Telangana: పాఠశాలల్లో ఇక ముద్ద అన్నానికి గుడ్ బై.! విద్యార్ధులకు ఇది కదా కావాల్సింది..
పాఠశాల విద్యార్ధులకు ఇది కదా కావాల్సింది. ఇక ముద్ద అన్నానికి గుడ్ బై చెప్పాల్సిందే. రాష్ట్రంలోని స్కూల్స్‌కి స్టీమ్ రైస్ అందిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా. ఓ సారి లుక్కేయండి.

సర్కారు బడుల్లో మధ్యాహ్న భోజనం లక్షలాది పిల్లల కడుపు నింపే పథకం. ఆకలి తగ్గించడమే కాదు, చదువుపై దృష్టి పెంచడమే లక్ష్యం. కానీ ఈ పథకంలో ఒక చిన్న సమస్య చాలా రోజులుగా చర్చనీయాంశంగా మారింది ముద్ద అన్నం. కొత్త బియ్యంతో వండుతున్న భోజనం తినడానికి ఇబ్బందిగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు. వండిన తర్వాత అన్నం అతుక్కుపోయి ముద్దగా మారుతోంది. కారణం ఏంటంటే.. కొత్త బియ్యంలో ఉండే అధిక తేమ. పాత బియ్యంలా పొడిగా మారడానికి కొంతకాలం నిల్వ అవసరం. కానీ రాష్ట్ర స్థాయిలో అంత పెద్ద పరిమాణంలో నిల్వ చేయడం సాధ్యం కాకపోవడంతో సమస్య కొనసాగుతోంది.
ఇప్పుడు ఈ ఇబ్బందికి సీఎం రేవంత్ ప్రభుత్వం పరిష్కారం చేసింది. మార్చి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలకు స్టీమ్ రైస్ సరఫరా చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. వడ్లను మిల్లింగ్‌కు ముందే ఆవిరితో ప్రాసెస్ చేస్తారు. దీంతో గింజలు గట్టిగా మారి విరగవు. ముఖ్యంగా యాసంగి వడ్లలో గింజలు ఎక్కువగా విరిగే సమస్య తగ్గుతుంది. వండిన తర్వాత అన్నం ముద్దగా కాకుండా పొడిపొడిగా ఉంటుంది.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది పాఠశాల విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం కింద భోజనం పొందుతున్నారు. అదనంగా 10 లక్షల మందికి పైగా సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు కూడా ఈ సరఫరాపై ఆధారపడి ఉన్నారు. వీరందరికీ ఇకపై మెరుగైన నాణ్యతతో భోజనం అందనుంది. ఆకలి తీర్చడమే కాదు.. రుచితో తినేలా చేయడమే ఇప్పుడు ప్రభుత్వ లక్ష్యం. ఇక బడుల్లో ముద్ద అన్నం కాకుండా పొడి పొడి, రుచికరమైన భోజనం పిల్లల ముందుకు రానుంది.
