Telangana CM: సీఎంకు అధిష్టానం నుంచి లైన్ క్లియర్.. డిప్యూటీ సీఎం, కీలక శాఖలు, స్పీకర్ పదవిపైనే పీటముడి
తెలంగాణలో మెజార్టీ సీట్లు గెలచుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా రెండో శాసనసభను రద్దు చేసి.. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అనుకూలంగా ఎన్నికల సంఘం నివేదికతో గెజిట్ కూడా విడుదల అయింది. ఉదయం నుంచి దర్భార్ హాల్‌లో ప్రమాణస్వీకారం కోసం కావాల్సిన సరంజామా కూడా సిద్ధం చేశారు.

తెలంగాణలో మెజార్టీ సీట్లు గెలచుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా రెండో శాసనసభను రద్దు చేసి.. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అనుకూలంగా ఎన్నికల సంఘం నివేదికతో గెజిట్ కూడా విడుదల అయింది. ఉదయం నుంచి దర్భార్ హాల్‌లో ప్రమాణస్వీకారం కోసం కావాల్సిన సరంజామా కూడా సిద్ధం చేశారు. ఇక, ప్రకటన వస్తుందని అనుకుంటున్న సమయంలో సీన్ మారింది. ఎమ్మెల్యే అభ్యర్ధుల సీఎల్పీ నేత ఎంపిక నిర్ణయాన్ని అధిష్టానానికి అప్పగించారు ఎమ్మెల్యేలు. సీఎల్పీ సమావేశంలో సభ్యుల అభిప్రాయాలు సేకరించిన ఏఐసీసీ పరిశీలకులు విషయాన్ని ఢిల్లీ పెద్దలకు పంపారు.
అటు కొత్త సీఎం కాన్వాయ్ రెడీ చేశారు. మంత్రివర్గానికి అవసరమైన వాహనాలు కూడా సిద్ధం చేశారు. కానీ కాంగ్రెస్ మార్క్ రాజకీయంతో సీఎం ఎవరు అనేది నిర్ణయం జరగడం లేదు. తెలంగాణలో సీనియర్ల మధ్య పోటీ ఉండటంతో పార్టీ అధిష్టానం మరోసారి సంప్రదింపుల ద్వారానే తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు హస్తిన బాట పట్టారు.
ఇప్పటికే సీఎంగా రేవంత్‌రెడ్డికి అధిష్టానం నుంచి లైన్ క్లియర్ వచ్చినప్పటికీ, డిప్యూటీ సీఎం, కీలక శాఖలు, స్పీకర్ పదవిపైనే పీటముడి వీడటం లేదు. పీసీసీ అధ్యక్ష పదవిపైనా సందిగ్ధత వీడటం లేదు. సీఎం పదవి రెడ్డి సామాజిక వర్గానికి అవకాశమిస్తే, పీసీసీ చీఫ్‌తో పాటు ఉప ముఖ్యమంత్రి పదవులు ఎస్సీ, బీసీలకు ఇద్దామని కాంగ్రెస్ అధిష్టానం సూచించినట్లు సమాచారం. ఈక్రమంలోనే కీలక శాఖలపైనా సీనియర్ నేతలు పట్టుబడుతుంటంతో ఏకాభిప్రాయం పొసగడం లేదు.
ఇదిలావుంటే బీసీ కోటాలో తనకు డిప్యూటీ సీఎం ఇవ్వాలని హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన గౌడ సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్ కోరుతున్నారు. అటు మొదటి నుంచి సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి అయితే ఒకే, లేదంటే సింగిల్ డిప్యూటీ సీఎం పోస్ట్ ఉండాలంటున్నారు భట్టి. ఒక్కటే డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖపై భట్టి పట్టుపడుతున్నారు.
మరోవైపు డిప్యూటీ వద్దంటే స్పీకర్ పదవి తీసుకోవాలని భట్టికి హైకమాండ్ సూచినట్లు తెలుస్తోంది. ఒకవేళ భట్టి విక్రమార్క స్పీకర్ ఛైర్ వద్దంటే మంథని నుంచి గెలుపొందిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు అసెంబ్లీ స్పీకర్ పదవి కట్టబెట్టె ఇచ్చే యోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఇంతకాలం సీఎం పదవి కోసం ఎదురుచూస్తున్న మాజీ పీసీసీ చీఫ్, హజూర్‌నగర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, తనకు సీఎం ఇవ్వకపోతే తన సతీమణికి మంత్రిపదవి ఇవ్వాలంటున్నట్లు తెలుస్తోంది. ఇది అట్ల ఉంటే తెలంగాణలో పదవుల పంచాయితీ తేలకపోవడంతో హస్తిన బాట పట్టారు పార్టీ అబ్జర్వర్లు.
నవంబర్ నెలలో తెలంగాణతో పాటు జరిగిన 3 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలైంది. ఈ క్రమంలోనే అయా రాష్ట్రాల ఓటమిపై అధిష్టానం సమీక్ష నిర్వహిస్తోంది. త్వరలో జరుగునున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యలో అగ్ర నాయకత్వం బిజీగా ఉంది. దీంతో తెలంగాణపై ఈ సాయంత్రం వరకూ హైకమాండ్ పెద్దగా ఫోకస్ పెట్టినట్టు కనిపించలేదు. తెలంగాణ కేబినెట్ కూర్పు కొలిక్కి రాకపోవడంతో పార్టీ ముఖ్యనేతలను అధిష్టానం ఢిల్లికి పిలుపించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అధిష్టానం క్లియరెన్స్ కోసం తెలంగాణ నేతలు ఎదురుచూపులు చూస్తున్నారు.