Good News: ఇది కదా పండగ అంటే.. తెలంగాణలో ఒకేసారి నాలుగు పథకాలు అమలు.. ఫుల్ డిటైల్స్..
తెలంగాణ ప్రభుత్వం మరో నాలుగు కొత్త పథకాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. జనవరి 26 నుంచి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి లబ్ధిదారుల జాబితా తయారీకి ప్రభుత్వం ఇవాళ్టి నుంచి ఫీల్డ్ సర్వే చేపట్టనుంది.
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు సన్నాహాలను ప్రారంభించింది. ఇప్పటికే.. మహిళలకు ఉచిత బస్సు, రూ.500 గ్యాస్ సిలిండర్, ఫ్రీ కరెంట్, ఆరోగ్యశ్రీ సాయం రూ.10లక్షలకు పెంపు తదితర వాటిని అమలు చేసింది.. రైతులకు రుణమాఫీ సైతం చేసింది.. అయితే.. మరికొన్ని పథకాలను క్షేత్రస్థాయిలో ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది.. మరికొన్ని రోజుల్లో మరో నాలుగు కొత్త పథకాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. జనవరి 26 నుంచి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనుంది.. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి లబ్ధిదారుల జాబితా తయారీకి ప్రభుత్వం ఇవాళ్టి నుంచి ఫీల్డ్ సర్వే చేపట్టనుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. గురువారం నుంచి ఫీల్డ్ సర్వే తర్వాత.. ఈ నెల 21నుంచి 24 వరకు గ్రామసభలు, డేటా ఎంట్రీ చేయనున్నారు. ఈ డేటా ఆధారంగా తుది జాబితాకు మంత్రులు ఆమోదం తెలపనున్నారు.
రైతు భరోసా..
ఇక రైతు భరోసా కోసం అధికారులు క్షేత్రస్థాయిలో సన్నాహక చర్యలు ప్రారంభించారు. ఈ నెల 26న సాగుకు అనుకూల భూములకు మాత్రమే పెట్టుబడి సహాయం ఎకరానికి రూ.12 వేలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో దీనిపై అధికారులు సర్వేకు సిద్ధమయ్యారు. ఈనెల 20 వరకు సర్వే జరుగనుంది. సర్వే అనంతరం సాగుకుయోగ్యం కాని భూముల లిస్ట్‌ను గ్రామ పంచాయతీల్లో డిస్ప్లే చేస్తారు. 21 నుంచి 25 వరకు గ్రామ సభలు నిర్వహించి ఆమోదం తీసుకుంటారు. జనవరి 26న రైతు భరోసా డబ్బులను అర్హులైన రైతుల ఖాతాలో జమ చేయనున్నారు.
కొత్త రేషన్ కార్డులు..
గణతంత్ర దినోత్సవం ఈ నెల 26 నుంచి పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఆహార భద్రత రేషన్ కార్డులు జారీ కానున్నాయి. కొత్త రేషన్ కార్డుల మంజూరుతోపాటు.. పాత రేషన్ కార్డులలో మార్పులు, చేర్పులు కూడా చేయనున్నారు. కేబినెట్ సబ్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. దరఖాస్తులను నిశితంగా పరిశీలించిన తర్వాత కుల గణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్, కమిషనర్‌లకు క్షేత్రస్థాయి పరిశీలన నిమిత్తం పంపిస్తారు. అనంతరం గ్రామసభల్లో జాబితాను ప్రకటించనున్నారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం..
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రైతు కూలీలకు ఏడాది 12 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని సైతం తెలంగాణ ప్రభుత్వం చేయనుంది.. ఇది కూడా జనవరి 26 నుంచి అమలు చేయనుంది..
ఇందిరమ్మ ఇళ్ల పథకం..
అలాగే.. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సైతం ప్రారంభించనుంది.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ఇప్పటికే క్షేత్రస్థాయిలో సర్వే పూర్తయింది.. ఇళ్ల లబ్దిదారులకు పలు విడతల్లో రూ.5లక్షలను ఇవ్వనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..