గుండుపై ముద్దు నుంచి పిచ్‌లోనే టాయిలెట్, స్టేడియంలో క్షుద్రపూజల వరకు.. ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలుసా..?
FIFA World Cup Interesting Facts: ఫుట్‌బాల్ ప్రపంచకప్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానుల సెంటిమెంట్లు, భావోద్వేగాల సమాహారం. పిచ్‌పై ఆటగాళ్లు ఎంత చెమటోడుస్తారో, గెలుపు కోసం తెరవెనుక అంతకంటే వింతైన ఆచారాలు, సెంటిమెంట్లు నడుస్తుంటాయి. మ్యాచ్ గెలవడం కోసం ఆటగాళ్లు, కోచ్‌లు, చివరికి అభిమానులు కూడా నమ్మే కొన్ని క్రేజీ, విచిత్రమైన అలవాట్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం..!

FIFA World Cup Interesting Facts: ఫుట్‌బాల్ ప్రపంచకప్ అంటే కేవలం 90 నిమిషాల ఆట, వ్యూహాలు మాత్రమే కాదు. అది మైదానంలో ఆటగాళ్ల నరాలు తెగే ఉత్కంఠ, మైదానం వెలుపల కోట్ల మంది నమ్మకాల సమాహారం. గెలుపు కోసం ఆటగాళ్లు, కోచ్‌లు, అభిమానులు అనుసరించే కొన్ని ఆచారాలు చూస్తే.. “ఇలా కూడా చేస్తారా?” అని ముక్కున వేలేసుకోక తప్పదు. మరికొన్ని వింతలు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేలా చేశాయి. ఆ క్రేజీ, విచిత్రమైన విషయాల గురించిన పూర్తి వివరాలు మీకోసం:
1. ఫ్రాన్స్ ‘లక్కీ’ బట్టతల ముద్దు (1998): ప్రపంచకప్ చరిత్రలో అత్యంత ప్రసిద్ధమైన, కెమెరాలకు చిక్కిన సెంటిమెంట్ ఇది. 1998లో ఫ్రాన్స్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో ఆ జట్టు డిఫెండర్ లారెంట్ బ్లాంక్ ఒక వింత అలవాటును మొదలుపెట్టాడు. ప్రతి మ్యాచ్ ప్రారంభానికి ముందు, అతను తమ జట్టు గోల్‌కీపర్ ఫాబియన్ బార్తెజ్ వద్దకు వెళ్లి, అతని బట్టతలపై ముద్దు పెట్టుకునేవాడు.
ఇలా చేస్తే జట్టుకు అదృష్టం కలిసి వస్తుందని నమ్మేవారు. టోర్నమెంట్ సాగుతున్న కొద్దీ ఇది జట్టు మొత్తానికి ఒక ఆచారంగా మారింది. చివరికి ఫైనల్ మ్యాచ్‌కంటే ముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు కూడా బార్తెజ్ బట్టతలపై ముద్దు పెట్టడం విశేషం. ఆ ఏడాది ఫ్రాన్స్ తొలిసారి ప్రపంచ విజేతగా నిలిచింది.
2. షూటౌట్ సెంటిమెంట్: పిచ్‌పైనే మూత్ర విసర్జన: 1990 ప్రపంచకప్‌లో అర్జెంటీనా గోల్‌కీపర్ సెర్గియో గోయ్‌కోచియా ఒక విచిత్రమైన ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో యుగోస్లేవియాపై మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. ఆ సమయంలో తీవ్రమైన ఒత్తిడి వల్ల, అలాగే నిబంధనల ప్రకారం పిచ్ వదిలి వెళ్లకూడదు కాబట్టి, అతను మైదానంలోనే గోల్‌పోస్ట్ పక్కన మూత్ర విసర్జన చేశాడు.
ఆ షూటౌట్‌లో అర్జెంటీనా గెలిచింది. దానితో సెర్గియో దీనిని ఒక లక్కీ సెంటిమెంట్‌గా మార్చుకున్నాడు. ఆ తర్వాత సెమీఫైనల్‌లో ఇటలీతో జరిగిన షూటౌట్‌కు ముందు కూడా అతను కావాలనే పిచ్‌పై మూత్ర విసర్జన చేశాడు. ఆ మ్యాచ్‌లోనూ అర్జెంటీనా గెలిచి ఫైనల్ చేరింది.!
3. జంతువుల జోస్యాలు: ‘పాల్’ ది ఆక్టోపస్ (2010): ఫుట్‌బాల్ చరిత్రలో ఆటగాళ్లను మించి పాపులారిటీ తెచ్చుకున్న ఏకైక జంతువు ‘పాల్’. జర్మనీలోని ఒక అక్వేరియంలో ఉన్న ఈ ఆక్టోపస్ 2010 ప్రపంచకప్ సమయంలో అంచనాలకు అతీతంగా జోస్యాలు చెప్పింది. మ్యాచ్ ఆడే రెండు దేశాల జెండాలు ఉన్న రెండు పారదర్శక పెట్టెలను నీళ్లలో ఉంచితే, పాల్ ఏ పెట్టెలోని ఆహారాన్ని తింటే ఆ దేశం గెలుస్తుందని అర్థం.
జర్మనీ ఆడిన 7 మ్యాచ్‌లతో పాటు, స్పెయిన్-నెదర్లాండ్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ఫలితాన్ని కూడా పాల్ 100% కరెక్ట్‌గా అంచనా వేసింది. దీని జోస్యాల వల్ల బెట్టింగ్ మార్కెట్ తలకిందులైంది.
4. ఇటలీ కోచ్ ‘పవిత్ర జలం’ (2002): 2002 ప్రపంచకప్‌లో ఇటలీ జట్టు మేనేజర్ (కోచ్) గియోవన్నీ ట్రాపట్టోని ఒక విచిత్రమైన నమ్మకాన్ని పాటించాడు. అతను ప్రతి మ్యాచ్ ప్రారంభానికి ముందు, తన సోదరి (ఆమె ఒక సన్యాసిని) ఇచ్చిన ‘పవిత్ర జలాన్ని’ (Holy Water) తెచ్చుకుని, రహస్యంగా పిచ్‌పై చల్లేవాడు. దైవ ఆశీస్సులు ఉంటేనే మ్యాచ్ గెలుస్తామని ఆయన నమ్మకం. అయితే ఆ టోర్నీలో ఇటలీ త్వరగానే నిష్క్రమించడంతో ఈ సెంటిమెంట్ పెద్దగా వర్కవుట్ కాలేదు.
5. బస్ సీట్లు, దుస్తుల సెంటిమెంట్లు: టామీ స్వెన్సన్ (స్వీడన్ కోచ్, 1994): మ్యాచ్ కోసం హోటల్ నుంచి బస్సు బయలుదేరినప్పటి నుంచి స్టేడియం చేరే వరకు బస్సులో కేవలం ఒకే సీట్లో కూర్చునేవాడు. అలాగే ప్రయాణమంతా ఒకే ఒక నిర్దేశిత పాటను లూప్‌లో వినేవాడు. 1994లో స్వీడన్ థర్డ్ ప్లేస్ సాధించడంలో ఈ సెంటిమెంట్ కూడా ఒకటని ఆయన నమ్మాడు.
కార్లోస్ బిలార్డో (అర్జెంటీనా కోచ్, 1986): 1986లో అర్జెంటీనా ప్రపంచకప్ గెలిచినప్పుడు ఆ జట్టు కోచ్ బిలార్డో టోర్నమెంట్ అంతా ఒకే సూట్ వేసుకున్నాడు. అంతేకాదు, మ్యాచ్‌లకు వెళ్లే ముందు తన ఆటగాళ్లెవరూ చికెన్ తినకూడదని నిబంధన పెట్టాడు, ఎందుకంటే చికెన్ తింటే దురదృష్టం వస్తుందని అతని నమ్మకం.
6. అభిమానుల పిచ్చి.. ఆఫ్రికన్ మంత్రాలు: ఆఫ్రికన్ దేశాలైన నైజీరియా, కామెరూన్, ఘనా వంటి జట్లు ప్రపంచకప్‌కు వచ్చేటప్పుడు తమతో పాటు స్థానిక మంత్రగాళ్లను కూడా తెచ్చుకుంటాయి. ప్రత్యర్థి జట్టుపై మంత్రాలు వేయడానికి, తమ ఆటగాళ్లకు రక్షణ కల్పించడానికి స్టేడియం వెలుపల వీరు వింత పూజలు చేస్తుంటారు.
మరోవైపు లాటిన్ అమెరికా దేశాలైన బ్రెజిల్, అర్జెంటీనా అభిమానులు మ్యాచ్ ప్రారంభానికి ముందే “వరల్డ్ కప్ విజేతలు” అని తమ శరీరాలపై టాటూలు వేయించుకుంటారు. ఒకవేళ జట్టు ఓడిపోతే ఆ టాటూలను మార్చడానికి సర్జరీలు చేయించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
సైన్స్, లాజిక్‌ల ప్రకారం ఇవన్నీ కేవలం మూఢనమ్మకాలుగా అనిపించవచ్చు. కానీ, ప్రపంచకప్ లాంటి హై-ప్రెజర్ టోర్నమెంట్లలో ఆటగాళ్లపై ఉండే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుకోవడానికి ఇటువంటి వింత ఆచారాలు ఒక థెరపీలా పనిచేస్తాయని క్రీడా విశ్లేషకులు చెబుతుంటారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
