Men’s Day 2026: ఈ రోజు మెన్స్ డే .. మహిళా దినోత్సవానికి పోటీ కాదు!
International Men's Day: ప్రతి ఏడాది నవంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా మెన్స్ డే జరుపుతారు. పురుషులు కుటుంబానికి, సమాజానికి అందిస్తున్న సేవలను గుర్తించడంతో పాటు వారు ఎదుర్కొంటున్న ఆరోగ్య, మానసిక, సామాజిక సమస్యలపై అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. మగవారి జీవితాల్లోని సవాళ్లను సమాజం గుర్తించాలనే సందేశాన్ని ఈ రోజు అందిస్తుంది. ఈ వేడుక ఎప్పుడు ప్రారంభమైంది? 2026 సంవత్సరం థీమ్ ఏమిటి? ఇతర ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

International Men’s Day: ప్రతి ఏడాది నవంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా మెన్స్ డే జరుపుతారు. పురుషులు కుటుంబానికి, సమాజానికి అందిస్తున్న సేవలను గుర్తించడంతో పాటు వారు ఎదుర్కొంటున్న ఆరోగ్య, మానసిక, సామాజిక సమస్యలపై అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. మగవారి జీవితాల్లోని సవాళ్లను సమాజం గుర్తించాలనే సందేశాన్ని ఈ రోజు అందిస్తుంది. ఈ వేడుక ఎప్పుడు ప్రారంభమైంది? 2026 సంవత్సరం థీమ్ ఏమిటి? ఇతర ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
2026 మెన్స్ డే థీమ్ ఏంటంటే
ఈ ఏడాది అంతర్జాతీయ పురుషుల దినోత్సవం 28వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. 2026 సంవత్సరానికి ‘ది ఫ్యూచర్ ఈజ్ ఎవ్రీవన్’ (The Future Is Everyone) థీమ్‌ను ఎంపిక చేశారు. అంటే భవిష్యత్తు అనేది అందరిదీ అనే అర్థం. సమాజంలో పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ సమాన గౌరవం, గుర్తింపు, అవకాశాలు ఉండాలనే సందేశాన్ని ఈ థీమ్ ఇస్తోంది.
ఈ థీమ్ ఆలోచనను అమెరికన్ రచయిత్రి లిసా బ్రిటన్ ఆరేళ్ల క్రితమే ప్రతిపాదించారు. పురుషుల పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందించడం, వారి సేవలను గుర్తించడం, సమాజంలో సమానత్వాన్ని ప్రోత్సహించడం దీని ప్రధాన ఉద్దేశం. పురుషులను గుర్తించి, వారికి తగిన మద్దతు అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలనే పిలుపునిస్తోంది.
1999లో ప్రారంభమైన వేడుకలు.. భారత్‌లో ప్రత్యేక గుర్తింపు!
అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని తొలిసారిగా 1999లో ప్రారంభించారు. ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని వెస్ట్ ఇండీస్ యూనివర్సిటీలో చరిత్ర అధ్యాపకుడిగా పనిచేసిన డాక్టర్ జెరోమ్ టీలక్సింగ్ ఈ వేడుకలకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది నవంబర్ 19న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాల్లో అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. భారత్‌లోనూ ఈ వేడుకలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్థాయిలో పురుషుల దినోత్సవ వేడుకలు భారత్‌లో జరుగుతున్నట్లు అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వెబ్‌సైట్ పేర్కొంటోంది.
భారత్‌లో 2007లో ఉమా చల్లా అనే మహిళ ఈ వేడుకలను నిర్వహించేందుకు చొరవ తీసుకున్నారు. ఇద్దరు పిల్లల తల్లైన ఆమె బెంగళూరులోని ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ‘సేవ్ ది ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్’తో పాటు పలు సంస్థల స్థాపనలో కీలక పాత్ర పోషించారు. అంతర్జాతీయ బాలుర దినోత్సవం ఏర్పాటుకు తొలి ప్రయత్నాలు చేసిన వారిలో ఆమె ఒకరు.
మెన్స్ డే ఎందుకు జరుపుకోవాలి?
సమాజంలో పురుషులు బలంగా ఉండాలి కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా నిలబడాలి అనే భావన చాలా మందిలో ఉంటుంది. కానీ ఆ బాధ్యతల మధ్య వారు ఎదుర్కొనే మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత ఇబ్బందుల గురించి చాలా సార్లు చర్చ జరగదు. ఉద్యోగ ఒత్తిళ్లు, ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధ్యతలు, సామాజిక అంచనాల కారణంగా ఎంతో మంది పురుషులు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. తమ బాధలను బయటకు చెప్పుకోలేక, సహాయం కోరడానికి వెనకాడుతుంటారు. ఇలాంటి సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ప్రధాన లక్ష్యాల్లో ఒకటి.
ముఖ్య అంశాలపై అవగాహన, చర్చ జరగాలి
మానసిక ఆరోగ్యం: ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలను గుర్తించడం. అవసరమైనప్పుడు ఇతరుల సహాయం తీసుకోవడం. శారీరక ఆరోగ్యం: ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించడం. సానుకూల పురుషత్వం: దయ, సహనం, బాధ్యత, ఇతరుల పట్ల గౌరవం వంటి మంచి లక్షణాలను ప్రోత్సహించడం. ఆత్మహత్యల నివారణ: పురుషుల్లో ఆత్మహత్యల సమస్యపై అవగాహన పెంచడం, మానసిక ఆరోగ్య సహాయం అందుబాటులో ఉండేలా చూడడం.
మహిళా దినోత్సవానికి పోటీ కాదు .. పురుషుల సమస్యలకు గుర్తింపు!
అంతర్జాతీయ పురుషుల దినోత్సవం గురించి చాలా మందిలో ఒక సందేహం ఉంటుంది. మహిళల కోసం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉన్నప్పుడు పురుషుల కోసం మరో రోజు ఎందుకు? అయితే ఈ రెండు దినోత్సవాలు ఒకదానికొకటి పోటీ కాదు. మహిళలు ఎదుర్కొనే సమస్యలు, వారి హక్కుల గురించి చర్చించడం ఎంత ముఖ్యమో పురుషులు ఎదుర్కొంటున్న ప్రత్యేక సమస్యలను గుర్తించి చర్చించడం అంతే అవసరం. పురుషులు, మహిళలు ఇద్దరికీ సమాన గౌరవం, అవకాశాలు కల్పించే సమాజం ఏర్పడాలంటే పరస్పర అవగాహన, సహకారం అవసరం.
ముఖ్యంగా పురుషులు తమ భావోద్వేగాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయగలగాలి. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. మానసికంగా ఇబ్బందులు ఎదురైనప్పుడు సహాయం తీసుకోవడంలో సంకోచించకూడదు. పురుషుల దినోత్సవం అంటే కేవలం శుభాకాంక్షలు చెప్పుకునే రోజు మాత్రమే కాదు. మగవారి ఆరోగ్యం, ఆనందం, మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వాలని గుర్తుచేసే ప్రత్యేకమైన రోజు!