PKL 2024: యూపీ యోధాస్‌కు మూడో విజయం.. 34-29తో గుజరాత్ జెయింట్స్‌పై విజయం
Pro Kabaddi League, PKL Season 11: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌లో యూపీ యోధాస్ మూడో విజయం సాధించింది. ఆదివారం హైదరాబాద్‌లోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యూపీ యోధాస్ 5 పాయింట్ల తేడాతో విజయం సాధించింది.
హైదరాబాద్, 27 అక్టోబర్ 2024 : ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌లో యూపీ యోధాస్ మూడో విజయం సాధించింది. ఆదివారం హైదరాబాద్‌లోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన గుజరాత్ జెయింట్స్, యూపీ యోధాస్ మ్యాచ్‌లో యోధాస్ 5 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. యూపీ యోధాస్ ఆటగాళ్లలో స్టార్ రెయిడర్ భవానీ రాజ్‌పుత్ ( 9పాయింట్లు), ఆల్‌రౌండర్ భరత్ (13 పాయింట్లు), డిఫెండర్ మహేందర్ సింగ్ ( 3 పాయింట్లు) సమిష్టి ప్రదర్శనతో చెలరేగారు. గుజరాత్ జెయింట్స్ తరఫున రెయిడర్లు రాకేశ్ (8 పాయింట్లు), హిమాన్షు సింగ్ (9 పాయింట్లు) సూపర్ షోతో మెరిసినా ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.
ప్రథమార్థం ఉత్కంఠగా..:
యూపీ యోధాస్, గుజరాత్ జెయింట్స్ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఆరంభం నుంచీ ఇరు జట్లు ఆధిక్యం నువ్వా నేనా అన్నట్టు పోటీపడ్డాయి. యూపీ యోధాస్ రెయిడర్ భవానీ రాజ్‌పుత్, ఆల్‌రౌండర్ భరత్‌లు కూతలో మెరువగా.. గుజరాత్ జెయింట్స్ రెయిడర్ రాకేశ్, నీరజ్ కుమార్‌లు పాయింట్ల వేటలో దూకుడు చూపించారు. ట్యాకిల్స్‌లో జెయింట్స్ పైచేయి సాధించినా.. కూతలో యోధాస్ అదరగొట్టింది. ప్రథమార్థంలోనే గుజరాత్ జెయింట్స్‌ను ఓసారి ఆలౌట్ చేసింది. 20 నిమిషాల ఆట అనంతరం 19-17తో ఆధిక్యంలో నిలిచింది. ఆలౌట్ పాయింట్లు యూపీ యోధాస్‌ను ముందంజలో నిలిపాయి.
సెకండ్‌హాఫ్‌లోనూ ఉత్కంఠ కొనసాగింది. యూపీ యోధాస్ ముందంజలో నిలిచినా.. గుజరాత్ జెయింట్స్ మరీ ఎక్కువ పాయింట్ల వెనుకంజ వేయలేదు. చావోరేవో తేల్చుకోవాల్సిన రెయిడ్లలో హిమాన్షు సింగ్ వరుసగా పాయింట్లు సాధించటంతో గుజరాత్ జెయింట్స్ రేసులోనే నిలిచింది. రాకేశ్, హిమాన్షు సూపర్ రెయిడ్లతో 37వ నిమిషంలో గుజరాత్ జెయింట్స్ 26-27తో యోధాస్‌పై ఒత్తిడి పెంచింది. కానీ ఆ తర్వాత చావోరేవో కూతకెళ్లిన హిమాన్షు నిరాశపరచటంతో యూపీ యోధాస్ మళ్లీ మూడు పాయింట్ల ఆదిక్యంలోకి దూసుకెళ్లింది. ఆఖరు నిమిషంలో భరత్ వరుసగా రెండు సార్లు సూపర్ రెయిడ్‌తో మెరువటంతో యూపీ యోధాస్ అదిరే విజయం అందుకుంది.