ఆరుగురు వ్యక్తులు, మూడు కార్లు.. ORRపై దూసుకొస్తున్న కాన్వాయ్.. డౌట్ వచ్చి ఆపి చూడగా
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




