Telangana: మరికొన్ని గంటల్లో పెళ్లి.. ఇంతలో వరుడు సూసైడ్! నిజామాబాద్‌లో విషాదం
చదువు పూర్తైనా ఉద్యోగం రాలేదా యువకుడికి. ఇంతలో తల్లిదండ్రులు పెళ్లి సంబంధం చూసి వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉద్యోగం.. సజ్జోగం లేని తాను పెళ్లైతే భార్యను ఎలా పోషించుకోవాలి? అనే ప్రశ్న సదరు యువకుడిని నిలువెళ్లా దహించి వేసింది. తననే నమ్ముకున్న భార్య.. జీవితాంతం కష్టాలు పడాల్సి వస్తుందని పెళ్లి ఒక రోజు ముందు ఏకంగా ప్రాణాలే తీసుకున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య..
డిచ్‌పల్లి, ఆగస్టు 18: చదువు పూర్తైనా ఉద్యోగం రాలేదా యువకుడికి. ఇంతలో తల్లిదండ్రులు పెళ్లి సంబంధం చూసి వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉద్యోగం.. సజ్జోగం లేని తాను పెళ్లైతే భార్యను ఎలా పోషించుకోవాలి? అనే ప్రశ్న సదరు యువకుడిని నిలువెళ్లా దహించి వేసింది. తననే నమ్ముకున్న భార్య.. జీవితాంతం కష్టాలు పడాల్సి వస్తుందని పెళ్లి ఒక రోజు ముందు ఏకంగా ప్రాణాలే తీసుకున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో ఉందనడానికి ఇదో మచ్చుతునక మాత్రమే. ఇలాంటి వెలుగులోకి రాని దారుణాలు ఇంకా ఎక్కడెక్కడ ఎన్నెన్ని జరుగుతున్నాయో దేవుడికే ఎరుక. తాజా సంఘటన నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిడిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మిట్టపల్లి గ్రామంలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం..
నిజామాబాద్ జిల్లా మిట్టాపల్లి గ్రామానికి చెందిన మాసిపెద్ది ప్రశాంత్ (29) బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు. ఎన్ని కంపెనీలు తిరిగినా ప్రశాంత్‌కు ఉద్యోగం దొరకలేదు. ఇంతలో ఎదిగిన కొడుకుకు తల్లిదండ్రులు పెళ్లి చేయాలనుకున్నారు. బోధన్‌కు చెందిన ఓ యువతితో పెళ్లి సంబంధం కుదిర్చారు. నిశ్చితార్ధం చేసుకుని, ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. శనివారం వీరి పెళ్లి జరగాల్సి ఉంది. అయితే ప్రశాంత్ గురువారం ఉదయం ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు.
ప్రశాంత్ ఆత్మహత్యకు ముందు తన స్నేహితుడికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. చదువు పూర్తయినా తరకు ఉద్యోగం రాలేదని, తోటి స్నేహితులందరూ ఉద్యోగాల్లో స్థిరపడ్డారని వాపోయాడు. పెళ్లి చేసుకున్నాక భార్యను పోషించుకోలేనని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని స్నేహితుడికి చెప్పి, అనంతరం స్విచ్ఛాప్ చేశాడు. వెంటనే స్నేహితుడు ప్రశాంత్ కుటుంబ సభ్యులకు, బంధువులకు సమచారం అందించాడు. కుటుంబ సభ్యులు ఫోన్ చివరి లోకేషన్ ఆధారంగా నడ్‌పల్లి శివారులోని గాయత్రి ఎన్‌క్లేవ్ వద్దకు చేరుకున్నారు. కానీ అప్పటికే ప్రశాంగ్ పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో ఉన్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా.. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశాడు. పెళ్లి కి రెండు రోజుల ముందు కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో.. మృతుడి తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.