Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. టైమింగ్స్ చూశారా?
రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాలకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. ఏపీ, తెలంగాణ మీదగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రానుంది. ఈ మేరకు రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ రైలు తెలుగు రాష్ట్రాల మీదుగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ వెళ్లడం ప్రయాణికులకు మరికాస్త ప్రయోజనకరంగా ఉండనుంది. ఈ రైలు చర్లపల్లి జంక్షన్ నుంచి తిరువనంతపురం మధ్య సర్వీసు అందిస్తుంది.

తెలంగాణ రాష్ట్రానికి మరో కీలక రైలు సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే చర్లపల్లి–ముజఫర్‌పూర్ మధ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ నడుస్తుండగా, ఇప్పుడు చర్లపల్లి (హైదరాబాద్) – తిరువనంతపురం మధ్య మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం కానుంది. ఇది తెలంగాణకు రెండో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ కావడం విశేషం. ఈ రైలును 2026 జనవరి 23న ప్రధాని నరేంద్ర మోదీ కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం నుంచి జెండా ఊపి ప్రారంభించనున్నారు. అదే రోజున దేశవ్యాప్తంగా నాలుగు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని ప్రారంభించనున్నారు. అందులో ఒకటి తెలంగాణకు కేటాయించబడడం రాష్ట్రానికి ప్రాధాన్యత పెరిగినట్టుగా భావిస్తున్నారు.
ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ వారానికి ఒకసారి సర్వీసు అందిస్తుంది. రైలు నంబర్ 17041 ప్రతి మంగళవారం ఉదయం 7:15 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి, మరుసటి రోజు బుధవారం మధ్యాహ్నం 2:45 గంటలకు తిరువనంతపురం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 17042 ప్రతి బుధవారం సాయంత్రం 5:30 గంటలకు తిరువనంతపురం నుంచి బయలుదేరి, గురువారం రాత్రి 11:30 గంటలకు చర్లపల్లి చేరుతుంది.
ఈ రైలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది. తెలంగాణలో నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్లలో ఆగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, నెల్లూరు, ఒంగోలు వంటి ప్రధాన కేంద్రాలు, తమిళనాడులో కోయంబత్తూర్, సేలం, ఎరోడ్, కాట్పాడి.. కేరళలో పాలక్కాడు, త్రిశూర్, ఎర్నాకులం, కొట్టాయం, కొల్లం, వర్కల మీదుగా తిరువనంతపురానికి చేరుకుంటుంది. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఆధునిక సాంకేతికతతో, స్వదేశీ డిజైన్‌లో రూపొందించారు. తక్కువ ధరల్లోనే మెరుగైన ప్రయాణ సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా ఈ రైలును ప్రవేశపెట్టారు.
ఈ రైలులో నాన్-ఏసీ అయినా కంఫర్టబుల్ సీటింగ్ & స్లీపింగ్ ఏర్పాట్లు ఉన్నాయి. ఫోల్డబుల్ స్నాక్ టేబుల్స్, మొబైల్, వాటర్ బాటిల్ హోల్డర్లు, రాత్రి వేళల్లో స్పష్టత కోసం రేడియం ఫ్లోర్ స్ట్రిప్స్ , ఫాస్ట్ చార్జింగ్ పాయింట్లు, ఎలక్ట్రో-న్యూమాటిక్ ఫ్లష్‌తో ఆధునిక టాయిలెట్లు, ఫైర్ డిటెక్షన్ & సేఫ్టీ సిస్టమ్, దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు వంటివి ఉన్నాయి. అందుబాటు ధరల్లోనే దీర్ఘదూర ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఈ రైలు అందించనుంది. ప్రారంభ రోజైన జనవరి 23న, తిరువనంతపురం నుంచి చర్లపల్లికి వెళ్లే రైలు ప్రత్యేక రైలు నంబర్ 02029తో నడుస్తుంది. ఈ ప్రత్యేక రైలు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతూ శనివారం సాయంత్రం చర్లపల్లి చేరుకుంటుంది.
ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు కూడా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కొత్త రైలు ప్రారంభంతో తెలంగాణ నుంచి కేరళకు వెళ్లే ప్రయాణికులకు మరింత సులభమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, యాత్రికులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




