CM KCR District Tour: రేపు రాజన్నసిరిసిల్ల జిల్లా పర్యటనకు సీఎం కేసీఆర్.. రూ. 210 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబైంది. ఎటు చూసినా సీఎం ప్లెక్సీలే కనబడుతున్నాయి. అడుగు.. అడుగునా గులాబీ తోరణాలతో ముస్తాబు చేశారు.

CM KCR District Tour: రేపు రాజన్నసిరిసిల్ల జిల్లా పర్యటనకు సీఎం కేసీఆర్.. రూ. 210 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
Cm Kcr Rajanna Siricilla District Tour
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 03, 2021 | 9:14 PM

CM KCR Rajanna Siricilla District Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబైంది. ఎటు చూసినా సీఎం ప్లెక్సీలే కనబడుతున్నాయి. అడుగు.. అడుగునా గులాబీ తోరణాలతో ముస్తాబు చేశారు. జిల్లా మొత్తం పూర్తిగా అధికారుల ఆధీనంలోకి వెళ్లింది. మంత్రి కేటీఆర్.. దగ్గరుండి మరీ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. సుమారుగా రూ. 210 కోట్ల విలువ గల అభివృద్ధి కార్యక్రమాలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.

కార్మిక, ధార్మిక క్షేత్రంగా ఏర్పడిన రాజన్నసిరిసిల్ల జిల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం ఎదురుచూస్తుంది. ఇటీవల జిల్లా కలెక్టర్ల సమావేశంలో ప్రకటించినట్లు సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనలు చేపడుతున్నారు. ఇప్పటికే వరంగల్, యాదాద్రి, కామారెడ్డి జిల్లాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్.. రేపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అభివృద్ధిలో అన్ని జిల్లాల కన్నా ఒక అడుగు ముందున్న సిరిసిల్లలో సరికొత్త భవనాలు, సదుపాయాలు అందుబాటులోకి రాబోతున్నాయి. కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రారంభించబోతున్నారు. పేదవారి సొంతింటి కలను నేరవేర్చడమే కాకుండా పరిపాలన సౌలభ్యం, ఉపాధి మార్గాలను చూపే సంస్థలను కూడా ప్రారంభించనున్నారు.

సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనలో భాగంగా ముందుగా రెండు పడక గదుల నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు. 35 ఎకరాల విస్తీర్ణంలో రూ. 83 కోట్ల వ్యయంతో తంగాళ్లపల్లి మండలం మెడపల్లి గ్రామంలో నిర్మించిన 1,320 ఇళ్లను లబ్ధిదారులకు అందించనున్నారు. అనంతరం నర్సింగ్ విద్యార్ధుల కోసం నూతనంగా నిర్మించిన భవనం కూడా ప్రారంభం కానుంది. ఉచిత విద్యతో పాటు ఉపాధి శిక్షణ ఇచ్చే విధంగా.. అంతర్జాతీయ పాఠశాలను నిర్మించారు. ఐదు ఎకరాల్లో రూ.27.77 కోట్ల వ్యయంతో 5 అంతస్తుల్లో 105 గదులను నిర్మించారు. 400 మంది విద్యార్థులు చదువుకునే విధంగా ఈ పాఠశాల రూపకల్పన జరిగింది.

అదేవిధంగా సర్దాపూర్‌లోని ఆధునిక వ్యవసాయ మార్కెట్ అందుబాటులోకి రానుంది. సిరిసిల్లకు 5 కిలోమీటర్ల దూరంలో 5 ఎకరాల విస్తీర్ణంలో 22 కోట్ల రూపాయల వ్యయంతో మార్కెట్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు, రగుడు గ్రామంలో 98 ఎకరాల విస్తీర్ణంలో 70 కోట్ల రూపాయల వ్యయంతో సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాల నిర్మాణాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి 4 బ్లాక్ లను ఏర్పాటు చేశారు. అదే విధంగా సిరిసిల్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో డ్రైవింగ్ శిక్షణ, పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.

వీటితో పాటు మరికొన్ని అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. కొదురుపాకలో రాత్రి బస చేయనున్నారు సీఎం కేసీఆర్. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ పర్యటించే ప్రాంతాలను అధికారులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

Read Also…  CM KCR Review: ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ కీలక భేటీ.. నీటి పారుదల ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష