Tokyo Olympics 2021: టోక్యోలో విజృంభిస్తున్న కరోనా.. రికార్డు స్థాయిలో కేసుల నమోదు.. క్రీడా గ్రామంలో..

Tokyo Olympics Covid-19 Cases: ఓ వైపు జపాన్ రాజధాని టోక్యో నగరంలో ఒలింపిక్స్ క్రీడలు అట్టహాసంగా జరుగుతుండగా.. మరోవైపు కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా టోక్యోలో

Tokyo Olympics 2021: టోక్యోలో విజృంభిస్తున్న కరోనా.. రికార్డు స్థాయిలో కేసుల నమోదు.. క్రీడా గ్రామంలో..
Tokyo Olympics
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 27, 2021 | 3:10 PM

Tokyo Olympics Covid-19 Cases: ఓ వైపు జపాన్ రాజధాని టోక్యో నగరంలో ఒలింపిక్స్ క్రీడలు అట్టహాసంగా జరుగుతుండగా.. మరోవైపు కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా టోక్యోలో మంగళవారం 2,848 కొత్త కోవిడ్-19 కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇది మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి జపాన్ రాజధానిలో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు. అయితే.. కోవిడ్-19 నిబంధనల మధ్య టోక్యో ఒలింపిక్స్ జరుగుతున్న సమయంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. అయితే.. కరోనాలోని డెల్టా వేరియంట్ కారణంగానే వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోందని.. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. దీంతోపాటు కరోనా బారిన పడి ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా భారీగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం నమోదైన 12,635 కోవిడ్ -19 కేసుల్లో.. 20.8% మంది రోగులు ఆసుపత్రి పాలయ్యారని.. టోక్యోలో మహమ్మారి నియంత్రణకు అత్యవసర పరిస్థితిని విధించడం నయమంటూ అధికారుల ప్యానెల్ ప్రభుత్వానికి సూచించింది.

ఇదిలాఉంటే.. టోక్యో ఒలింపిక్స్ గ్రామంలో కూడా కరోనా ఆందోళనకు గురిచేస్తోంది. టోక్యో ఒలింపిక్స్‌ గ్రామంలో మంగళవారం 7 కొత్త కేసులు నమోదైనట్లు నిర్వాహకులు వెల్లడించారు. వారిలో నలుగురు అథ్లెట్లు, మరో ఇద్దరు సహాయకులని నిర్వాహకులు తెలిపారు. తాజగా నమోదైన కేసులతో కలిపి టోక్యో ఒలింపిక్స్ గ్రామంలో 155 కేసులు నమోదయ్యాయి. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసులు సంఖ్య పెరుగుతున్నాయి. దీంతో క్రీడాకారుల‌కు ప్రతిరోజూ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒలింపిక్స్ గ్రామంలో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. క్రీడలను రద్దు చేయాలని టోక్యో అంతటా నిరసనలు జరిగాయి. క్రీడల వల్ల మహమ్మారి తీవ్రత పెరుగుతుందని పలువురు పేర్కొంటున్నప్పటికీ.. ప్రభుత్వం క్రీడలు నిర్వహించేందుకే మొగ్గుచూపింది. కాగా.. టోక్యో ఒలింపిక్స్ గ్రామంలో జూలై 17న మొట్టమొదటి కోవిడ్-19 కేసు నమోదైంది.

Also Read:

Tokyo Olympics 2020: పతకానికి అడుగు దూరం.. అరంగేట్ర ఒలింపిక్స్‌లో భారత బాక్సర్ అరుదైన రికార్డు!

Tokyo Olympics 2020 Live: క్వార్టర్ ఫైనల్ చేరిన బాక్సర్ లోవ్లినా.. స్పెయిన్‌పై 3-0 తేడాతో భారత హాకీ జట్టు విజయం