వామ్మో.. కొత్త మోసం.. ఓటీపీ, కార్డుతో పని లేకుండానే అకౌంట్ ఖాళీ.. ఎలా అంటే..?
ప్రస్తుత ఆధునిక కాలంలో సైబర్ మోసాలు పెరిగిపోయాయి. కేటుగాళ్లు ఏదో ఒక రూపంలో డబ్బును కాజేస్తున్నారు. జార్ఖండ్‌లో, OTP కార్డు లేకుండానే ఒక వృద్ధురాలి బ్యాంకు ఖాతా నుండి డబ్బు విత్‌డ్రా చేశారు. ఓటీపీ, అకౌంట్ డీటెయిల్స్ లేకుండా ఎలా మోసాలకు పాల్పడుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

సైబర్ మోసగాళ్ళు కొత్త కొత్త మార్గాల్లో ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు. కార్డు, ఓటీపీ వంటివి అవసరం లేకుండానే బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసే కొత్త మోసం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇటీవల జార్ఖండ్‌లో జరిగిన ఒక సంఘటన దీనికి తాజా ఉదాహరణ. జార్ఖండ్‌లోని గర్హ్వా జిల్లాలో ఒక వృద్ధ మహిళ తన ఖాతా నుండి రూ. 10 వేలు డ్రా అయినట్లు గుర్తించింది. ఆమె బ్యాంకుకు వెళ్లి చూసుకున్నప్పుడు ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయింది. విచారణలో ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం కింద సహాయం చేస్తామని చెప్పిన కొందరు వ్యక్తులు ఆమెను మోసం చేశారని వెల్లడైంది. వారు ఆమెకు తెలియకుండానే ఆమె కళ్లను స్కాన్ చేసి, బయోమెట్రిక్ ఆధారంగా ఆమె బ్యాంకు ఖాతా నుండి డబ్బును కొట్టేశారు.
బయోమెట్రిక్ మోసం ఎలా ..?
ఈ రోజుల్లో చాలా బ్యాంకు ఖాతాలు ఆధార్ కార్డుతో అనుసంధానించబడి ఉన్నాయి. దీనివల్ల ఫింగర్‌ప్రింట్, ఐరిస్ స్కాన్ వంటి బయోమెట్రిక్ పద్ధతుల ద్వారా డబ్బును సులభంగా ఉపసంహరించుకోవచ్చు. మోసగాళ్ళు బాధితుల ఆధార్ నంబర్‌ను సంపాదించి, దాని ఆధారంగా బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకుంటారు. ఆ తర్వాత వారికి తెలియకుండానే వారి బయోమెట్రిక్ సమాచారాన్ని సేకరించి, డబ్బును కాజేస్తారు. ఈ కేసులో మహిళ కళ్ళను స్కాన్ చేసి మోసం చేశారు.
సురక్షితంగా ఎలా..?
ఆధార్ కార్డుతో జాగ్రత్త: మీ వ్యక్తిగత పత్రాలు, ముఖ్యంగా ఆధార్ కార్డును ఇతరులకు ఇవ్వడం మానుకోండి. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోగల వర్చువల్ ఆధార్ నంబర్‌ను ఉపయోగించండి.
బయోమెట్రిక్ లాక్ : UIDAI వెబ్‌సైట్ ద్వారా మీ ఆధార్‌లోని బయోమెట్రిక్ సమాచారాన్ని లాక్ చేసే సదుపాయం ఉంది. మీరు ఈ ఫీచర్‌ను ఉపయోగించుకుంటే, మీ వేలిముద్ర లేదా ఐరిస్ స్కాన్‌ను ఎవరూ ఉపయోగించలేరు. అయితే మీరు ఏదైనా బయోమెట్రిక్ సేవను ఉపయోగించాల్సి వచ్చినప్పుడు, దాన్ని తాత్కాలికంగా అన్‌లాక్ చేసి, పని పూర్తయ్యాక తిరిగి లాక్ చేయాలి. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా మీరు బయోమెట్రిక్ మోసాల నుండి మీ బ్యాంకు ఖాతాను సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




