Travis Head : ఒక్క క్యాచ్ డ్రాప్ కొంపముంచింది..అడిలైడ్ గడ్డపై ట్రావిస్ హెడ్ విశ్వరూపం
Travis Head : అడిలైడ్ ఓవల్ మైదానాన్ని తన సొంత ఇల్లుగా మార్చుకున్న ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ మరోసారి వీరవిహారం చేశాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ మూడో టెస్టులో హెడ్ అదిరిపోయే సెంచరీతో చెలరేగిపోయాడు. ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడి చేసి తన టెస్ట్ కెరీర్‌లో 11వ సెంచరీని నమోదు చేశాడు.

Travis Head : అడిలైడ్ ఓవల్ మైదానాన్ని తన సొంత ఇల్లుగా మార్చుకున్న ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ మరోసారి వీరవిహారం చేశాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ మూడో టెస్టులో హెడ్ అదిరిపోయే సెంచరీతో చెలరేగిపోయాడు. రెండో ఇన్నింగ్స్‌లో బాధ్యతాయుతంగా ఆడుతూనే, ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడి చేసి తన టెస్ట్ కెరీర్‌లో 11వ సెంచరీని నమోదు చేశాడు. ఈ సెంచరీతో అతను ఆస్ట్రేలియా దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మాన్ వంటి దిగ్గజాల సరసన నిలిచి చరిత్ర సృష్టించాడు.
ట్రావిస్ హెడ్ కేవలం 146 బంతుల్లోనే తన సెంచరీ మార్కును అందుకున్నాడు. ఇందులో 8 ఫోర్లు, 2 సిక్సర్లు ఉండటం విశేషం. ఈ యాషెస్ సిరీస్‌లో ఇది అతనికి రెండో సెంచరీ. అంతకుముందు జరిగిన మొదటి టెస్టులో కూడా హెడ్ సెంచరీతో మెరిశాడు. అడిలైడ్ గడ్డపై హెడ్ బ్యాటింగ్ చేస్తుంటే ఒక లీడర్ లాగా కనిపిస్తున్నాడని, ఇంగ్లాండ్ బౌలర్లకు ఏం చేయాలో పాలుపోవడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అతని బ్యాటింగ్ పవర్ చూస్తుంటే ఇంగ్లాండ్‌కు ఈ టెస్టులో ఓటమి దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
అయితే ఈ సెంచరీ వెనుక ఒక చిన్న డ్రామా కూడా నడిచింది. హెడ్ 99 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ స్లిప్‌లో ఒక ఈజీ క్యాచ్‌ను వదిలేశాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన అద్భుతమైన బంతికి హెడ్ దొరికిపోయినా, క్యాచ్ డ్రాప్ అవ్వడంతో బతికిపోయాడు. ఆ తర్వాతి బంతికే సింగిల్ తీసి తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఒక్క క్యాచ్ డ్రాప్ ఇంగ్లాండ్ జట్టు కొంపముంచింది. ఆ లైఫ్ ఇచ్చిన తర్వాత హెడ్ మరింత ఆత్మవిశ్వాసంతో ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
ఈ సెంచరీతో ట్రావిస్ హెడ్ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అడిలైడ్ మైదానంలో ఇది అతనికి వరుసగా నాలుగో టెస్ట్ సెంచరీ. గతంలో ఇలా ఒకే మైదానంలో వరుసగా నాలుగు సెంచరీలు చేసిన రికార్డు డాన్ బ్రాడ్‌మాన్, మైకేల్ క్లార్క్, స్టీవ్ స్మిత్ వంటి దిగ్గజాల పేరిట మాత్రమే ఉండేది. ఇప్పుడు 2022 నుంచి 2025 మధ్య కాలంలో అడిలైడ్‌లో ఆడిన ప్రతి టెస్టులోనూ సెంచరీ బాది హెడ్ వారి క్లబ్‌లో చేరిపోయాడు. అడిలైడ్ అంటే హెడ్ అడ్డా అని ఈ రికార్డుతో మరోసారి నిరూపితమైంది.
మూడో రోజు ఆట ముగిసే సమయానికి ట్రావిస్ హెడ్ 196 బంతుల్లో 142 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా భారీ ఆధిక్యంలో ఉంది. నాలుగో రోజు ఉదయం హెడ్ తన వ్యక్తిగత స్కోరును డబుల్ సెంచరీగా మారుస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫామ్ గనుక ఇలాగే కొనసాగితే యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




