Telangana: మళ్లీ ఢిల్లీ చేరనున్న ధాన్యం కొనుగోలు పంచాయితీ.. కేంద్రాన్ని నిలదీయనున్న టీ.మంత్రులు
తెలంగాణ మంత్రుల బృందం ఇవాళ ఢిల్లీ వెళ్లనుంది. పలువురు కేంద్ర మంత్రులతో పాటు, ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్‌మెంట్ కోరనున్నారు.

తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీల బృందం ఇవాళ ఢిల్లీ వెళ్లనుంది. పలువురు కేంద్ర మంత్రులతో పాటు, ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్‌మెంట్ కోరనున్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రానికి తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీల బృందం విజ్ఞప్తి చేయనుంది. తెలంగాణ మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ సహా పార్లమెంట్ సభ్యులు ఢిల్లీ వెళ్తున్నారు. కేంద్రం రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందంటూ తెలంగాణ ప్రభుత్వం మండిపడుతోంది. ఏడేళ్లలో తెలంగాణకు ఏమిచ్చారని ప్రశ్నిస్తోంది. ఈ విషయంలో కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకొచ్చేందుకు తెలంగాణ మంత్రుల ఢిల్లీ పర్యటన దోహదపడుతుందని అధికార టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
కేంద్రం ఇచ్చిన 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ దాదాపుగా పూర్తయింది. మిగిలిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలని కోరేందుకు ఢిల్లీకి వెళ్తున్నామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వానాకాలం పంటంతా కొంటామని కేంద్ర మంత్రి గతంలో హామీ ఇచ్చి ఇప్పుడు మాట మార్చారన్నారు. రాతపూర్వకంగా ఇచ్చిన హామీకే దిక్కులేదు.. నోటి మాటలకు విలువ ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమైన కిషన్ రెడ్డి.. తెలంగాణ నుంచి ధాన్యం సేకరణ పరిమితి పెంచాలని విజ్ఞప్తి చేశారు. రైతు సంక్షేమం కోసం మోదీ సర్కారు పనిచేస్తోందన్న కిషన్‌రెడ్డి.. నిబంధనల కన్నా ఎక్కువ ధాన్యమే FCI సేకరిస్తోందని చెప్పారు. 2014-15 ఖరీఫ్ సీజన్‌లో తెలంగాణ రైతులకు చెల్లించిన మద్దతు ధరతో పోలిస్తే.. ప్రస్తుతం 700 రెట్లు ఎక్కువ మొత్తం చెల్లిస్తున్నామన్నారు. రాష్ట్రానికి సేకరణ ఖర్చులు, MSPలో 1శాతం డ్రైయేజ్, సొసైటీలకు కమీషన్ అదనంగా ఇస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు.
Also Read..
RRR మూవీలో తారక్ ఉపయోగించిన బైక్ గురించి ఆసక్తికర విషయాలు.. అందుకోసం జక్కన్న రీసెర్చ్
SSC exam క్యాలెండర్ విడుదల.. ఏ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారో తెలుసుకోండి..
