టోక్యో ఒలింపిక్స్‌లోకి తొలిసారి టీటీ.. ఈజీగా మెడల్ గెలుస్తామంటున్న మిక్స్‌డ్ జోడీ
Mixed Doubles Pair: భారత టేబుల్ టెన్నిస్ ఆటగాళ్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. టోక్యో ఒలింపిక్స్ వేదికగా టీటీలో తొలిసారి ప్రవేశపెట్టనున్న మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో..
Sharath Kamal and Manika Batra: భారత టేబుల్ టెన్నిస్ ఆటగాళ్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. టోక్యో ఒలింపిక్స్ వేదికగా టీటీలో తొలిసారి ప్రవేశపెట్టనున్న మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో భారత ప్రాతినిధ్యం ఓకే అయ్యింది. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత జంట ఆచంట శరత్ కమల్–మౌనిక బత్రా విజేతగా నిలిచి ‘టోక్యో’ బెర్త్‌ను ఖరారు చేసుకున్నారు. ఫైనల్లో శరత్ కమల్–మనిక జోడీ 8–11, 6–11, 11–5, 11–6, 13–11, 11–8తో టాప్ సీడ్, దక్షిణ కొరియా ఆటగాళ్లు ప్రపంచ ఐదో ర్యాంక్ జంట సాంగ్ సు లీ–జియోన్ జిహీపై విజయం నమోదు చేసుకున్నారు. 1988 సియోల్ ఒలింపిక్స్‌లో తొలిసారి టీటీ క్రీడకు చోటు లభించింది. పురుషుల, మహిళల సింగిల్స్, డబుల్స్ కేటగిరీల్లో పోటీలు నిర్వహించారు.
2008 బీజింగ్ ఒలింపిక్స్ నుంచి మెన్స్, ఉమెన్స్ డబుల్స్ ఈవెంట్‌లను తొలగించి వాటి స్థానంలో జట్టును తీసుకొచ్చారు. మూడు ఒలింపిక్స్ క్రీడల తర్వాత టీమ్ ఈవెంట్స్‌కు జతగా మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌ను ప్రవేశపెట్టాలని టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి సత్యన్ జ్ఞానశేఖరన్, శరత్ కమల్… మహిళల సింగిల్స్‌లో సుతీర్థ ముఖర్జీ, మనిక బత్రా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. క్వాలిఫయింగ్ టోర్నీలో విజేతగా నిలుస్తామని ఊహించలేదని శరత్ కమల్ చెప్పుకొచ్చారు. ఫైనల్లో మౌనిక అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారు. ఒలింపిక్స్‌లో మిక్స్‌డ్ ఈవెంట్‌లో 16 జోడీలు మాత్రమే ఉన్న నేపథ్యంలో మేము మూడు మ్యాచ్‌ల్లో గెలిస్తే పతకం గ్యారెంటీ అని అభిప్రాయ పడ్డాడు. సింగిల్స్‌తో పోలిస్తే మిక్స్‌డ్ డబుల్స్‌లో మాకు పతకం గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయని శరత్ కమల్ కామెంట్ చేశాడు.