Cyber Crimes: ఈ వైరస్ ‘కరోనా’ కంటే డేంజర్.. మీ ఖాతా మొత్తం ఖాళీ అయిపోతుంది.. తస్మాత్ జాగ్రత్త..
ఇప్పుడు వైరస్ ల కాలం నడుస్తోంది. వైరస్ పేరు చెప్తేనే ప్రజలు హడలిపోతున్నారు. ఎందుకంటే కరోనా వైరస్ సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. కరోనా ప్రభావం మొదలైనప్పటి..
Cyber Crimes: ఇప్పుడు వైరస్ ల కాలం నడుస్తోంది. వైరస్ పేరు చెప్తేనే ప్రజలు హడలిపోతున్నారు. ఎందుకంటే కరోనా వైరస్ సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి వైరస్ అంటే భయం పట్టుకుంది. కరోనా తర్వాత ఈవైరస్ కు చెందిన అనేక వేరియంట్లు అభివృద్ధి చెందడం.. వీటి బారిన ప్రజలు పడటంతో వైరస్ అంటే ఒకరకంగా వణుకు మొదలైంది. దీంతో ప్రజలంతా అప్రమత్తమై ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇది ఆరోగ్యానికి సంబంధించి.. అయితే ఇప్పుడు మరో వైరస్ తెగ భయపెడుతోంది. అయితే ఇది ఆరోగ్యానికి సంబంధించిన వైరస్ కాదులేండి.. సైబర్ నేరాలకు సంబంధించిన వైరస్.. ఇదే సోవా.. ఈవైరస్ ను మొబైళ్లలోకి పంపిచడం ద్వారా సైబర్ నేరగాళ్లు మన బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేస్తున్నారు. ఆర్థిక నేరాలకు సంబధించిన ఈవైరస్ ఇప్పుడు అందరిని భయపెడుతోంది. అందుకే ఇండియన్ ఫెడరల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ తన లేటెస్ట్ అడ్వైజరీలో కీలక విషయాన్ని వెల్లడించింది. రహస్యంగా.. మనకు తెలియకుండానే ఆండ్రాయిడ్ ఫోన్లలోకి చొరబడి.. వినియోగదారుల రహస్య సమాచారాన్ని సైబర్ నేరగాళ్లకు చేరవేయడం ద్వారా బ్యాంకు ఖాతాల్లో సొమ్మును మాయం చేయగల కొత్తరకం మొబైల్ వైరస్ ‘సోవా’ దేశంలో విస్తరించే ముప్పుందని భారత్‌లో సైబర్ దాడులను అరికట్టేందుకు కృషిచేసే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT- IN) హెచ్చరించింది. మొబైల్‌లోకి ఈ వైరస్ చొరబడితే.. దాన్ని వదిలించుకోవడమూ సులువు కాదంటూ అప్రమత్తం చేసింది.
సైబర్ నేరాలకు సంబంధించిన ఈవైరస్ లేదా మాల్ వేర్ను సోవాగా పిలుస్తారని.. తొలిసారిగా 2021 సెప్టెంబర్ లో ఈవైరస్ మార్కెట్‌లో ప్రత్యక్షమైంది. భారత్‌లో ఈ ఏడాది జులైలో దీని ఆనవాళ్లు కనిపించాయని, ప్రస్తుతం ఈ వైరస్ ఐదో వెర్షన్‌కు అప్‌గ్రేడ్ అయిందని CERT -IN తెలిపింది. నకిలీ ఆండ్రాయిడ్ యాప్‌లలో సోవా వైరస్ ఉంటుందని, సైబర్ నేరగాళ్లు పంపే మోసపూరిత సందేశాలపై క్లిక్ చేయడం ద్వారా కూడా ఫోన్లలో ఈ మాల్‌వేర్ ప్రవేశిస్తుందని హెచ్చరించింది.
వినియోగదారుల బ్యాంకింగ్ యాప్‌లు, బ్యాంకు ఖాతాల యూజర్ నేమ్‌లు, పాస్‌వర్డులన్నింటినీ ఈ వైరస్ దొంగించలగలదని, సోవా కొత్త వెర్షన్.. క్రిప్టో వ్యాలెట్‌లు సహా 200కు పైగా యాప్‌లను లక్ష్యంగా చేసుకోగలదని తెలిపింది. అందుకే బ్యాంకింగ్ వినియోగదారులంతా అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ తెలిపింది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..