ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్యాసింజర్, స్కూల్ బస్సులలో అవి తప్పనిసరి..?
Alarm System: దేశంలోని అనేక ప్రాంతాల్లో బస్సుల్లో మంటలు చెలరేగుతున్న ఘటనలు, ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు
Alarm System: దేశంలోని అనేక ప్రాంతాల్లో బస్సుల్లో మంటలు చెలరేగుతున్న ఘటనలు, ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు మనం చూసే ఉంటాం. ఇలాంటి వాటిపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రభుత్వం ప్యాసింజర్ బస్సులు, స్కూల్ బస్సుల్లో భద్రతా నిబంధనలను కఠినతరం చేసింది. రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ బస్సులలో అగ్ని రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడం తప్పనిసరి చేసింది. బస్సులలో ఈ వ్యవస్థను ఇన్‌స్టాల్ చేయాలనే నిబంధన గతంలోనే ఉంది. అయితే పరిమిత స్థలం కారణంగా ఇది చేయలేకపోయారు. కానీ ఇప్పుడు ప్రయాణికులు కూర్చునే ప్రదేశాల్లో కూడా రక్షణ వ్యవస్థని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
కొత్త నియమం ఏమిటి..?
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ చాలా దూరం ప్రయాణించే బస్సులు, పాఠశాల బస్సులలో ఫైర్ అలారం ఏర్పాటు చేయడాన్ని తప్పనిసరి చేసింది. శనివారం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. సుదూర ప్రాంతాలకు నడుపుతున్న ప్యాసింజర్ బస్సులు, పాఠశాల బస్సుల భాగంలో ఫైర్ ప్రివెన్షన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు వాహనాల ఇంజిన్ భాగం నుంచి వెలువడే మంటలను గుర్తించడం, అలారం సౌండింగ్, సప్రెషన్ సిస్టమ్ మాత్రమే అమలు చేశారు. వాహన పరిశ్రమ ప్రమాణం 135 ప్రకారం ఇంజిన్ మంటలు సంభవించినప్పుడు ఈ సిస్టమ్ హెచ్చరిస్తుంది.
కొత్త నిబంధనల వల్ల ఎలాంటి ప్రయోజనం..?
టైప్ -3 బస్సులు చాలా దూరం ప్రయాణించేలా రూపొందించారు. బస్సుల్లో అగ్నిప్రమాదాల సమయంలో అధిక ఉష్ణోగ్రత, పొగ కారణంగా బస్సులో కూర్చున్న ప్రయాణికులు తరచుగా గాయపడతారు. ప్రయాణికులు కూర్చునే ప్రదేశంలో ఫైర్ వార్నింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తే ఈ ప్రమాదాలను చాలా వరకు అరికట్టవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలారం మోగిన తర్వాత ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి కిందికి దిగడానికి సమయం లభిస్తుందని వివరించింది.
బస్సుల్లో ప్రమాదాలు పెరుగుతున్నాయి
తాజాగా గుజరాత్‌లో ఒక సంఘటన చోటుచేసుకుంది. ప్రైవేట్ లగ్జరీ బస్సులో మంటలు చెలరేగడంతో ఓ మహిళ మృతి చెందింది. ఈ బస్సులో మంటలు చెలరేగిన విషయాన్ని వెనుక నుంచి వస్తున్న మరో బస్సు డ్రైవర్ చెప్పడంతో డ్రైవర్‌కు తెలిసింది. బస్సును ఆపిన వెంటనే మంటలు చాలా వేగంగా వ్యాపించాయి. తక్కువ మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ ఇద్దరు వ్యక్తులు బస్సు నుంచి బయటకు రాలేకపోయారు. వారిలో ఒకరు మరణించారు. షార్ట్‌సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయని మీడియా కథనాలు వెల్లడించాయి.