Telangana: భారీ డీల్.. తెలంగాణలో అమెజాన్ డేటా సెంటర్.. ఎక్కడో తెలుసా?
Telangana Amazon Data Center: కొత్త ఒప్పందం ప్రకారం.. AWS తన డేటా సెంటర్ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు, వ్యాపార సౌలభ్యాన్ని అందిస్తుందని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా ఈ ఒప్పందంపై..

Telangana: టెక్ దిగ్గజం అమెజాన్ భారతదేశంలో తన పెట్టుబడులను మరింత వేగవంతం చేసింది. భారతదేశంలో $35 బిలియన్ల పెట్టుబడిని ప్రకటించిన ఒక రోజు తర్వాత, దాని క్లౌడ్ సేవల సంస్థ, AWS (అమెజాన్ వెబ్ సర్వీసెస్), తెలంగాణ ప్రభుత్వంతో ఒక ప్రధాన ఫ్రేమ్‌వర్క్ ఒప్పందంపై సంతకం చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 8,9 తేదీల్లో జరిగిన “తెలంగాణ రైజింగ్” గ్లోబల్ సమిట్‌లో ఫైనల్ అయింది. ఈ ఒప్పందం ప్రకారం, AWS హైదరాబాద్‌లో తన క్లౌడ్ డేటా సెంటర్ మౌలిక సదుపాయాలను విస్తరించడానికి రాబోయే 14 సంవత్సరాలలో $7 బిలియన్లు (సుమారు రూ.63,000 కోట్లు) పెట్టుబడి పెడుతుంది.
ముంబై తర్వాత ఇది రెండవ డేటా సెంటర్:
AWS ద్వారా ఈ కొత్త పెట్టుబడి 2020లో హైదరాబాద్‌లో ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు మూడు సంవత్సరాల క్రితం ప్రకటించిన $2.7 బిలియన్ల పెట్టుబడికి పొడిగింపు. 2022లో ముంబైలో ప్రారంభమైన డేటా సెంటర్ తర్వాత ఇది భారతదేశంలో AWS రెండవ డేటా సెంటర్ ప్రాంతం. ప్రారంభించిన సమయంలో ఈ పెట్టుబడిని 2030 నాటికి $4.4 బిలియన్లకు పెంచాలని కంపెనీ ప్రణాళికలు ప్రకటించింది. ఇప్పుడు కొత్త $7 బిలియన్లతో AWS హైదరాబాద్ ప్రాంతం దేశవ్యాప్తంగా క్లౌడ్ సేవలు, కృత్రిమ మేధస్సు, స్టార్టప్‌లు, ప్రభుత్వ ప్లాట్‌ఫామ్‌లకు ప్రధాన సాంకేతిక కేంద్రంగా మారనుంది.
ఇది కూడా చదవండి: SBI: ఎస్‌బీఐ రుణ రేట్లు తగ్గింపు.. గృహ, వ్యక్తిగత లోన్స్ చౌకగా.. EMIలో ఉపశమనం!
ఈ ఒప్పందంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ఇది తెలంగాణ పరిపాలనపైన, ఆర్థిక దృష్టికోణంపైన ప్రపంచ దిగ్గజ కంపెనీల నమ్మకానికి నిదర్శనమని అన్నారు. అమెజాన్ చేసిన ఈ భారీ కమిట్‌మెంట్ తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే మా లక్ష్యానికి పెద్ద బలమన్నారు. ఇది తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌కు ప్రత్యక్ష ఉదాహరణ అని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
ఈ విస్తరణ హైదరాబాద్‌ను భారతదేశ డేటా సెంటర్ రాజధానిగా స్థిరపరుస్తుందని, ఉపాధి, ఆవిష్కరణ, AI, డిజిటల్ మౌలిక సదుపాయాలలో రాష్ట్రానికి పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. AWS ఇండియా, దక్షిణాసియా అధ్యక్షుడు సందీప్ దత్తా మాట్లాడుతూ.. ఈ ఒప్పందం భారతదేశ డిజిటల్ పురోగతికి అమెజాన్ నిరంతర నిబద్ధతను ప్రదర్శిస్తుందని, తెలంగాణను ప్రపంచ టెక్ హబ్‌గా మార్చాలనే దాని దార్శనికతను బలపరుస్తుందని అన్నారు.
ఇది కూడా చదవండి: Tata Motors: ఈ టాటా కారు కొత్త రికార్డు.. 29 కి.మీ మైలేజీ.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








