Khammam: చిట్టి గుండెలు ఆగిపోతున్నాయి.. గుండెపోటుతో 9వ తరగతి విద్యార్థి మృతి
సెకన్ల వ్యవధిలో నిండు ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోతున్నాయి. హార్ట్ ఎటాక్ అనే మహమ్మారి పిల్లల్ని, యుక్త వయస్కుల్ని కూడా వదిలిపెట్టడం లేదు. ఖమ్మం జిల్లాలో ఓ టీనేజర్ జీవితాన్ని మధ్యంతరంగానే ఆపేసింది. మారుతున్న ఆహారపుటలవాట్లని కొందరు, ఫిజికల్ ఎక్సర్‌సైజులు తిరగబడ్డం వల్ల అని మరికొందరు, మితిమీరిన స్టెరాయిడ్సే కొంప ముంచుతున్నాయని, పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ అనీ రకరకాల కారణాలు చెబుతున్నారు. కానీ.. ఈ అకాల మరణాలు ఆగేదెప్పుడు.. గుండె పదిలమయ్యేదెప్పుడు?

ఖమ్మం, ఆగస్టు 18: ఇటీవల గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి..వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మరణించడం ఆందోళన కలిగిస్తోంది. ఖమ్మం నగరంలో గుండెపోటుతో తొమ్మిదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. నగరంలోని ఎన్ఎస్పీ కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి మాదాసి రాజేశ్(16) గుండెపోటుతో మృతి చెందాడు. ఉదయం పాఠశాలకు వచ్చిన తర్వాత కొద్ది సేపటికే ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పడంతో వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు అతని తండ్రి శంకర్‌కు సమాచారం ఇచ్చి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలిస్తుండగానే రాజేష్… చనిపోయాడు. రాజేష్‌కి చిన్నతనం నుంచి గుండెకు రంధ్రం ఉండటంతో తల్లిదండ్రులు పలు ఆసుపత్రులు తిరిగి లక్షలు ఖర్చు చేసి చికిత్స చేయిస్తున్నారు. తండ్రి నగరంలోని ఓ అపార్ట్ మెంట్‌లో వాచ్మెన్ గా పని చేస్తున్నారు. తల్లి ఇండ్లలో పని చేస్తుంది. బతుకు తెరువు కోసం వరంగల్ జిల్లా నుండి 15 సంత్సరాల క్రితం ఖమ్మం వచ్చి వాచ్‌మెన్‌గా పని చేస్తున్నామని ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
నవ్వుతూ కుప్పకూలిపోతున్నారు. పాడుతూ కుప్పకూలిపోతున్నారు. ఆడుతూ కుప్పకూలిపోతున్నారు. ఇటీవల కాలంలో సడన్ హార్ట్ ఎటాక్‌లు షాకింగ్‌గా మారుతున్నాయి. హార్ట్ ఎటాక్.. ఈ పదం వింటేనే చెమటలు పట్టేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రజలను అత్యంత భయపెడుతున్న ప్రమాదకరమైన జబ్బు. దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విన్నా గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు రెట్టింపు అవుతుంది. కొందరూ స్పాట్ లోనే కుప్పకూలి చనిపోతుంటే.. మరికొందరూ ఆస్పత్రికి చేరుకునేలోపే ప్రాణాలు విడుస్తున్నారు. ఈ మధ్య కాలంలో గుండెపోటుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. 25 కూడా లేని యువకులకు కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. అప్పటి వరకు ఎంతో యాక్టివ్‌గా కనిపించి.. అంతలోనే కుప్పకూలుతున్నారు. గుండెలు ఆగి చనిపోతున్నారు.
యుక్త వయసులోనే నూరేళ్ల ఆయుష్షు ఆవిరైపోతోంది. ఏజ్‌తో సంబంధం లేకుండా ఎవ్వరినీ వదలడం లేదు మాయదారి హార్ట్ అటాక్స్. ఉరుకుల పరుగుల జీవితంలో తీరిక లేకుండా గడుపుతున్న లైఫ్ స్టైల్ యువ హృదయాల్లో మంటలు పెడుతుంది. భారీగా కండలు పెంచాలనే ఆరాటం…త్వరగా ఫిట్‌గా కనిపించాలనే ఆత్రం.. శక్తికి మించిన వర్కవుట్స్.. కోవిడ్ తర్వాతి పరిణామాలు… ఇలా కారణాలు అనేకం. ఇప్పటికైనా గుండెను పదిలం చేయడానికి చాలా మార్పులు రావాలి. లేకపోతే.. గుప్పెడంత గుండె.. ఎప్పుడు ఆగిపోతుందో ఎవ్వరూ పసిగట్టలేరు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..