Amit Shah in Munugode Highlights: బీజేపీ దూకుడు.. సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన అమిత్‌ షా..

Sanjay Kasula

| Edited By: Subhash Goud

Updated on: Aug 21, 2022 | 8:24 PM

Amit Shah in Munugode Highlights: మునుగోడు ఉపఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచింది. ఇంకా షెడ్యూల్ ఖరారు కాలేదు. నోటిఫికేషన్ రాలేదు. అయినా అ..

Amit Shah in Munugode Highlights: బీజేపీ దూకుడు.. సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన అమిత్‌ షా..
Amit Shah

Amit Shah in Munugode Highlights: మునుగోడు ఉపఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచింది. ఇంకా షెడ్యూల్ ఖరారు కాలేదు. నోటిఫికేషన్ రాలేదు. అయినా అప్పుడే రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అన్ని పార్టీలు ప్రచారాన్ని మొదలు పెట్టేశాయి. బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నాయి. మునుగోడులో ఇవాళ నిర్వహించనున్న సభకు బీజేపీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆత్మగౌరవ సభ పేరుతో నిర్వహిస్తున్న ఈ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amit Shah)సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komatireddy Rajagopal Reddy) చేరనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు సీఎం కేసీఆర్‌ సవాల్‌ విసిరిన నేపథ్యంలో ఆదివారం సభపై పొలిటికల్‌ హీట్‌ పెరుగుతోంది. సాయంత్రం 5 గంటలకు బీజేపీ సభ జరగబోతోంది. ఢిల్లీ నుంచి అమిత్ షా ఈ సభకు హాజరవుతున్నారు. ఈ వేదిక మీదే మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. బీజేపీ తీర్ధం పుచ్చుకుంటారు. ఆ పార్టీ నుంచి అతనే బరిలోకి దిగడం గ్యారంటీ. ఈ సందర్భంగా భారీగా చేరికలు ఉంటాయనే చర్చ జరుగుతోంది. దుబ్బాక, హుజూరాబాద్ గెలుపుతో జోష్ మీద ఉన్న కమలం సేనలు అదే ఉత్సాహాన్ని మునుగోడులోనూ చూపించేందుకు సిద్ధమవుతున్నాయి.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 21 Aug 2022 06:57 PM (IST)

    ప్రధాని ఇస్తున్న టాయిటెట్స్‌లోనూ అవినీతి

    ఎనిమిదేళ్ల పాలనలో కేసీఆర్‌ చేసిందేమీ లేదన్నారు అమిత్‌ షా. పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇస్తానన్న కేసీఆర్‌.. ప్రధాని ఇస్తున్న టాయిలెట్లలోనూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు అమిత్‌ షా.

  • 21 Aug 2022 06:56 PM (IST)

    కేసీఆర్‌ మాట తప్పారు: అమిత్‌ షా

    తెలంగాణలోని కేసీఆర్‌ ప్రభుత్వం ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదన్నారు అమిత్‌ షా. తెలంగాణ వచ్చాక విమోచన దినోత్సవం నిర్వహిస్తానన్న కేసీఆర్‌ మాట తప్పారని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాగానే.. ప్రతీ ఏటా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు.

  • 21 Aug 2022 06:55 PM (IST)

    వచ్చే ఎన్నికల నాటికి కేసీఆర్‌ వెళ్లిపోవడం ఖాయమన్నారు: అమిత్‌ షా

    మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాలకు పెనుమార్పునకు నాంది అన్నారు అమిత్‌ షా. ఇది కేవలం రాజగోపాల్‌ రెడ్డి చేరిక సభ కాదన్న అమిత్‌ షా.. వచ్చే ఎన్నికల నాటికి కేసీఆర్‌ వెళ్లిపోవడం ఖాయమన్నారు.

  • 21 Aug 2022 06:54 PM (IST)

    కేసీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించిన అమిత్‌ షా

    ప్రతీ దళిత కుటుంబానికి 10 లక్షలు అందిస్తామని హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ చెప్పారు.. ఎంత మంది దళితులకు 10 లక్షల రూపాయలు అందాయని ప్రశ్నించారు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు.. ఎవరికైనా అందిందా..? అంటూ అమిత్‌ షా ఉద్వేగంతో ప్రశ్నించారు. 2014 నుంచి టీచర్ల నియామకాలు ఆపేశారని, గిరిజనులకు ఎకరం భూమి ఇస్తాను అన్నారు.. ఎవరికైనా ఇచ్చారా..? అంటూ ప్రశ్నించారు అమిత్‌ షా. బీజేపీ అధికారంలోకి వస్తే దొడ్డు బియ్యం మొత్తం కొంటామని, దొడ్డు బియ్యం విషయంలో తెలంగాణ ప్రభుత్వం తప్పుడు మాటలు చెబుతోందని అమిత్‌ షా దుయ్యబట్టారు.

  • 21 Aug 2022 06:45 PM (IST)

    కేసీఆర్‌ పేదలకు ఇల్లు ఇస్తామన్నారు..? ఇచ్చారా..?

    తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్‌ ఇల్లు ఇస్తామన్నారు..? ఇచ్చారా? అని అమిత్‌ షా ప్రశ్నించారు. అలాగే తెలంగాణలో దళితుడిని సీఎం చేస్తానని చెప్పారు.. కానీ ఇంత వరకు అలా జరగలేదన్నారు. మీరిచ్చిన మాట నిలబెట్టుకున్నారా..? అని ప్రశ్నించారు అమిత్‌ షా. ప్రధాని మోడీ ఇచ్చే టాయిలెట్లను కూడా కేసీఆర్‌ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. మళ్లీ గెలిపిస్తే కేసీఆర్‌ స్థానంలో కేటీఆర్‌ వస్తారని, అలాంటిది ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని అన్నారు.

  • 21 Aug 2022 06:41 PM (IST)

    మజ్లిస్‌కు భయపడి విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదు: అమిత్‌ షా

    తెలంగాణలో మజ్లిస్‌కు భయపడి సీఎం కేసీఆర్‌ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని అమిత్‌ షా ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కిసాన్‌ బీమా యోజన పథకాన్ని అమలు చేయడం లేదని, తాము అధికారంలోకి వస్తే అన్ని పథకాలను రాష్ట్రంలో ప్రవేశపెడతామన్నారు.

  • 21 Aug 2022 06:39 PM (IST)

    ఇచ్చిన మాట అమలు చేయని పాలన కేసీఆర్‌ది: అమిత్‌ షా

    తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామని కేసీఆర్‌ గతంలో చెప్పారని, ఇచ్చిన మాటలు అమలు చేయని పాలన కేసీఆర్‌ది అంటూ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రిని చూస్తారని అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కేసీఆర్‌ ప్రభుత్వం కూలడం ఖాయమన్నారు. మజ్లిస్‌కు భయపడి విమోచన దినోత్సవాన్ని కేసీఆర్‌ నిర్వహించడం లేదని, తాము అధికారంలోకి వచ్చాక అధికారికంగా నిర్వహిస్తామన్నారు.

  • 21 Aug 2022 06:34 PM (IST)

    కేసీఆర్‌ సర్కార్‌ను పడగొట్టేందుకు నేడు రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరారు: అమిత్ షా

    కేసీఆర్‌ సర్కార్‌ను పడగొట్టేందుకు నేడు రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించేలా ఈ మునుగోడు సభను చూస్తుంటే అర్థమవుతోందని అన్నారు. రాజగోపాల్‌రెడ్డిని బీజేపీలోకి చేర్చుకునేందుకు నేను ఇక్కడికి వచ్చానని అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉప ఎన్నికలో రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్‌ సర్కార్‌ పడిపోతుందన్నారు.

  • 21 Aug 2022 06:30 PM (IST)

    భారత్‌ మాతాకి జై అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన అమిత్‌ షా

    తెలంగాణలో అమిత్‌ షా పర్యటన కొనసాగుతోంది. మునుగోడు బీజేపీ సమరభేరి సభకు హాజరైన అమిత్‌ షా భారత్‌ మాతాకి జై అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

  • 21 Aug 2022 06:27 PM (IST)

    కేసీఆర్‌కు నిద్ర పట్టడం లేదు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

    మునుగోడులో బీజేపీ సభ చూస్తుంటే సీఎం కేసీఆర్‌కు నిద్రపట్టడం లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవిని తృణప్రాయంగా వదులుకున్నారన్నారు. మునుగోడు పులిబిడ్డ, నల్లగొండ ముద్దుబిడ్డ రాజగోపాల్‌రెడ్డి అని అన్నారు.

  • 21 Aug 2022 06:18 PM (IST)

    ఎన్నోసార్లు అపాయింట్‌మెంట్‌ అడిగినా సీఎం ఇవ్వలేదు

    తాను ఎన్నో సార్లు సీఎం కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ అడిగినా ఇవ్వలేదని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. మునుగోడులో ఆయన టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌పై మండిపడ్డారు. నన్ను నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయలేక రాజీనామా చేశానని పేర్కొన్నారు. ఉపఎన్నిక అనగానే సీఎం కేసీఆర్‌ మునుగోడుకు వచ్చారు. నా రాజీనామాతో ప్రభుత్వం దిగివచ్చిందన్నారు.

  • 21 Aug 2022 06:13 PM (IST)

    అమ్ముడుపోయే వ్యక్తిని కాను: రాజగోపాల్‌రెడ్డి

    తాను డబ్బులను అమ్ముడుపోయే వ్యక్తిని కానని, నన్ను కొనే శక్తి ప్రపంచంలో పుట్టలేదని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. నేను తలదించుకునేది మునుగోడు ప్రజల కోసమేనని, ఎవరి కోసమే కాదని అన్నారు.

  • 21 Aug 2022 06:04 PM (IST)

    టీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగిన ఈటెల

    మునుగోడు సభలో టీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌. టీఆర్‌ఎస్‌కు సీపీఐ మద్దతివ్వడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్‌ చేసిన ద్రోహాన్ని వామపక్షాలు మరిచిపోయాయా? అని ప్రశ్నించారు. ట్రేడ్‌ యూనియన్లను కేసీఆర్‌ రద్దు చేసినప్పుడు.. లెఫ్ట్‌ పార్టీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

  • 21 Aug 2022 06:01 PM (IST)

    బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి

    మునుగోడులో బీజేపీ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా చేరుకున్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అమిత్‌షా ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఆయనకు షా పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

  • 21 Aug 2022 05:59 PM (IST)

    సభా ప్రాంగణంకు చేరుకున్న అమిత్‌ షా

    మునుగోడులో జరుగుతున్న బీజేపీ బహిరంగ సభా వేదికపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా చేరుకున్నారు. కొద్దిసేపట్లో సభనుద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు. భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు.. అమిత్ షా ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది.

  • 21 Aug 2022 05:56 PM (IST)

    రైతులతో అమిత్‌ షా భేటీ సానుకూలంగా జరిగింది

    రైతులతో అమిత్‌ షా భేటీ సానుకూలంగా జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. సేంద్రీయ వ్యవసాయంపై రైతులతో చర్చించారన్నారు. కొందరు లేనిపోనివి సృష్టిచి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

  • 21 Aug 2022 05:44 PM (IST)

    ఇప్పటికే రాజగోపాల్‌రెడ్డి విజయం ఖాయమైంది

    మునుగోడు బీజేపీ సభలో చూస్తుంటే ఇప్పటికే రాజగోపాల్‌రెడ్డి విజయం ఖాయమైందని అభిప్రాయపడ్డారు ఈటెల రాజేందర్‌. కేసీఆర్‌ చేసిన ద్రోహాన్ని కమ్యూనిస్టులు మర్చిపోయారా..? ఆర్టీసీ ట్రేడ్‌ యూనియన్లు రద్దు చేసినప్పుడు ఎక్కడున్నారు.. అని ప్రశ్నించారు.

  • 21 Aug 2022 05:41 PM (IST)

    కేసీఆర్‌కు మోడీ భయం పట్టుకుంది: ఈటెల

    సీఎం కేసీఆర్‌ మోడీ భయం పట్టుకుందని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ అన్నారు. ధర్నా చౌక్‌ను నిషేధించిన కేసీఆర్‌కు లెఫ్ట్‌ పార్టీర మద్దతా..? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్‌ ప్రభుత్వం పోవాలన్నదే తెలంగాణ ప్రజల తపన అని అన్నారు.

  • 21 Aug 2022 05:39 PM (IST)

    బీజేపీ మీటింగ్‌ సక్సెస్‌ కావొద్దన్నదే కేసీఆర్‌ కుట్ర: ఈటెల రాజేందర్‌

    మునుగోడులో బీజేపీ సభ కొనసాగుతోంది. కొద్దిసేపట్లో అమిత్‌ షా సభా వేదికపైకి రానున్నారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్‌ మాట్లాడుతూ.. బీజేపీ మీటింగ్‌ సక్సెస్‌ కావొద్దన్నదే సీఎం కేసీఆర్‌ కుట్ర అని అన్నారు. అందుకే ఒక రోజు ముందు సభ పెట్టుకున్నారన్నారు.

  • 21 Aug 2022 05:30 PM (IST)

    అమిత్‌ షా ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ

    కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా మునుగోడు సభలో ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నిన్న సీఎం కేసీఆర్‌ చేసిన విమర్శలకు కౌంటర్‌ ఇస్తారా..? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

  • 21 Aug 2022 05:26 PM (IST)

    సభా ప్రాంగణంకు అమిత్‌ షా

    మునుగోడుకు చేరుకున్న అమిత్‌ షా.. కొద్దిసేపట్లో బీజేపీ బహిరంగ సభా ప్రాంగాణానికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

  • 21 Aug 2022 05:21 PM (IST)

    బీజేపీలో చేరనున్న రాజగోపాల్‌రెడ్డి

    కేంద్ర మంత్రి అమిత్‌ షా మునుగోడుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అమిత్‌షా ఆధ్వర్యంలో బీజేపీలో చేరనున్నారు. పార్టీ కండువా కప్పునకొనున్నారు.

  • 21 Aug 2022 05:08 PM (IST)

    మునుగోడుకు చేరుకున్న అమిత్‌ షా

    తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పర్యటిస్తున్నారు. మునుగోడులో జరిగే బీజేపీ భారీ బహిరంగ సభకు అమిత్‌షా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరిన అమిత్‌ షా.. మునుగోడుకు చేరుకున్నారు.

  • 21 Aug 2022 05:01 PM (IST)

    మునుగోడు ప్రజల ధర్మ యుద్ధం: రాజగోపాల్‌రెడ్డి

    మునుగోడులో బీజేపీ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మాట్లాడారు. ఇది మునుగోడు ప్రజల ఆత్మగౌరవ సభ అన్నారు. మునుగోడు ప్రజల ధర్మ యుద్ధమని.. కేసీఆర్‌ కుటుంబ పాలన అంతానికి.. మునుగోడు నుంచే నాంది పలుకుతామని చెప్పారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

  • 21 Aug 2022 04:59 PM (IST)

    కాషాయంగా మారిన మునుగోడు

    మునుగోడు సమరభేరి సభకు సర్వం సిద్ధమైంది. ఎటుచూసినా కాషాయజెండాల రెపరెపలతో ఫుల్ జోష్‌ కనిపిస్తోంది. ‘ప్రజాదీవెన’ సభకు దీటుగా బీజేపీ ‘సమరభేరి’ సభ నిర్వహిస్తుంది. సమరభేరి సభకు కేంద్రమంత్రులు అమిత్‌షా, కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, తరుణ్ చుగ్ హాజరయ్యారు.

  • 21 Aug 2022 04:22 PM (IST)

    మునుగోడు బయలుదేరిన అమిత్‌ షా

    కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన కొనసాగుతోంది. మునుగోడు బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఆయన బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో మునుగోడుకు బయలుదేరారు. అక్కడ సీఆర్పీఎఫ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించి బహిరంగ సభకు హాజరవుతారు.

  • 21 Aug 2022 04:07 PM (IST)

    మునుగోడు సమరభేరి సభకు సర్వం సిద్ధం

    మునుగోడు సమరభేరి సభకు సర్వం సిద్ధమైంది. ఎటుచూసినా కాషాయజెండాల రెపరెపలతో ఫుల్ జోష్‌ కనిపిస్తోంది. ‘ప్రజాదీవెన’ సభకు దీటుగా బీజేపీ ‘సమరభేరి’ సభకు జన సమీకరణ చేస్తున్నారు. మునుగోడు వేదికగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బలప్రదర్శన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో మరింత బలపడేందుకు మునుగోడును టార్గెట్‌గా పెట్టుకున్న బీజేపీ.. కేసీఆర్‌కి ఇప్పుడు ఎలాంటి కౌంటర్ ఇస్తారనేది చూడాలి.

  • 21 Aug 2022 04:00 PM (IST)

    నేనూ ఆర్గానిక్‌ వ్యవసాయమే చేస్తున్నా: అమిత్‌ షా

    బేగంపేట విమానాశ్రయంలో రైతులతో సమావేశమైన అమిత్‌ షా పలు అంశాలపై చర్చించారు. రైతులతో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను కూడా ఆర్గానిక్‌ వ్యవసాయమే చేస్తున్నా. మొత్తం 150 ఎకరాల్లో వ్యవసాయ చేస్తున్నా.. అని అన్నారు. అయితే విద్యుత్‌ చట్టం మార్చాలని రైతులు అమిత్‌ షాను కోరగా, చట్టం కాదు.. ఇక్కడ ప్రభుత్వాన్ని మార్చాలి అని అన్నారు.

  • 21 Aug 2022 03:57 PM (IST)

    నా దగ్గర కూడా 21 ఆవులు ఉన్నాయి.. రైతులతో అమిత్‌షా ఆసక్తికర వ్యాఖ్యలు

    కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన కొనసాగుతోంది. హైదరాబాద్‌కు చేరుకున్న ఆయన బేగంపేట విమానాశ్రయంలో రైతులతో భేటీ అయ్యారు. అనంతరం వారితో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కూడా 150 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నా.. నా దగ్గర 21 ఆవులు ఉన్నాయి. అందులో 12 తరాల ఆవు ఒకటి ఉంది. గో ఆధారిత సాగు చేయాలని రైతులకు సూచించారు.

  • 21 Aug 2022 03:54 PM (IST)

    నేనూ సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నా: అమిత్‌ షా

    నేను సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నానని కేంద్ర మంత్రి అమిత్‌షా అన్నారు. బేగంపేట విమానాశ్రయంలో రైతు సంఘాల నాయకులతో భేటీ అయిన ఆయన.. రైతులతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయంపై పలు విషయాలపై చర్చించారు. గో ఆధారిత సాగు చేయాలని రైతులకు చెప్పారు. తాను 150 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నానని అన్నారు.

  • 21 Aug 2022 03:36 PM (IST)

    రైతు సంఘాల నేతలతో ముగిసిన అమిత్‌షా భేటీ

    బేగంపేట ఎయిర్‌పోర్టులో రైతు సంఘాల నాయకులతో అమిత్‌ షా భేటీ ముగిసింది. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మునుగోడుకు బయలుదేరుతారు. మునుగోడులో సాయంత్రం 4.40 గంటలకు సీఆర్పీఎఫ్‌ అధికారులతో అమిత్‌షా సమీక్ష ఉంటుంది. 5 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు.

  • 21 Aug 2022 03:19 PM (IST)

    రైతు సమస్యలపై చర్చ

    బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న అమిత్‌ షా.. రైతు సంఘాలతో భేటీ అయ్యారు. ఫసల్‌ బీమా యోజన, ధాన్యం కొనుగోలు, రుణ మాఫీ తదితర అంశాలపై రైతులతో చర్చించారు. రైతులకు ఉన్న సమస్యలను అమిత్‌షా తెలుసుకున్నారు. అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి మునుగోడు బహిరంగ సభకు బయలుదేరుతారు.

  • 21 Aug 2022 03:15 PM (IST)

    కాసేపట్లో బేగంపేటలో రైతులతో అమిత్‌ షా భేటీ

    బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షా కొద్దిసేపట్లో రైతు సంఘాత నేతలతో భేటీ కానున్నారు. వ్యవసాయ రంగంలో వినూత్న సేవలు అందిస్తున్న రైతులతో ముచ్చటించనున్నారు.

  • 21 Aug 2022 03:04 PM (IST)

    బేగంపేట విమానాశ్రయానికి బయలుదేరిన అమిత్‌షా

    సికింద్రాబాద్‌లోని సాంబమూర్తినగర్‌లో ఎస్సీ కార్యకర్త ఇంటికి వెళ్లారు అమిత్‌షా. కార్యకర్త నారాయణ ఇంట్లో తేనీరు సేవించారు. అనంతరం బేగంపేట విమానాశ్రయానికి బయలుదేరారు.

  • 21 Aug 2022 03:01 PM (IST)

    బీజేపీ కార్యకర్త ఇంటికి అమిత్‌ షా

    అమిత్ షా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కళాసిగూడలోని బీజేపీ కార్యకర్త సత్యనారాయణ ఇంటికి వెళ్లి కాఫీ తాగనున్నారు. దాదాపు 30నిమిషాల పాటు అక్కడ గడపనున్నారు.

  • 21 Aug 2022 02:43 PM (IST)

    రైతు సంఘాల నేతలతో అమిత్‌షా సమావేశం

    బీజేపీ కార్యకర్త సత్యనారాయణ ఇంట్లో ఆల్పాహారం చేసిన తర్వాత అక్కడి నుంచి బేగంపేటలోని రామ్‌ మనోహర హోటల్‌కు చేరుకుంటారు. అక్కడ రైతుల సంఘాల నేతలతో సమావేశం అవుతారు.

  • 21 Aug 2022 02:41 PM (IST)

    బీజేపీ కార్యకర్త ఇంటికి అమిత్‌ షా

    అమిత్ షా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కళాసిగూడలోని బీజేపీ కార్యకర్త సత్యనారాయణ ఇంటికి వెళ్లి కాఫీ తాగనున్నారు. దాదాపు 30నిమిషాల పాటు అక్కడ గడపనున్నారు.

  • 21 Aug 2022 02:33 PM (IST)

    దర్శనం అనంతరం కార్యకర్తలతో అమిత్‌షా భేటీ

    బేగంపేట్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌.. అక్కడి నుంచి సికింద్రాబాద్‌ మహంకాళి ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బీజేపీ కార్యకర్తలతో భేటీ కానున్నారు.

  • 21 Aug 2022 02:31 PM (IST)

    ఆలయంలో ప్రత్యేక పూజలు

    సికింద్రాబాద్‌ మహంకాళి ఆలయానికి చేరుకున్న అమిత్‌ షా.. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు మునుగోడు సభకు చేరుకుంటారు.

  • 21 Aug 2022 02:30 PM (IST)

    మహంకాశి ఆలయానికి అమిత్‌ షా

    హైదరాబాద్‌లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా పర్యటన కొనసాగుతోంది. బేగంపేట్‌ విమానాశ్రయంకు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు.

  • 21 Aug 2022 02:26 PM (IST)

    అమిత్‌షాకు స్వాగతం

    ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న అమిత్‌షాకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్ సాదర స్వాగతం పలికారు.

  • 21 Aug 2022 02:23 PM (IST)

    నా సత్తా ఏంటో చూపిస్తా- రాజగోపాల్‌ రెడ్డి

    ఇవాళ్టి సభతో తన సత్తా ఏంటో చూపిస్తానంటున్నారు రాజగోపాల్‌ రెడ్డి. తనను ఆశీర్వదించేందుకు భారీ సంఖ్యలో మునుగోడు ప్రజలు తరలి వస్తారని చెబుతున్నారు. అమిత్‌షాకు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారంటున్నారు.

  • 21 Aug 2022 02:23 PM (IST)

    హెలికాప్టర్‌లో మునుగోడుకు..

    సికింద్రాబాద్‌ నుంచి బేగంపేట మనోహర్‌ హోటల్‌కు వెళ్లనున్న అమిత్‌ షా.. అక్కడ రైతు సంఘాల నేతలతో సమావేశం అవుతారు. సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్‌లో మునుగోడుకు బయలర్దేరనున్నారు. సాయంత్రం ఐదింటికి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొననున్నారు.

  • 21 Aug 2022 02:21 PM (IST)

    అమిత్‌షాకు స్వాగతం పలికిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌

    బేగంపేట ఎయిర్‌పోర్టులో ల్యాండైన అమిత్‌షాకు బీజేపీ సీనియర్‌ నేతలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, తరుణ్‌చుగ్‌, డాక్టర్‌ లక్ష్మణ్‌ స్వాగతం పలికారు. బేగంపేట నుంచి సికింద్రాబాద్‌ వెళ్లనున్న అమిత్‌ షా, ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఇప్పటికే, ఆలయ పరిరసరాల్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. ఆ తర్వాత స్థానిక బీజేపీ కార్యకర్త ఇంటికి వెళ్లి.. చాయ్‌ తాగనున్నారు అమిత్‌ షా. ముప్ఫై ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న మంద సత్యనారాయణ.. ప్రస్తుతం ఉజ్జయినీ సికింద్రాబాద్‌ జిల్లా ఎస్సీ మోర్చా సెక్రెటరీగా పనిచేస్తున్నారు.

  • 21 Aug 2022 02:19 PM (IST)

    సభాస్థలిలో భారీ ఏర్పాట్లు..

    మునుగోడులో బీజేపీ ఆత్మగౌరవ సభా ప్రాంగణం కాషాయరంగు పులుముకుంది. భారీ సభా వేదిక.. దానిపై పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. సభాస్థలిలో ఎటు చూసినా మోదీ, అమిత్‌షాల భారీ కటౌట్లు దర్శనమిస్తున్నాయి. వర్షం కురిసినా కార్యకర్తలకు ఇబ్బందిలేకుండా.. ఏర్పాట్లు చేశారు. అడుగడుగునా సెక్యూరిటీని టైట్‌ చేశారు. జాగిలాల సాయంతో జల్లెడ పట్టారు సెక్యూరిటీ సిబ్బంది.

  • 21 Aug 2022 01:23 PM (IST)

    నేడు మునుగోడుకు అమిత్ షా.. షెడ్యూల్‌ ఇదే..

    ఆదివారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ చేరుకోనున్న అమిత్‌ షా.. ఇక్కడ నుంచి హెలికాప్టర్‌లో మునుగోడు సభకు వెళ్లనున్నారు. అక్కడ దాదాపు గంటన్నరపాటు సభలో పాల్గొననున్నారు. సభ అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వచ్చి ముఖ్య నాయకులతో గంటకుపైగా ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై పోరాటాన్ని ఇంకా ఉధృతం చేయడంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.

  • 21 Aug 2022 01:16 PM (IST)

    అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

    Junior Ntr To Meet Amit Sha

    కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణ పర్యటనలో ఊహించని ట్విస్ట్‌ ఇది. అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కాబోతున్నారు. రాత్రికి హైదరాబాద్‌లో జరగబోయే.. డిన్నర్‌ మీటింగ్‌కి ఎన్టీఆర్‌ని అమిత్ షా ఆహ్వానించారు. 15 నిమిషాలపాటు ఈ సమావేశం జరగనుంది. ఇటీవలే RRR సినిమా చూసిన అమిత్‌ షా.. ఎన్టీఆర్ నటనపై ప్రశంసలు కురిపించారు. ప్రత్యేకించి కొమురం భీముడో సాంగ్‌లో ఎన్టీఆర్ నటనకు ఆయన ఫిదా అయ్యారు.

  • 21 Aug 2022 01:13 PM (IST)

    మనుగోడు సమరభేరిగా తరలిరానున్న కాషాయ దళం

    మునుగోడులో బీజేపీ బహిరంగ సభ జరుగుతుంది. హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సభ వేదికగా రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే ఈ సభకు మనుగోడు సమరభేరిగా నామకరణం చేశారు. తమ బలం చాటాలని బీజేపీ నేతలు వ్యూహం రచించారు. అందుకోసం ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. జనసమీకరణ చేస్తున్నారు.

  • 21 Aug 2022 01:06 PM (IST)

    ఓ సామాన్య కార్యకర్త ఇంటికివెళ్లనున్న అమిత్ షా.. అతను ఎవరో తెలుసా..

    ఓ సామాన్య కార్యకర్త ఇంటికివెళ్లనున్నారు అమిత్ షా. బేగంపేట ఎయిర్ ఫోర్ట్ నుంచి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం.. మొండా డివిజన్ సాంబ మూర్తి నగర్‌లోని బీజేపీ కార్యకర్త ఇంట్లో టీ తాగనున్నారు. సాంబమూర్తి నగర్ లో ఉండే మంద సత్యనారాయణ.. 30 సంవత్సరాల నుంచి బీజేపీ కోసం పని చేస్తున్నారు. ప్రస్తుతం సత్యనారాయణ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా ఎస్సీ మోర్చ సెక్రెటరీగా పని చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సత్యనారాయణ ఇంట్లోనే చాయ్ తాగి వారితో కాసేపు మాట్లాడనున్నారు అమిత్ షా.

  • 21 Aug 2022 01:06 PM (IST)

    రాజగోపాల్‌రెడ్డిని పార్టీలోకి చేర్చుకోవడంతో పాటు..

    అమిత్ షా ప్రోగ్రాం టోటల్‌గా పొలిటికల్ యాంగిల్. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డిని పార్టీలోకి చేర్చుకోవడంతో పాటు.. అక్కడ ఉపఎన్నికపై పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు అమిత్ షా వస్తున్నారు.

Published On - Aug 21,2022 1:02 PM

Follow us
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..