ఈ తేదీల్లో పుట్టిన పిల్లల మనస్తత్వం తల్లిదండ్రులకు కూడా అర్థం కాదు..!
Numerology: కొంతమంది పిల్లలు బయటకు ఎంతో ప్రశాంతంగా, అమాయకంగా కనిపిస్తారు. కానీ వారి మనసులో మాత్రం బలమైన పట్టుదల, మొండితనం దాగి ఉంటాయి. తాము అనుకున్నది సాధించే వరకు వెనక్కి తగ్గరు. సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన పిల్లల్లో ఇలాంటి ప్రత్యేక లక్షణాలు ఉంటాయట. మరి ఆ తేదీలు ఏమిటి? వారి మనస్తత్వం ఎలా ఉంటుంది? తెలుసుకుందాం.

ప్రతి చిన్నారి స్వభావం ఒక్కోలా ఉంటుంది. కొందరు పిల్లలు చిన్నప్పటి నుంచే అల్లరి చేస్తూ, అందరితో కలివిడిగా ఉంటారు. మరికొందరు మాత్రం చాలా ప్రశాంతంగా, మౌనంగా ఉంటారు. అయితే బయటకు ఎంతో నిశ్శబ్దంగా కనిపించే కొందరు పిల్లల్లో మొండితనం, పట్టుదల చాలా ఎక్కువగా ఉంటాయి. తాము అనుకున్నది సాధించే వరకు వెనక్కి తగ్గరు. కొన్నిసార్లు వారి మనసులో ఏముందో తల్లిదండ్రులు కూడా సులభంగా అర్థం చేసుకోలేరు. సంఖ్యా శాస్త్రం (Numerology) ప్రకారం ముఖ్యంగా రెండు మూల సంఖ్యలకు చెందిన పిల్లల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆ మూల సంఖ్యలు ఏవో, వారి ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం.
మూల సంఖ్య 1: ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు ఎక్కువ
ఏ నెలలోనైనా 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన పిల్లల మూల సంఖ్య 1 అవుతుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ మూల సంఖ్యకు అధిపతి సూర్యుడు. ఈ తేదీల్లో పుట్టిన పిల్లల్లో చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటాయని చెబుతారు. వీరు ప్రతి విషయంలో ముందుండాలని కోరుకుంటారు. ఏదైనా పని ప్రారంభిస్తే దానిని పూర్తి చేయాలనే పట్టుదలతో ఉంటారు. తమ నిర్ణయాలపై బలమైన నమ్మకం కలిగి ఉంటారు. ఇతరులు చెప్పిన మాటలను వెంటనే అంగీకరించరు. తమ ఆలోచనల ప్రకారమే పనులు జరగాలని కోరుకుంటారు. ఎవరైనా తమ మాటను పట్టించుకోకపోతే వెంటనే అసంతృప్తికి గురవుతారు. ఒక్కోసారి వీరి పట్టుదల తల్లిదండ్రులకు కొన్ని సందర్భాల్లో ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే సరైన ప్రోత్సాహం, మార్గదర్శకత్వం లభిస్తే భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదిగే అవకాశం ఉంటుందని సంఖ్యాశాస్త్రం చెబుతోంది.
మూల సంఖ్య 8: బయటకు ప్రశాంతం.. లోపల బలమైన సంకల్పం
ఏ నెలలోనైనా 8, 17, 26 తేదీల్లో జన్మించిన పిల్లల మూల సంఖ్య 8 అవుతుంది. ఈ మూల సంఖ్యకు అధిపతి శని. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన పిల్లలు సాధారణంగా ప్రశాంతంగా, గంభీరంగా, అంతర్ముఖ స్వభావంతో ఉంటారు. వీరు తమ మనసులోని భావాలను అందరితో పంచుకోవడానికి ఇష్టపడరు. బయటకు చాలా నిశ్శబ్దంగా కనిపించినప్పటికీ.. మనసులో మాత్రం బలమైన కోరికలు, ఆశయాలు కలిగి ఉంటారు. ఒకసారి ఏదైనా సాధించాలని నిర్ణయించుకుంటే దాని కోసం నిరంతరం ప్రయత్నిస్తారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సులభంగా వెనక్కి తగ్గరు. ఈ మూలా సంఖ్య పిల్లలకు చిన్న వయసు నుంచే డబ్బు విలువ తెలిసి ఉంటుందని సంఖ్యా శాస్త్రం చెబుతోంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటూ పొదుపుపై ఆసక్తి చూపిస్తారు. అయితే తాము అనుకున్నది సాధించాలనే పట్టుదల కొన్నిసార్లు మొండితనంగా ప్రవర్తిస్తారు.
తల్లిదండ్రులు మస్ట్‌గా తెలుసుకోండి
మూలసంఖ్య 1, 8కు చెందిన పిల్లల్లో ఆత్మవిశ్వాసం, సంకల్ప బలం, తమ అభిప్రాయాలపై నిలబడే లక్షణాలు ఎక్కువగా ఉంటాయని సంఖ్యా శాస్త్రం చెబుతోంది. వీరిని అర్థం చేసుకోవడానికి తల్లిదండ్రులు కొంత సమయం కేటాయించాలి. ప్రతి విషయంలోనూ బలవంతం చేయకుండా ప్రేమగా మాట్లాడాలి. వారి అభిప్రాయాలను వినడంతో పాటు, సరైనది ఏదో ఓపికగా వివరించాలి. వారి పట్టుదలను సానుకూల దిశలో ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించేందుకు దోహదపడుతుంది.
(గమనిక: ఇవి సంఖ్యా శాస్త్రంలో ఉన్న నమ్మకాలు మాత్రమే. పిల్లల వ్యక్తిత్వాన్ని వారి పుట్టిన తేదీ ఒక్కటే నిర్ణయించదు)




