Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సౌదీ జైల్ లో చిక్కుకున్న ఏడుగురు అభాగ్యులు.. రక్షించమని కోరుతూ కేంద్రానికి లేఖ

పొట్టకూటి కోసం సౌదీ అరేబియా వెళ్లిన 19 మంది బాధితులు ట్రావెల్ ఏజెంట్ చేతిలో మోసపోయి అక్కడే ఇరుక్కుపోయారు. కష్టపడి కూలీ చేసుకుని జీవితాన్ని చక్కదిద్దుకుందామనుకున్న ఆ అభాగ్యులు ప్రస్తుతం దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ఈ విషయం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ దృష్టికి చేరింది. ట్రావెల్ ఏజెంట్ చేతిలో మోసపోయిన హైదరాబాద్ నగరానికి చెందిన ఏడుగురిని ఎలాగైనా రక్షించి, సురక్షితంగా ఇండియాకి రప్పించాలని కోరుతూ మజ్లిస్ బచావో తెహ్రీక్ అనే రాజకీయ పార్టీ కేంద్ర మంత్రికి లేఖ రాసింది.

సౌదీ జైల్ లో చిక్కుకున్న ఏడుగురు అభాగ్యులు.. రక్షించమని కోరుతూ కేంద్రానికి లేఖ
Saudi Jail
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Jyothi Gadda

Updated on: Feb 17, 2025 | 7:24 PM

తెలంగాణ ట్రావెల్ ఏజెంట్ చేతిలో మోసపోయి సౌదీలో చిక్కుకుపోయిన హైదరాబాద్‌కు చెందిన ఏడుగురిని రక్షించే బాధ్యత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై పడింది. ప్రస్తుతం వారందరూ సఫర్ జైలు, జెడ్డా, సౌదీ అరేబియా-రెక్-రెగ్‌లో ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్‌కు చెందిన దాదాపు పందొమ్మిది మంది వ్యక్తులను తెలంగాణ ట్రావెల్ ఏజెంట్ మహ్మద్ అక్బర్.. ఫుడ్ డెలివరీ పని నిమిత్తం సౌదీలోని జెడ్డాకు చెందిన ఖోలౌద్ అహ్మద్ అల్కౌజీ అనే యజమానురాలికి అప్పగించాడు. వసతి, ద్విచక్ర వాహనంతో పాటు పెట్రోల్, రోజుకు ఎనిమిది గంటల డ్యూటీ చేయాలని చెప్పి నమ్మించారు. అంతేకాకుండా భోజన వసతి కూడా ఏర్పాటు చేయబడుతుందని హామీ ఇస్తూ ఏజెంట్ వారికి నచ్చజెప్పాడు. ఈ ఒప్పందం మేరకు.. మొత్తం పందొమ్మిది మంది గత ఏడాది అంటే 2024, జూలై 26న సౌదీ అరేబియాలోని జెడ్డాకు వెళ్లి డ్యూటీలో చేరారు. అక్కడికి వెళ్లిన దాదాపు 45 రోజుల వరకు వారికి ఎలాంటి పనులు అప్పగించలేదు. దీంతో ఆ సంస్థ యాజమాన్యం ఇచ్చిన గదుల్లోనే ఉండాలని చెప్పారు. అయితే.. దాదాపు 50 రోజుల తర్వాత ఉద్యోగం ఇవ్వబడగా.. మొదట్లో రెండు నుంచి ఐదు ఆర్డర్‌లు ఇచ్చేలా ఫుల్ డెలివరీ బాయ్స్‌గా పనిలో కుదిరారు. ఎక్కడైతే వారిని ఆపరేట్ చేయమని అడిగారో దానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో రోజుకు కనీసం 12 గంటలు పని చేయాలని ఆదేశించారు.

ఇంతవరకూ బాగానే ఉండగా, వీరికి మూడు నెలలుగా ఎలాంటి జీతం ఇవ్వకపోవడంతో సమస్య ఏర్పడింది. ఈ క్రమంలో QIWA సైట్‌ను పరిశీలించగా అందులో వారి అగ్రిమెంట్ జీతం 400 SRగా ఉండడం చూసి అవాక్కయ్యారు. కానీ, వారి యజమాని ప్రతి ఆర్డర్‌కు 3.33 SR చెల్లిస్తామని చెప్పడంతో వారు మోసపోయినట్లు గ్రహించారు. అంతటితో ఆగకుండా భోజన వసతిని కూడా ఆపేసి సొంతంగా కొనుక్కుని తినాలని యజమానురాలు చెప్పడంతో దిక్కు తోచని స్థితి ఎదురైంది. వారి జీతాల నుంచి చలాన్ల పేరుతో డబ్బులు కట్ చేయడం, జీతాలు సరిగ్గా ఇవ్వకపోవడం లాంటి సమస్యలు మొదలయ్యాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మందులకు, ఆసుపత్రి బిల్లులకు తమ జేబులోంచే డబ్బులు పెట్టుకోవాలని యజమానురాలు ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది. ఇలా ఎన్నో రకాలుగా యజమానురాలు నుంచి వారు నిరంతరం వేధింపులకు గురయ్యారు. ఇవన్నీ భరించలేక వెళ్లిపోతామని అడిగితే.. వారిని అక్కడి నుంచి పంపేందుకు 10,000 SR చెల్లించాలని, లేకపోతే పోలీసులకు అప్పగిస్తానని, 10 ఏళ్ల పాటు ఎక్కడికి వెళ్లే అవకాశం లేకుండా ప్రయాణ నిషేధం విధిస్తానని బెదిరించింది. దీంతో వారంతా దిక్కు తోచని పరిస్థితిలో లేబర్ కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసు విచారణలో ఆ యజమానురాలు తన నుంచే వీళ్లంతా 10,000 SR తీసుకున్నారని ఆరోపించింది. కూలీ కోసం మొత్తం వెళ్లిన పందొమ్మిది మందిలో ఒక వ్యక్తి ఈ ఒత్తిడి భరించలేక ఆసుపత్రిలో కూడా చేరాడు. మరో ముగ్గురు పారిపోయి సౌదీ అరేబియాలో ఎక్కడో పనులు చేసుకుంటున్నారు. దీంతో యజమానురాలు ఖోలౌద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిగిలిన ఏడుగురిని 2025, జనవరి 14న సౌదీ అరేబియా పోలీసులు మక్కాలో అరెస్టు జెడ్డాలోని సఫర్ జైలుకు తరలించారు. దీంతో జైలులో మగ్గుతున్న ఆ ఏడుగురి కుటుంబ సభ్యులు ప్రస్తుతం తీవ్ర ఆందోళన చెందుతూ తమ వారి కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ విషయంలో భారత ప్రభుత్వం ఎలాగైనా జోక్యం చేసుకుని సాయం చేయాలని కోరుతున్నారు. వీలైనంత త్వరగా వారిని స్వదేశానికి రప్పించమని వారి అభ్యర్థన మేరకు మజ్లిస్ బచావో తెహ్రీక్ పార్టీ చొరవ తీసుకుంది. సౌదీ అరేబియా జెడ్డాలోని భారత రాయబార కార్యాలయం, రియాద్ సౌదీ అరేబియా మరియు భారత కాన్సులేట్ జనరల్‌ను సంప్రదించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. తెలంగాణ ట్రావెల్ ఏజెంట్ చేతిలో మోసపోయి సౌదీలో చిక్కుకుపోయిన హైదరాబాద్‌కు చెందిన ఆ ఏడుగురిని రక్షించాలని కోరుతూ మజ్లిస్ బచావో తెహ్రీక్ కేంద్ర మంత్రి జైశంకర్‌కు లేఖ రాసింది. కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుందని, త్వరలోనే ఆ ఏడుగురు సురక్షితంగా వస్తారని వారి కుటుంబ సభ్యులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..