e-waste: ప్రపంచాన్ని ముంచేస్తున్న ఇ-వేస్ట్.. రీసైక్లింగ్ చేయకపోతే పలు అనర్ధాలు.. హెచ్చరిస్తున్న నిపుణులు!

e-waste: ప్రపంచాన్ని ముంచేస్తున్న ఇ-వేస్ట్.. రీసైక్లింగ్ చేయకపోతే పలు అనర్ధాలు.. హెచ్చరిస్తున్న నిపుణులు!
E Waste

2019 లో ప్రపంచవ్యాప్తంగా పారబోసిన ఎలక్ట్రానిక్ వ్యర్థాలు 50 మిలియన్ టన్నులు ఉంటాయని అంచనా వేశారు. ఇతర అన్ని వ్యర్ధాల కంటే ఎలక్ట్రానిక్ వ్యర్థాలే ఇప్పుడు ప్రపంచంలో వేగంగా పెరుగుతున్న వ్యర్థ ప్రవాహం గా మారిపోయాయి.

KVD Varma

|

Apr 21, 2021 | 10:40 PM

e-waste: 2019 లో ప్రపంచవ్యాప్తంగా పారబోసిన ఎలక్ట్రానిక్ వ్యర్థాలు 50 మిలియన్ టన్నులు ఉంటాయని అంచనా వేశారు. ఇతర అన్ని వ్యర్ధాల కంటే ఎలక్ట్రానిక్ వ్యర్థాలే ఇప్పుడు ప్రపంచంలో వేగంగా పెరుగుతున్న వ్యర్థ ప్రవాహం గా మారిపోయాయి. ఇటీవల పేరుకుపోతున్న ఇ-వ్యర్ధాలలో ఎక్కువ శాతం కంప్యూటర్లు, సెల్‌ఫోన్‌లే ఉంటున్నాయి. తక్కువ వ్యర్థాలను ఉత్పత్తి చేసే పరిశ్రమలను సృష్టించాల్సిన అవసరం ఉందంటూ నిపుణులు మొత్తుకుంటున్నారు.

ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం.. 2019లో 50 మిలియన్ టన్నులకు పైగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలు డంప్‌ అయ్యాయి. అదే 2018లో ఈ వ్యర్థ ప్రవాహం లెక్క 48.5 మిలియన్ టన్నులుగా ఉంది. ఇ-వ్యర్ధాలపై ప్రపంచ ఆర్థిక సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా పారవేస్తున్న ఈ-వ్యర్ధాల విలువ సుమారు 62.5 బిలియన్‌ డాలర్లు ఉంటుందని అంచనా వేశారు. ఇది అనేక దేశాల జీడీపీ కంటే ఎక్కువ కావడం గమనార్హం. ఈ వ్యర్ధాలను రీసైకిల్ చేసే మెరుగైన పరిశ్రమను సృష్టించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు చెబుతున్నారు. దీని ద్వారా నూతన వాణిజ్యం, ఉపాధి అవకాశాలు ఏర్పడే వీలు కలుగుతుందని చెబుతున్నారు.

గత నెలలో, ఇ-వేస్ట్ సంక్షోభాన్ని పరిష్కరించే ప్రణాళికలను టెక్నాలజీ సంస్థలు ప్రకటించాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, డెల్ కంపెనీలు 2030 నాటికి జీరో వేస్ట్‌ లక్ష్యాలను ప్రతిపాదించాయి. వ్యర్థాల రవాణాపై “కరో సంభవ్” పేరుతో స్టార్టప్ కంపెనీ ద్వారా ప్రణు సింఘాల్ బృందం కృషి చేస్తోంది. తమ అజూర్ క్లౌడ్ సేవల ద్వారా వీరికి సమాచారాన్నిఅందించడంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ సహాయపడుతోంది.

దేశంలోని 28 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. 500 కి పైగా ప్రైవేటు మరియు ప్రభుత్వ సంస్థలు, 22,700 పాఠశాలలు, 5,000 అనధికారిక రంగాల అగ్రిగేటర్లు, 800 మరమ్మతు దుకాణాలతో కలిసి కృషి చేస్తోంది ఈ సంస్థ. ఈ స్టార్టప్ భారతదేశం యొక్క ఇ-వేస్ట్ సమస్యను పరిష్కరించడానికి పనిచేస్తుంది. తయారీదారులు, పంపిణీదారులు, రీసైక్లర్లు కలిసి వారి రీసైక్లింగ్ ప్రయత్నాలలో సమన్వయం చేస్తూ వస్తోంది ఈ సంస్థ. ప్రతి సంవత్సరం భారతదేశం ఉత్పత్తి చేసే ఇ-వ్యర్థాలు దాదాపు 3.2 మిలియన్ మెట్రిక్ టన్నులు. దీనిలో ఎక్కువ భాగాన్ని రీసైకిల్ చేయడానికి ప్రయత్నిస్తోంది భారతదేశం. ఎలక్ట్రానిక్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పార్కు ఏర్పాటుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఉపకరణాలు, ఇ-వెహికల్ బ్యాటరీలను సురక్షితంగా, శాస్త్రీయంగా పారవేయడానికి ఇ-వేస్ట్ మేనేజ్‌మెంట్ పార్కు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. 2018 అధ్యయనం ప్రకారం ఢిల్లీలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల ప్రాసెసింగ్ యొక్క 15 అనధికారిక హాట్ ‌స్పాట్లు ఉన్నాయి. ఇవి ఎటువంటి ఆరోగ్య లేదా పర్యావరణ భద్రతలు లేకుండా పనిచేస్తున్నాయని వెల్లడయింది. ప్రపంచవ్యాప్తంగా, ఇ-వ్యర్థాలను బాగా నిర్వహించడానికి పోరాడుతున్నాయి పలు కంపెనీలు. జలమార్గాల్లో తేలియాడే ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడానికి కంబోడియాలో డ్రోన్‌లు ఉపయోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పారవేస్తున్న ఇ-వ్యర్థాలలో కేవలం 20 శాతం మాత్రమే రీసైకిల్‌ కోసం సేకరించడం జరుగుతోంది. మిగిలిన 80 శాతం ఇ-వ్యర్ధాలు భూమిపై అనేకచోట్ల కుప్పలుగా పేరుకుపోతున్నాయి.

వీటి వలన పర్యావరణానికి జరుగుతున్న హానిపై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ వేస్ట్ తగ్గించే ప్రయత్నాలు వేగంగా జరగాల్సిన అవసరం ఉంది.

Also Read: Fire in Bag: రోడ్డు మీద నడుస్తున్న వ్యక్తి బ్యాగ్ లో పేలుడు.. హడలి పోయిన జనం..పేలింది ఏమిటంటే.. Viral Video

Dance in Water: మీరు నీటి అడుగున ఆక్సిజన్ లేకుండా నడవగలరా? కానీ, ఏకంగా డ్యాన్స్ చేసిందీ భామ! Viral Video

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu