Medak: ఆపరేషన్ సింధూర్‌లో పాల్గొన్న సైనిక వీరుడికి అపూర్వ స్వాగతం
మెదక్ జిల్లా శివంపేట్ మండలం పెద్ద గొట్టుముక్కల గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ సింగిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఆపరేషన్ సింధూర్‌లో పాల్గొని స్వగ్రామానికి తిరిగి చేరుకున్న సందర్భంగా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. డప్పు చప్పులు, పూలవర్షంతో ఊరిలోకి ఆహ్వానించిన వారు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆయనకు సన్మానం చేశారు.

మెదక్ జిల్లా శివంపేట్ మండలం పెద్ద గొట్టుముక్కల గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ సింగిరెడ్డి మధుసూదన్ రెడ్డికి స్వగ్రామంలో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఆయన ఆపరేషన్ సింధూర్‌లో పాల్గొని విజయవంతంగా మళ్లీ స్వగ్రామానికి చేరుకున్న సందర్భంగా గ్రామంలో వేడుకలు నిర్వహించారు. డప్పు చప్పులు, పూలవర్షంతో ఆయనను ఊరిలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ZPHS హై స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఆయనకు సన్మానం చేసి అమర జవాన్లకు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సింగిరెడ్డి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ “పోలీస్ ట్రైనింగ్‌కు ప్రయత్నించి విఫలమయ్యాను. ఆర్మీ సెలక్షన్‌లో 14 సార్లు ఫెయిలయ్యాను. కానీ 15వ సారి సెలక్షన్ సాధించాను. ధైర్యం, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే” అని స్పష్టం చేశారు. మధుసూదన్ రెడ్డి 11 సంవత్సరాలుగా భారత సైన్యంలో సేవలందిస్తున్నారు. కాశ్మీర్, రాజోలి, పుంచ్ ప్రాంతాల్లో గస్తీ విధులు నిర్వహించారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్‌లో పాల్గొని.. అక్కడ గస్తీ విధులు నిర్వహించినట్లు తెలిపారు. గ్రామస్తుల స్వాగతంపై మధుసూదన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేస్తూ..“భారత సైన్యం బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది. ఇలాంటి స్వాగతం నా జీవితంలో మరచిపోలేను” అని చెప్పారు. గ్రామస్థులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇలా జవాన్‌కు ఘన సన్మానం చేయడంతో ఆ ఊరంతా పండుగ వాతావరణం కనిపించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..