Telangana: ఆ జిల్లాలో ఎయిమ్స్ వైద్యశాల.. అప్పటి నుంచే పూర్తిస్థాయి వైద్యసేవలు..
తెలంగాణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు బీబీనగర్ ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ముస్తాబవుతోంది. బీబీనగర్‌లో ఎయిమ్స్ నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి.

తెలంగాణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు బీబీనగర్ ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ముస్తాబవుతోంది. బీబీనగర్‌లో ఎయిమ్స్ నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. ఇప్పటికే ఓపీ సేవలు ప్రారంభం కాగా, మరోకొద్ది రోజుల్లో ప్రాణాంతక వ్యాధులతో పాటు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. అంతేగాక వైద్య పరంగా యావత్ తెలంగాణకు ఎయిమ్స్ కేంద్రబిందువుగా నిలవనుంది.
రాష్ట్రాల్లోని నిరుపేదలకు పూర్తిస్థాయి వైద్యసేవలందించే లక్ష్యంతో 2003లో ‘స్వస్థ సురక్ష యోజన’ కింద ఎయిమ్స్ కళాశాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత 2018లో ఎయిమ్స్ రాష్ట్రానికి మంజూరైంది. యాదాద్రి జిల్లా బీబీనగర్‌లో అప్పటికే నిమ్స్ ఆసుపత్రి భవనాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నివేదికలతో కేంద్రం బీబీనగర్‌లో ఎయిమ్స్ ఆస్పత్రితో పాటు మెడికల్ కళాశాలను మంజూరు చేసింది. బీబీనగర్ ఎయిమ్స్‌లో మొత్తం 201ఎకరాల్లో రూ.1365.95కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న విశాలమైన, అత్యాధునిక భవనాలతో 750 పడకల వైద్యశాల ఏర్పాటుకు ముమ్మరంగా సాగుతున్నాయి.
వేగంగా నిర్మాణ పనులు..
2023 ఏప్రిల్ 8న ప్రధాని మోదీ రూ.1365.95 కోట్లతో ఎయిమ్స్ నిర్మాణ పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఇప్పటివరకు ఈ ఏడాది జులై దాకా రూ.574.22 కోట్లు ఖర్చు చేసి 70 శాతం నిర్మాణ పనులు పూర్తిచేశారు. మిగిలిన పనులను ఈ ఏడాది డిసెంబరులోపు పూర్తి చేయాలని ప్రణాళికలు రూపొందించుకున్నారు. 2024 డిసెంబరులోగా పూర్తిస్థాయి వైద్యసేవలు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఎయిమ్స్ అధికారులు పనిచేస్తున్నారు.
ప్రస్తుతం 33 రకాల సేవలు..
రోగుల తాకిడి పెరుగుతుండడంతో అందుకు అనుగుణంగా అధికారులు వైద్యసేవలు అందుబాటులోకి తెస్తున్నారు. ప్రస్తుతం 33 విభాగాల్లో సేవలు అందుతున్నాయి. బీబీనగర్ ఎయిమ్స్‌లో 2020 జూన్ 2న ఓపీ సేవలు ప్రారంభమయ్యాయి.
411 మంది వైద్య విద్య పూర్తి..
కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో 2019-20 విద్యాసంవత్సరం నుంచి బీబీనగర్ ఎయిమ్స్ వైద్య విద్య తరగతులు ప్రారంభమయ్యాయి. ఎయిమ్స్‌లో 100 సీట్లతో మెడికల్ కళాశాల, 60సీట్లతో నర్సింగ్ కళాశాల, 30పడకలతో ఆయూష్ బ్లాక్ ఏర్పాటు చేశారు. ఎయిమ్స్ మొదటి బ్యాచ్ (ఎంబీబీఎస్)లో 50 మంది వైద్య విద్యార్థులు గతేడాది వైద్యవిద్య పూర్తిచేసుకొని ఈ ఏడాది జనవరి నుంచి ఆసుపత్రిలోనే ఇంటర్న్షిప్ చేస్తున్నారు. 2019లో ఇక్కడ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశాక ఇప్పటి వరకు నాలుగు బ్యాచులలో 411 మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించారు.
అందుబాటులోకి రానున్న అత్యాధునిక వైద్య సేవలు..
బీబీనగర్ ఎయిమ్స్‌లో ఇప్పటివరకు ఈ సంజీవిని ద్వారా 93,529 మందికి వైద్య సేవలు అందించింది. 11,730 రోగులు ఇన్ పేషంట్ సేవలు పొందారు. 46,246 మంది రోగులకు ఈ ఆస్పత్రి వైద్యులు వివిధ రకాల సర్జరీలు చేశారు. ఎయిమ్స్ పూర్తయితే.. అత్యాధునిక వైద్యశాలలో 18 స్పెషాలిటీల్లో కార్డియాలజీ, న్యూరాలజీ, ఎండోక్రినాలజిస్ట్, నెఫ్రాలజీ, రేడియాలజీ తదితర విభాగాల్లో నాణ్యమైన వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి.ఆస్పత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఎమర్జెన్సీ యూనిట్, 16మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, డయాగ్నస్టిక్ ల్యాబ్, బ్లడ్‌బ్యాంకు, ఫార్మసి, తదితర వసతులు సమకూరనున్నాయి. భవిష్యత్‌లో బీబీనగర్ ఎయిమ్స్ గ్లోబల్ లెవల్ ఇన్‌స్టిట్యూట్‌గా మారనుంది.
డిసెంబర్‌లోగా పూర్తి…
కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపుతుండటంతో నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ భాటియా చెబుతున్నారు. దశల వారీగా సేవలు విస్తరిస్తున్నామని, ఈ ఏడాది చివరి నాటికి ఎయిమ్స్ ఆసుపత్రి భవన నిర్మాణాలు పూర్తిచేసి ప్రజలకు అన్ని రకాల మెరుగైన వైద్య సేవలందిస్తామని ఆయన తెలిపారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..