AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులకు బిగ్ అలర్ట్.. గ్రీన్ కార్డ్ రూల్స్‌లో కొత్త మార్పులివే!

అమెరికా విదేశీ ఉద్యోగులకు శాశ్వత నివాస హోదా (గ్రీన్ కార్డ్) కల్పించేందుకు కంపెనీలు అనుసరించే.. 'పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్' (PERM) విధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. దీంతో ఉన్నత చదువులు పూర్తి చేసి.. యూఎస్ఏలో దీర్ఘకాలిక కెరీర్ నిర్మించుకోవాలని కలలు కంటున్న భారతీయ గ్రాడ్యుయేట్లకు గ్రీన్ కార్డ్ ప్రక్రియ మరింత కఠినతరం కానుంది.

అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులకు బిగ్ అలర్ట్.. గ్రీన్ కార్డ్ రూల్స్‌లో కొత్త మార్పులివే!
Us Green Card Rules
Korivi Jayakumar
|

Updated on: Nov 19, 2026 | 4:59 PM

Share

అమెరికా మరోసారి సంచలన నిర్ణయానికి తెరలేపింది. విదేశీ ఉద్యోగులకు శాశ్వత నివాస హోదా (గ్రీన్ కార్డ్) కల్పించేందుకు కంపెనీలు అనుసరించే ‘పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్’ (PERM) విధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఉద్యోగ ఆధారిత వలస నిబంధనల్లో భారీ మార్పులు చేసేందుకు అమెరికా కార్మిక శాఖ (DOL) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీంతో ఉన్నత చదువులు పూర్తి చేసి.. యూఎస్ఏలో దీర్ఘకాలిక కెరీర్ నిర్మించుకోవాలని కలలు కంటున్న భారతీయ గ్రాడ్యుయేట్లకు గ్రీన్ కార్డ్ ప్రక్రియ మరింత కఠినతరం కానుంది.

భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు తెలుసుకోవాల్సిన విషయాలు..

కాగా అమెరికాలో మాస్టర్స్ డిగ్రీలు చదువుతూ, భవిష్యత్తులో కంపెనీ స్పాన్సర్‌షిప్ ద్వారా గ్రీన్ కార్డ్ పొందాలనుకునే భారతీయ విద్యార్థులపై ఈ మార్పుల ప్రభావం పడనుంది. సాధారణంగా ఉన్నత డిగ్రీలు ఉన్నవారికి EB-2, నైపుణ్యం కలిగిన కార్మికులు.. ఇతర నిపుణులకు EB-3 కేటగిరీ వర్తిస్తాయి. గ్రీన్ కార్డ్ ప్రక్రియలో PERM అనేది ఒక ముఖ్యమైన దశ మాత్రమేనని అంటున్నారు. అయితే ప్రస్తుత F-1 విద్యార్థుల OPT లేదా STEM OPT అర్హతలకు ఎలాంటి ఢోకా లేదని.. భవిష్యత్తులో వారి కంపెనీ గ్రీన్ కార్డ్ ప్రక్రియను ప్రారంభించినప్పుడు మాత్రమే ఈ కొత్త నిబంధనలు అడ్డంకిగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు.

దాదాపు 20 ఏళ్ల తర్వాత PERM విధానంలో ఇంత పెద్ద ఎత్తున మార్పులకు అమెరికా శ్రీకారం చుట్టింది. నవంబర్ 17, 2026న ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రచురితమైన ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే.. EB-2, EB-3 వీసా కేటగిరీల కింద గ్రీన్ కార్డ్ పొందడం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి ఇవి ప్రతిపాదనల దశలోనే ఉన్నాయని తెలుస్తోంది. వీటివల్ల F-1 స్టూడెంట్ వీసాలు, OPT లేదా STEM OPT అనుమతులపై నేరుగా ఎలాంటి ప్రభావం ఉండదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నవంబర్ 17న ప్రచురితమైన ఈ ప్రతిపాదనలపై ప్రజలు, నిపుణుల అభిప్రాయాల కోసం 60 రోజుల గడువు ఇచ్చారు. ప్రజల నుంచి వచ్చే సూచనలు, అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతే తుది నిబంధనలను విడుదల చేయడంపై కార్మిక శాఖ నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ ఈ మార్పులు యథాతథంగా ఆమోదం పొందితే అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయ గ్రాడ్యుయేట్లకు గ్రీన్ కార్డ్ నిరీక్షణ కాలం మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

కొత్త నిబంధనల్లో ప్రధాన మార్పులివే..

ప్రస్తుత ప్రతిపాదనల్లో అత్యంత కీలకమైనది ‘షెడ్యూల్ A’ను తొలగించడం. ఇప్పటివరకు నర్సులు, ఫిజికల్ థెరపిస్టులు, సైన్స్, కళల రంగాల్లో అసాధారణ ప్రతిభ ఉన్నవారికి సాధారణ లేబర్ మార్కెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఉండేది. ఈ కొత్త నిబంధన ఆమోదం పొందితే.. ఆయా రంగాల వారిని నియమించుకునే కంపెనీలు కూడా తప్పనిసరిగా సాధారణ PERM నియామక ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. దీంతో పాటు పాత పద్ధతుల స్థానంలో డిజిటల్ రిక్రూట్‌మెంట్ విధానాలను తప్పనిసరి చేయాలని కార్మిక శాఖ ప్రతిపాదించింది. కంపెనీల సొంత వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ జాబ్ పోర్టల్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఉద్యోగ ప్రకటనలను కనీసం 90 రోజుల పాటు ఉంచాల్సి ఉంటుంది. ఈ రకంగా చేయడం వల్ల అమెరికన్ ఉద్యోగులకు దరఖాస్తు చేసుకునేందుకు ఎక్కువ అవకాశాలు కల్పించాలనేది ప్రభుత్వం ఉద్దేశంగా భావిస్తున్నారు.

కంపెనీలకు లేఆఫ్స్‌పై కఠిన ఆంక్షలు..

ఇక ఇటీవల కాలంలో ఉద్యోగులను తొలగించిన (లేఆఫ్స్) కంపెనీలపై కొత్త నిబంధనలు తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఏదైనా కంపెనీ గత రెండేళ్లలో ఒక నిర్దిష్ట ప్రాంతంలో.. ఒకే తరహా ఉద్యోగాల నుంచి అమెరికన్లను తొలగించి ఉంటే.. ఆ కంపెనీ విదేశీయుల కోసం PERM దరఖాస్తులు దాఖలు చేయకుండా నిషేధం విధించే అవకాశం ఉంది. అంతేకాకుండా లేఆఫ్స్‌కు గురైన అర్హులైన అమెరికన్ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతే విదేశీయుల స్పాన్సర్‌షిప్ గురించి ఆలోచించాల్సి ఉంటుంది. రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పూర్తయిన 30 రోజుల్లోగానే పూర్తిస్థాయి PERM దరఖాస్తును సమర్పించాలనే నిబంధనను కూడా చేర్చారు.

Follow Us