Telangana: ఉపాధి పనుల్లో తవ్వకాలు జరుపుతుండగా బయటపడింది చూసి ఆశ్చర్యం
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని నల్లవెల్లి-తమ్మలోని గూడ గ్రామాల మధ్య సోమవారం తమ్మలోనిగూడ గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు రోడ్డు పనులు చేస్తుండగా శ్రీరామచంద్ర స్వామి విగ్రహం లభ్యమైంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి...

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విసృత స్థాయిలో ఉపాధి హామి పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పలుచోట్ల తవ్వకాలు జరుపుతుండగా పురాతన విగ్రహాలు.. నిధి, నిక్షేపాలు బయటపడుతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని నల్లవెల్లి-తమ్మలోని గూడ గ్రామాల మధ్య.. పనులు చేస్తుండగా… పురాతన శ్రీరామచంద్ర స్వామి రాతి విగ్రహం బయటపడింది. సోమవారం తమ్మలోనిగూడ గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు… భట్టు కృష్ణయ్య అనే రైతు చేనులో మట్టి తవ్వుతుండగా పెద్ద శబ్ధం రావడంతో.. గడ్డపారకు బండరాయి తగిలిందని భావించారు. దీంతో ముగ్గురు వ్యక్తులు అతి కష్టం మీద.. ఆ రాయిని బయటకు తీశారు. అయితే ఆ రాయిపై చెక్కిన ఆకారం ఉండటంతో.. ఏదో విగ్రహమని వారికి అర్థమైంది. వెంటనే నీటితో క్లీన్ చేయగా.. ఆ రామయ్య తండ్రి విగ్రహంగా గుర్తించారు. దీంతో వెంటనే కూలీలంతా పసుపు, కుంకుమ చల్లి కొబ్బరికాయలు కొట్టారు. విషయాన్ని స్థానిక అధికారులకు తెలియజేశారు. కాగా బయల్పడిన విగ్రహం రాతి యుగం నాటిదని పలువురు కూలీలు తెలిపారు.
కాగా, కూలీలకు ఆ విగ్రహాన్ని పురావస్తు శాఖ అధికారులతో పరీక్ష చేయించనున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. విగ్రహాన్ని వెంటనే స్టేషన్‌కు తరలించాలని, మంగళవారం పురావస్తు శాఖ అధికారుల చేత పరీక్ష చేయిస్తే వాస్తవాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు. కాగా విగ్రహం లభ్యమైందనే విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి శ్రీ రాముడ్ని దర్శించుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
