PKL 2024: ఆఖరు కూత వరకు ఉత్కంఠ.. తమిళ్ తలైవాస్ – జైపూర్ పింక్ పాంథర్స్ మ్యాచ్ టై
Pro Kabaddi League 2024 - Season 11: ఆఖరు రెయిడ్ వరకు ఉత్కంఠ రేపిన జైపూర్ పింక్ పాంథర్స్, తమిళ్ తలైవాస్ మ్యాచ్ 30-30తో టైగా ముగిసింది. హైదరాబాద్‌లోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్ లీగ్ దశ మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్, జైపూర్ పింక్ పాంథర్స్ సమవుజ్జీలుగా నిలిచి పాయింట్లను సమంగా పంచుకున్నాయి.
హైదరాబాద్, 27 అక్టోబర్ 2024: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌లో వరుసగా రెండో మ్యాచ్ టైగా ముగిసింది. ఆఖరు రెయిడ్ వరకు ఉత్కంఠ రేపిన జైపూర్ పింక్ పాంథర్స్, తమిళ్ తలైవాస్ మ్యాచ్ 30-30తో టైగా ముగిసింది. హైదరాబాద్‌లోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్ లీగ్ దశ మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్, జైపూర్ పింక్ పాంథర్స్ సమవుజ్జీలుగా నిలిచి పాయింట్లను సమంగా పంచుకున్నాయి. జైపూర్ పింక్ పాంథర్స్ ఆటగాళ్లలో అర్జున్ (7 పాయింట్లు), వికాశ్ (6 పాయింట్లు), రెజా (3 పాయింట్లు), అంకుశ్ ( 4 పాయింట్లు) రాణించారు. తమిళ్ తలైవాస్ శిబిరం నుంచి సచిన్ (11 పాయింట్లు), నరేందర్ (3 పాయింట్లు) ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. ప్రథమార్థంలో ఐదు పాయింట్ల వెనుకంజలో నిలిచిన తలైవాస్.. సచిన్ సూపర్ టెన్ షోతో ద్వితీయార్థంలో గొప్పగా పుంజుకుంది. జైపూర్ చేజేతులా విజయాన్ని దూరం చేసుకోగా.. తలైవాస్ ఓటమి నుంచి తప్పించుకుంది.
జైపూర్ సమిష్టిగా.. :
గత మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ చేతిలో ఓడిన జైపూర్ పింక్ పాంథర్స్.. తమిళ్ తలైవాస్‌తో మ్యాచ్‌ను దూకుడుగా ఆరంభించింది. ఆరంభం నుంచి రెయిడింగ్‌లో, డిఫెన్స్‌లో పాయింట్లు సాధిస్తూ ఆధిక్యం నిలుపుకుంది. తొలి 20 నిమిషాల ఆట అనంతరం జైపూర్ పింక్ పాంథర్స్ 21-16తో ముందంజ వేసింది. ఐదు పాయింట్లతో తలైవాస్‌పై పైచేయి సాధించింది. తలైవాస్ రెయిడర్లు సచిన్, నరేందర్‌లు మూడేసి బోనస్ పాయింట్లు సాధించగా జైపూర్‌కు పోటీ ఇవ్వగలిగింది. జైపూర్‌లో అర్జున్ దేశ్వాల్‌కు వికాశ్, రెజా, అంకుశ్‌లు సహకరించారు. దీంతో పింక్ పాంథర్స్ ప్రథమార్థంలో విలువైన ఆధిక్యం సొంతం చేసుకుంది.
పుంజుకున్న తలైవాస్ :
విరామ సమయం అనంతరం జైపూర్ పింక్ పాంథర్స్ నెమ్మదించగా.. తమిళ్ తలైవాస్ వరుసగా పాయింట్లు ఖాతాలో వేసుకుంది. కానీ జైపూర్ పింక్ పాంథర్స్ ఆధిక్యాన్ని నిలుపుకుంది. సచిన్ సూపర్ రెయిడ్‌కు తోడు విశాల్ సక్సెస్‌ఫుల్ రెయిడ్‌తో మరో మూడు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా 26-29తో పాయింట్ల అంతరాన్ని కుదించిన తమిళ్ తలైవాస్ ఆఖరు వరకు రేసులోనే నిలిచింది. ఆఖర్లో కూతలో, పట్టులో అదరగొట్టిన తలైవాస్ స్కోరు సమం చేసింది. సక్సెస్‌ఫుల్ రెయిడ్‌తో అంతరాన్ని ఓ పాయంట్‌కు కుదించి.. ఆఖరు కూతకు వచ్చిన జైపూర్ రెయిడర్ రెజాను అవుట్ చేసింది. దీంతో 30-30తో స్కోరు సమమైంది.