Telangana: సంక్రాంతి పండుగ వేళ ఇదో వి‘చిత్రం..’ ఒకే ఫ్లెక్సీలో చంద్రబాబు, బాలకృష్ణ, కేసీఆర్!
ఒక ప్లెక్స్ రాజకీయంగా పెద్ద చర్యకు దారి తీసింది. త్వరలో తెలంగాణ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. గ్రామాల్లో ఇప్పటికే ఆశావహులు సందడి చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలోని ఓ గ్రామంలో అభిమాని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కొత్త చర్చకు దారి తీసింది.
ఖమ్మం జిల్లాలో సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ సంచలనంగా మారింది. అభిమాన హీరోలకు.. రాజకీయ నాయకులకు ఫ్లెక్సీలను అభిమానులు ఏర్పాటు చేయడం సహజమే..! కానీ వేరు వేరు పార్టీలకు చెందిన నేతలు, సినిమా హీరోలతో కలిపి ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయంగా ఆకట్టుకునేలా గుర్తు తెలియని ఓ అభిమాని రోడ్డు పక్కన ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు మండలం ముగ్గు వేంకటాపురం గ్రామంలో ఈ విచిత్ర ఫ్లెక్సీ వెలసింది. సంక్రాంతి సందర్భంగా ఒక అభిమాని రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అటుగా వెళ్ళే వారిని ఆకట్టుకుంటుంది. ఆంధ్ర సరిహద్దు ప్రాంతం అయిన ఈ గ్రామంలో అభిమాని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వైరల్ కావడమే కాదు.. కొత్త చర్చకు దారి తీసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫోటో ఒక వైపు, తెలంగాణ మాజీ సీఎం, BRS పార్టీ అధినేత కేసీఆర్ ఫోటో మరోవైపుతోపాటు సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫోటో తో ఫ్లెక్సీ ఏర్పాటు ఇప్పుడు ఆసక్తి రేపుతుంది.
అంతే కాకుండా ఆంధ్రా సరిహద్దు కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఫోటో, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి నుంచి వరుసగా మూడు సార్లు టీడీపీ నుంచి గెలిచిన మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఫోటోలు ఉండటంతో రాజకీయంగా మరింత ఆసక్తికరంగా ఉందని అభిమానులు అంటున్నారు. సినిమా హీరోలు, రాజకీయ నేతల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సాధారణమే.. కానీ.. ఇలా రెండు రాష్ట్రాల నేతలు, రాజకీయ ప్రత్యర్థుల ఫోటోలతో ఏర్పాటు చేయడమే ఇంట్రెస్టింగ్‌గా మారింది.
త్వరలో తెలంగాణ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. గ్రామాల్లో ఇప్పటికే ఆశావహులు సందడి చేస్తున్నారు. పోటీ చేసి గెలవాలని ఇప్పటి నుంచే ప్రజలను ఆకట్టుకోవడానికి వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఖమ్మం జిల్లాలో టీడీపీ అభిమానులు ఎక్కువగానే ఉంటారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో అవకాశం ఉన్న చోట తాము పోటీ చేయాలనీ తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. తెలుగు దేశం అభిమానులే ఇలా ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఉంటారని చర్చ జరుగుతోంది. వీడియో చూడండి…
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…