Telangana Congress: హస్తం పార్టీ బీసీ అస్త్రం.. ఎక్కడో లెక్క తప్పుతోంది సుమీ..! బీసీలకు 34 సీట్లు సాధ్యమేనా..?
Akarsh 'BC' Voters: కాంగ్రెస్ ప్రకటించిన బీసీ అస్త్రం.. భస్మాసుర హస్తంతో సమానమా? ఈసారి బీసీలకు 34 సీట్లు ఇస్తామంది టి.కాంగ్రెస్. 119 నియోజకవర్గాలను వడగట్టిన రాజకీయ విశ్లేషకులు మాత్రం.. బీసీలకు అన్ని సీట్లు ఇవ్వడం అసాధ్యం అని కన్ఫామ్‌గా చెప్పేస్తున్నారు. బీసీ మంత్రం కాంగ్రెస్‌కు బూమరాంగ్ అవడం పక్కా అంటున్నారు. ఇంతకీ ఏ లాజిక్ ప్రకారం లెక్క మిస్ అయింది?
Akarsh ‘BC’ Voters: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇది నిజంగా తలనొప్పి వ్యవహారమే. తెలంగాణలో ఉన్న అసెంబ్లీ సీట్లు 119. ఇందులో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు 31. కనీసం 35 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సీనియర్లకు టికెట్లు ఇవ్వాల్సిందే. వాళ్లంతా అగ్రవర్ణ నేతలే. ఈ 66 సీట్లలో బీసీలకు నో ఛాన్స్. ఇక మొన్న కాంగ్రెస్ టికెట్ కోసం జరిగిన దరఖాస్తుల ప్రక్రియలో 11 నియోజకవర్గాల్లో ఎక్కడా ఒక్క బీసీ నేత కూడా టికెట్ కోసం అప్లై చేయలేదు. అంటే.. ఈ 77 సీట్లలో బీసీలకు టికెట్లు ఇవ్వడం అసాధ్యం. ఇక మిగిలింది 42 సీట్లు. ఈ 42లో 34 సీట్లు బీసీలకే ఇవ్వాల్సి ఉంటుంది. ఏం.. అంత కచ్చితంగా 34 సీట్లు బీసీలకు ఎందుకు ఇవ్వాలి? గతేడాది ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. దీని ప్రకారం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోని రెండు అసెంబ్లీ స్థానాల్లో కచ్చితంగా బీసీలకు టికెట్లు ఇచ్చి తీరాలి. తెలంగాణలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలున్నాయి. ఒక్కో ఎంపీ సెగ్మెంట్లో రెండు చొప్పున మొత్తం 34 సీట్లు బీసీలకు ఇవ్వాలి. సాధ్యమేనా? మిగిలిన వారికి అవకాశం ఉన్నదే 42 స్థానాలు. అందులో 34 మంది బీసీలకు టికెట్లు ఇవ్వగలరా? అంత బలమైన నేతలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? ఏ ప్రాతిపదికన లెక్కలు కట్టారో గానీ.. ఈసారి కచ్చితంగా 34 సీట్లు బీసీలకు ఇస్తామని బల్లగుద్ది మరీ చెప్పారు.
తెలంగాణలో సగం జనాభా బీసీలే. కాని, పొలిటికల్‌గా రెడ్డి సామాజిక వర్గానిదే డామినేషన్. అందుకే, తెలంగాణలో బీసీలకు ఎక్కువ స్థానాలు కేటాయించలేని పరిస్థితి ఉందనేది రాజకీయ విశ్లేషకుల వాదన. నల్లగొండ పార్లమెంట్ సెగ్మెంటే ఒక ఉదాహరణ. ఈ పార్లమెంట్ నియోజకవర్గం కింద ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దేవరకొండ తప్ప మిగిలినవన్నీ నాన్-రిజర్వ్డ్ సెగ్మెంట్లే. నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, హుజూర్ నగర్, కోదాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీసీలను కూడా నిలబెట్టొచ్చు. కాని, నాగార్జున సాగర్, మిర్యాలగూడ నుంచి జానారెడ్డి కుమారులు, హుజూర్‌నగర్, కోదాడ నుంచి ఉత్తమ్‌కుమార్ రెడ్డి దంపతులు, నల్లగొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అప్లై చేసుకున్నారు. సూర్యాపేటలో రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పటేల్ రమేష్‌రెడ్డిలో ఎవరికో ఒకరికి ఇవ్వాలి. మరి ఇక్కడ బీసీలకు స్థానం ఏది? కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీసీల కోసం తన సీటు వదులుకోడానికి సిద్ధం అన్నారు. అంటే.. మిగిలిన వాళ్లు కూడా త్యాగం చేయాల్సి వస్తుంది. చేస్తారా మరి.. అలా పోటీ నుంచి తప్పుకుంటారా? తప్పుకోకపోతే.. నల్లగొండ పార్లమెంట్ నుంచి ఒక్క బీసీకి కూడా టికెట్ దక్కదు.
ఇక ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ చూద్దాం. ఇక్కడ కొత్తగూడెం, పాలేరు, ఖమ్మం.. ఈ మూడు అసెంబ్లీ స్థానాలు మాత్రమే జనరల్. ఇందులో పాలేరు, ఖమ్మం స్థానాలను పొంగులేటి లేదా తుమ్మలకు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. మిగిలింది కొత్తగూడెం మాత్రమే. అక్కడ సీపీఐకి ఛాన్స్ ఇస్తామంటున్నారు. ఈ లెక్కన ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్‌లోనూ ఒక్క బీసీకి కూడా అసెంబ్లీ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇక మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఒక్క నర్సంపేట అసెంబ్లీ మినహా మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లన్నీ రిజర్వ్‌డ్ కేటగిరి స్థానాలే. ఉన్న ఆ ఒక్క నర్సంపేటలోనూ బీసీకి టికెట్ ఇచ్చే అవకాశాలు లేవంటున్నారు. మామూలుగా చెప్పుకుంటేనే మూడు పార్లమెంట్ సెగ్మెంట్లలో ఒక్క బీసీకి కూడా సీటు ఇచ్చే పరిస్థితి లేదు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో జనగామ, ఆలేరులో బీసీ లీడర్లు టికెట్లు ఆశిస్తున్నారు. కాని, జనగామలో పొన్నాల లక్ష్మయ్యకు పోటీగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి టికెట్ అడుగుతున్నారు. ఇవే ఈక్వేషన్స్ తెలంగాణలోని మిగిలిన పార్లమెంట్ సెగ్మెంట్లలో ఉన్నాయి. అలాంటప్పుడు 34 సీట్లు బీసీలకు ఎలా ఇస్తారు. సరే.. మిగిలిన దగ్గర సర్దుబాటు చేయాలనుకున్నా గానీ ప్రత్యర్ధులకు పోటీనిచ్చేంత స్థాయిలో బీసీ లీడర్లు ఉన్నారా అన్నది కూడా చూడాలిగా. బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలనుకున్నా కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేకపోతోంది. ఈ సమస్య ఒక్క కాంగ్రెస్ పార్టీకే కాదు.. అన్ని పార్టీలదీ ఇదే సమస్య. 2014 ఎన్నికల్లో బీసీలకు 32 స్థానాలు ఇచ్చిన కాంగ్రెస్.. 2018లో మాత్రం కేవలం 24 మందికే ఇవ్వగలిగింది. ఇప్పుడు 34 మందికి కచ్చితంగా ఇస్తామని చెబుతున్నా.. అలాంటి పరిస్థితి కనిపించడం లేదు.
జిల్లాల వారీగా చూసినా సరే.. బీసీలకు టికెట్ ఇవ్వలేని పొజిషన్‌లో ఉంది కాంగ్రెస్ పార్టీ. ములుగు జిల్లాలో ఒకే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. అది కూడా ఎస్టీలకు రిజర్వ్డ్. బీసీలు పోటీ చేసే ఛాన్స్ లేదు. భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి సెగ్మెంట్ జనరల్ అయినా.. ఇక్కడ మూడు ప్రధాన పార్టీలు కూడా అగ్రవర్ణాలకే టికెట్ ఇవ్వడానికి రెడీ అయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో అలంపూర్, గద్వాల అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో అలంపూర్ ఎస్సీ రిజర్వ్‌డ్. గద్వాల పరిధిలో బీసీ ఓటర్లే ఎక్కువ మంది ఉన్నా.. ఇక్కడ అగ్రవర్ణాలకే టికెట్‌ను ఇస్తూ వస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇలా ఏ పార్లమెంట్ సెగ్మెంట్ తీసుకున్నా, జిల్లాల వారీగా చూసినా.. బీసీలకు ప్రతిపాదించిన 34 అసెంబ్లీ సీట్లు ఇచ్చే పరిస్థితి అయితే లేదు.
34 సీట్లు బీసీలకు ఇవ్వడం సాధ్యమా..? అసాధ్యమా..?
పైగా కాంగ్రెస్ తరపున బీసీ నేతలు పోటీ చేస్తున్న చోట కూడా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఎగ్జాంపుల్… మధుయాష్కి గౌడ్ ఎపిసోడ్. పారాచూట్ నాయకులకు ఎల్బీనగర్ కాంగ్రెస్ టికెట్ ఇవ్వొద్దంటూ పోస్టర్లు అతికించారు. నిజామాబాద్ జిల్లాలో పోటీ చేయాల్సిన వ్యక్తికి ఎల్బీనగర్‌లో పనేంటంటూ కామెంట్స్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్‌కే ఈ పరిస్థితి ఉంటే.. ఇక మిగిలిన వారి సంగతేంటి? పొన్నం ప్రభాకర్‌కు కూడా ఇదే పరిస్థితి ఎదురైందని చెప్పుకుంటున్నారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఒకవేళ పొత్తు కుదిరితే ఈ సీటు సీపీఐకి ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ చాడా వెంకటరెడ్డి పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇలా.. బీసీలకు అవకాశం ఇవ్వాల్సిన చోట కూడా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. మొత్తంగా ఎలా చూసినా సరే.. కాంగ్రెస్ పార్టీ ఈసారి 34 సీట్లు బీసీలకు ఇవ్వడం అసాధ్యంగా కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పైగా బీఆర్‌ఎస్ కంటే ఎక్కువ సీట్లు ఇస్తామని ప్రకటించుకుంది కాంగ్రెస్. 115 మంది అభ్యర్ధుల్లో 23 మంది బీసీలకు టికెట్లు ఇచ్చారు సీఎం కేసీఆర్. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం అంతకంటే ఎక్కువ మందికి ఇవ్వాలి. కాని, అలా టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదంటున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ బీసీలకు ఎక్కువ సీట్లే ఇచ్చినా.. ఎక్కువ మందిని గెలిపించుకోలేకపోయింది కాంగ్రెస్. అందుకే, ఆ అనుభవంతో బలమైన అభ్యర్ధులకే సీట్లు ఇస్తుంది తప్ప.. ప్రత్యేకంగా బీసీలకే టికెట్లు ఇవ్వకపోవచ్చు. అదే జరిగితే.. ఇచ్చిన మాట తప్పినట్టే లెక్క.
పైగా గెలిచే సీట్లలోనే బీసీలకు టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం డిమాండ్ చేస్తోంది. ఏదో ఇచ్చామంటే ఇచ్చామని కాదు.. కచ్చితంగా గెలిచే సీట్లే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. గతంలో లాగా ఓడిపోయే స్థానాల్లో ఇవ్వకుండా అన్నీ పరిశీలించి ఇవ్వాలని కొంతమంది బీసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
పొన్నాల కూడా మొన్నామధ్య ఇవే కామెంట్స్ చేశారు. ఇతర పార్టీల్లో బీసీలు గెలుస్తున్నప్పుడు కాంగ్రెస్‌లో మాత్రం బీసీ నేతలే ఎందుకు ఓడిపోతున్నారో హైకమాండ్ గుర్తించాలన్నారు పొన్నాల. కాంగ్రెస్‌లో బలమైన బీసీ లీడర్లు ఉన్న 45 నియోజకవర్గాల లిస్ట్ తయారు చేసిన బీసీ నేతలు.. వచ్చే ఎన్నికల్లో వారికి టిక్కెట్‌లు వచ్చేలా హైకమాండ్‌పై ఒత్తిడి తేవాలని డిసైడ్ అయ్యారు. మరి.. సర్వేలకు తగ్గట్టుగా అన్ని సీట్లు ఇస్తారా అంటే.. అనుమానమే. ఫైనల్‌గా కాంగ్రెస్ ప్రయోగించాలనుకున్న బీసీ అస్త్రం ఆ పార్టీకే బూమరాంగ్ అయ్యేలా కనిపిస్తోంది. మున్ముందు ఏమవుతుందో చూడాలంటే.. వెయిట్ చేయాల్సిందే..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..