AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేప ముల్లు గొంతులో ఇరుక్కుందా..? వెంటనే ఇలా చేయండి. ఒక్క సెక‌న్‌లోనే రిలీఫ్…

చేపలు తినేటప్పుడు గొంతులో ముల్లు ఇరుక్కుంటే భయపడాల్సిన అవసరం లేదు. అలాంటి సందర్భాల్లో తక్షణమే పాటించదగిన కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు ఉన్నాయి. కొన్ని పద్దతులను ఉపయోగించి ముల్లును బయటకు తీయవచ్చు లేదా సురక్షితంగా లోపలికి పంపవచ్చు. అయితే.. ఈ చిట్కాలను జాగ్రత్తగా పాటించాలి.. సమస్య తీవ్రమైతే వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం..

చేప ముల్లు గొంతులో ఇరుక్కుందా..? వెంటనే ఇలా చేయండి. ఒక్క సెక‌న్‌లోనే రిలీఫ్...
Fish Bone Stuck In Throat
Shaik Madar Saheb
|

Updated on: Aug 26, 2026 | 3:02 PM

Share

చేపలు రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారం.. ఎన్నో పోషకాలున్న చేపలను నాన్‌వెజ్ ప్రియులు ఇష్టంగా తింటారు. అయితే, చాలా మంది చేపలను తినేందుకు భయపడతారు. ఎందుకంటే.. వాటిని తినేటప్పుడు చేపల ముల్లు గొంతులో ఇరుక్కునే (చిక్కుకునే) అవకాశం ఉంటుంది. ఇది చాలామందికి భయం కలిగించే పరిస్థితి.. ఒక్కోసారి అత్యవసర వైద్య పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అయితే, చేపలు తినేటప్పుడు.. ముల్లు ఇరుక్కుంటే.. భయపడకుండా, కొన్ని సరళమైన, ప్రభావవంతమైన ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా సులభంగా ఉపశమనం పొందవచ్చు. ఈ కథనంలో, చేప ముల్లు గొంతులో ఇరుక్కున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. అనుసరించాల్సిన చిట్కాల గురించి వివరంగా తెలుసుకుందాం..

గొంతులో ముల్లు ఇరుక్కున్నప్పుడు పాటించాల్సిన చిట్కాలు:

పొట్టపై ఒత్తిడి: చేప ముల్లు గొంతులో ఇరుక్కున్నప్పుడు, మీ పొట్టపై ఎవరినైనా గట్టిగా నొక్కమని చెప్పండి. దీనివల్ల అన్నవాహికలోకి గాలి ప్రసారం అవుతుంది. అదేపనిగా నొక్కడం ద్వారా గాలి ఒత్తిడికి ముల్లు బయటకు రావచ్చు. ఒకవేళ లోపలికి వెళ్లినా, పొట్టలోని జీర్ణాశయంలో ఉండే యాసిడ్‌కు దాన్ని అరిగించే శక్తి ఉంటుంది. కాబట్టి పెద్ద ప్రమాదం ఉండదు.

వీపు పై భాగంలో కొట్టడం: ముల్లు ఇరుక్కున్న వ్యక్తిని ముందుకు వంగమని చెప్పి, నోరు తెరిచి ఉంచాలి. తర్వాత ఎవరైనా ఆ వ్యక్తి వీపు పై భాగంలో అదిమి కొట్టడం ద్వారా ముల్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో నోరు తెరిచే ఉంచడం చాలా ముఖ్యం.

అన్నం ముద్ద: చేపల ముల్లు గొంతులో ఇరుక్కున్నప్పుడు.. ఒక కప్పు వండిన అన్నాన్ని తీసుకుని, దాన్ని ముద్దలాగా చేసి, నమలకుండా వెంటనే మింగేయాలి. ఆ తర్వాత ఒక గ్లాసు నీళ్లు తాగాలి.. దీనివల్ల ముల్లు అన్నంతో పాటు పొట్టలోకి జారిపోయి.. వెంటనే ఉపశమనం లభిస్తుంది.

అరటిపండు: ఒక అరటిపండును తీసుకుని సగానికి కొరికి, దాన్ని నమలకుండా పూర్తిగా మింగేయాలి. ఆ తర్వాత కొద్దిగా నీరు తాగండి. అరటిపండు మృదువైన ఆకృతి ముల్లును కప్పుకుని లోపలికి వెళ్లేలా సహాయపడుతుంది.

పల్లీలు: రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకుని బాగా నమిలి మింగేయండి. పల్లీల ఆకృతి ముల్లుకు అతుక్కుని లోపలికి లాగడానికి సహాయపడుతుంది.

బ్రౌన్ బ్రెడ్ – పీనట్ బటర్: ఒక బ్రౌన్ బ్రెడ్ స్లైస్‌ను తీసుకుని, దాని రెండు వైపులా పీనట్ బటర్ రాసి నోట్లో పెట్టుకోండి. మొత్తం మెత్తగా అయ్యాక, నమలకుండా మింగేయండి. వెంటనే కొద్దిగా నీరు తాగండి. బ్రెడ్ – పీనట్ బటర్ ముల్లుకు అతుక్కుని లోపలికి తీసుకువెళ్లగలవు.

వెనిగర్: వెనిగర్ ఒక ఎసిడిక్ ద్రవం కాబట్టి, అది ముల్లును మృదువుగా చేయడానికి లేదా కదపడానికి సహాయపడుతుంది. ఒక గ్లాసు నీటిలో రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ కలిపి, అందులో ఒక చెంచా మాత్రమే తాగండి. ఇది ముల్లును కడుపులోకి నెట్టడానికి తోడ్పడుతుంది.

నీళ్లు తాగడం: చిన్న ముల్లు ఇరుక్కున్నప్పుడు ఏమీ తినకుండా వెంటనే ఒక గ్లాసు నీటిని తాగితే, ఆ ముల్లు సులభంగా లోపలికి జారిపోవచ్చు.

కార్బోనేటెడ్ డ్రింక్స్ (సోడా): డాక్టర్లు కూడా కొన్నిసార్లు చేప ముల్లును తొలగించడానికి కార్బోనేటెడ్ డ్రింక్స్, అంటే సోడా వంటివి ఉపయోగిస్తారు. సోడాలోని వాయువు గొంతులోని ముల్లుపై ఒత్తిడి తెచ్చి, దాన్ని బయటకు నెట్టడంలో సహాయపడుతుంది. కాబట్టి, సోడా అందుబాటులో ఉంటే వెంటనే తాగండి.

ముఖ్యమైన జాగ్రత్తలు – నివారణ చర్యలు:

నెమ్మదిగా తినండి: చేపలను ఎప్పుడూ కంగారుగా తినకూడదు. మాట్లాడకుండా, నెమ్మదిగా, జాగ్రత్తగా తినాలి.

ముల్లును వేరు చేయండి: చేపలను తినేటప్పుడు, అవి తెలియకుండా అన్నం లేదా సూప్‌లో కలిసి గొంతులోకి వెళ్లే ప్రమాదం ఉంది. కాబట్టి, చేపలను ప్రత్యేక ప్లేట్‌లో ఉంచి, ముల్లును వేరు చేసి నెమ్మదిగా తినండి.

పిల్లలకు ప్రత్యేక శ్రద్ధ: పిల్లలకు చేపలు పెట్టేటప్పుడు ముల్లును పూర్తిగా తీసివేయడం తప్పనిసరి.

గొంతును నొక్కవద్దు: ముల్లు ఇరుక్కున్నప్పుడు గొంతును ఎక్కువగా నొక్కడం లేదా ఒత్తడం చేయకూడదు. ఇది పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు.

ఈ చిట్కాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. అయితే, ఒకవేళ ఈ చిట్కాలను పాటించిన తర్వాత కూడా ముల్లు బయటకు రాకపోయినా, లోపలికి వెళ్లకపోయినా, లేదా గొంతులో నొప్పి, అసౌకర్యం, రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. కొన్ని అరుదైన సందర్భాలలో ముల్లు గాయం చేసి ఇన్ఫెక్షన్లకు దారితీసే అవకాశం ఉంది. ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే, ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us