Telangana BJP: సీనియర్లు దరఖాస్తు చేసుకుంటారా.. లేదా..? బీజేపీ ఆఫీసులో కొనసాగుతోన్న సందడి..
తెలంగాణ బీజేపీ ఆఫీసులో దరఖాస్తుల సందడి కొనసాగుతోంది. అసెంబ్లీ టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థుల నుంచి రెండో రోజు 178 అప్లికేషన్లు వచ్చాయి. అయితే లీడర్లు, కేడర్‌లో జోష్ పెంచడానికి బీజేపీ ప్లాన్ చేసిందా? దానికి ముహూర్తం కూడా ఖరారయిందా? ఇంతకీ ఆ రోజు ఏం జరగనుంది? సీనియర్లు ఎలాంటి అస్త్రం ప్రయోగించనున్నారు?
హైదరాబాద్, సెప్టెంబర్ 05: తెలంగాణ బీజేపీ ఆఫీసులో దరఖాస్తుల సందడి కొనసాగుతోంది. అసెంబ్లీ టికెట్లు కోరుతున్న ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జరుగుతోంది. మొదటి రోజు 182 అప్లికేషన్లు వస్తే, రెండో రోజు మంగళవారం 178 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల పదో తేదీ వరకే దరఖాస్తుల స్వీకరణకు గడువు ఉండడంతో అభ్యర్థుల నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే ఇప్పుడు అందరి చూపు సీనియర్ నేతల పైనే ఉంది. వాళ్లలో ఎంతమంది అసెంబ్లీ సీటు కోసం అప్లికేషన్ పెట్టుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, సీనియర్ నేత లక్ష్మణ్, ఎంపీలు అరవింద్, సోయం బాపు రావు, మిగిలిన సీనియర్లు డీకే అరుణ, జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, విజయశాంతి, వివేక్‌లు దరఖాస్తు చేసుకుంటారా? చేసుకుంటే ఎక్కడి నుంచి చేస్తారు? ఈటల రాజేందర్.. గజ్వేల్ నుంచి దరఖాస్తు చేసుకుంటారా అనేదానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.
అయితే, బీజేపీ గ్రాఫ్ తగ్గిందని జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కమలం పార్టీ పెద్ద స్కెచ్ రెడీ చేసిందంటున్నారు. ఈ నెల 9, మంచి రోజు కావడంతో.. బీజేపీ సీనియర్ నేతలంతా అదే రోజు నామినేషన్లు వేసి తెలంగాణలో పార్టీకి మంచి ఊపు షేపు తేవాలనే వ్యూహం వేశారని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీ బీజేపీకి మంచి జోష్ తేవడానికి తొమ్మిదో తేదీన దీన్నో బిగ్ ఈవెంట్‌లా చేయాలనే ఆలోచనలో కమల దళం ఉన్నట్లు సమాచారం. అయితే అదే రోజు ఈ వ్యూహం అమలు చేస్తారా, మరో రోజు ఎంచుకుంటారా అనేదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. దీంతో సీనియర్ నేతల్లో ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..