Lost Your Smart Phone: మీ మొబైల్ ఫోన్‌ను దొంగలించారా? అయితే ఆలస్యం చేయకుండా ఇలా చేయండి..
మీ మొబైల్ ఫోన్ ఎక్కడైనా పడిపోయినా లేదా ఎవరైనా దొంగలించినా.? కచ్చితంగా చాలానే నష్టం జరుగుతుంది.

ఒకప్పుడైతే ఒకరితో మరొకరు మాట్లాడేందుకు మొబైల్ ఫోన్లు వినియోగించుకునేవారు. కానీ ఇప్పుడు కేవలం ఫోన్ కాల్స్ కోసమే కాకుండా.. ఆర్ధిక లావాదేవీలతో పాటు ఇంటి నుంచే చాలా పనులు పూర్తి చేసేందుకు మొబైల్ ఫోన్లు అవసరమవుతున్నాయి. ప్రతీ ఒక్కరి జీవితంలో మొబైల్ ఫోన్ ఓ భాగం అయిపోయింది. అది లేకపోతే వారి రోజు గడవదు అంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో మీ మొబైల్ ఫోన్ ఎక్కడైనా పడిపోయినా లేదా ఎవరైనా దొంగలించినా.? కచ్చితంగా చాలానే నష్టం జరుగుతుంది. మన అంతర్గత సమాచారం బయటికి తెలియడమే కాదు.. మనం ఇబ్బందుల్లో పడే అవకాశం కూడా ఉంది. మరి అలా కాకుండా ఉండాలంటే.. స్మార్ట్‌ఫోన్ పోగొట్టుకున్న వెంటనే ముందుగా ఈ ముఖ్యమైన పనులు చేయాలి.
సిమ్‌కార్డు బ్లాక్:
మీ మొబైల్ ఫోన్ ఎక్కడైనా పడిపోయినా/ దొంగలించబడినా మొదటిగా కస్టమర్ కేర్ సిబ్బందికి ఫోన్ చేసి.. సిమ్‌కార్డును బ్లాక్ చేయండి. ఆ తర్వాత మొబైల్ పోయినట్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. తద్వారా మీరు కొలాట్రల్ డ్యామేజ్ తగ్గించవచ్చు.
ఫోన్ బ్లాక్:
మీ మొబైల్ ఫోన్ చోరీకి గురైన వెంటనే.. సీఈఐఆర్(సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) వెబ్‌సైట్‌ను సందర్శించండి. మీ మొబైల్ ఫోన్‌కు సంబంధించిన వివరాలను.. i.e., కొనుగోలు చేసిన బిల్ కాపీ, కంప్లయింట్ నెంబర్ లాంటివి నమోదు చేసి.. ఆ వెబ్‌సైట్‌లో మీ మొబైల్‌ను బ్లాక్ చేయడానికి రిక్వెస్ట్ పెట్టండి.
ఫోన్‌లోని డేటా డిలీట్ చేయండి:
ప్రతీ ఒక్కరూ తమ మొబైల్ ఫోన్‌లోని వివరాలను ఓ గూగుల్ అకౌంట్‌లో భద్రపరుచుకుంటారు. ఇక మీ మొబైల్ ఫోన్ దొంగలించబడిన వెంటనే.. మీరు www.google.com/android/find లింక్ క్లిక్ చేయండి. ఆ లింక్‌లోకి లాగిన్ కాగానే మీ ఫోన్ సమాచారం వచ్చేస్తుంది. ఇక అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ద్వారా మీరు ఫోన్‌లోని డేటా డిలీట్ చేయవచ్చు. కాగా, మొబైల్ పోయిన/ దొంగలించిన వెంటనే ఈ 3 పనులు చేయడం ద్వారా మీరు మీ మొబైల్ ఫోన్ దుర్వినియోగం కాకుండా కాపాడుకోవచ్చు.(Source)