Asian Relays Gold Medal: ఆసియా రిలేస్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
ఆసియా రిలేస్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో మెరిశారు. మహిళల 4x100 మీటర్ల రిలేలో శ్రబణి నందా, ఎస్‌ఎస్ స్నేహ, సుదేశ్నా శివంకర్, తమన్నాలతో కూడిన భారత జట్టు 43.85 సెకన్లలో రేసును పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇది ఈ సీజన్‌లో జట్టు నమోదు చేసిన అత్యుత్తమ టైమ్‌గా నిలిచింది. మరోవైపు మిక్స్‌డ్ 4x400 మీటర్ల రిలేలో భారత్ రజత పతకం, మిక్స్‌డ్ 4x100 మీటర్ల రిలేలో కాంస్య పతకాన్ని సాధించింది. భారత అథ్లెట్ల ఈ ఘన విజయంపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా నెట్టింట స్పెషల్ పోస్టు విడుదల చేశారు..

న్యూఢిల్లీ, జూన్ 25: ఆసియా రిలేస్ చాంపియన్‌షిప్ రెండో ఎడిషన్‌లో భారత అథ్లెటిక్స్ జట్టు మరోసారి సత్తా చాటింది. చాంపియన్‌షిప్ చివరి రోజున మహిళల 4×100 మీటర్ల రిలేలో భారత క్వార్టెట్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుని దేశానికి గర్వకారణంగా నిలిచింది. శ్రబణి నందా, ఎస్‌ఎస్ స్నేహ, సుదేశ్నా శివంకర్, తమన్నాలతో కూడిన భారత మహిళా జట్టు 43.85 సెకన్లలో రేసును పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఇది ఈ సీజన్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన (సీజన్ బెస్ట్) కావడం విశేషం. భారత జట్టు స్వర్ణంతో పాటు మరో రెండు పతకాలను కూడా ఖాతాలో వేసుకుంది. మిక్స్‌డ్ 4×400 మీటర్ల రిలేలో తీర్థేశ్ శెట్టి, పూవమ్మ ఎంఆర్, భరత్ శ్రీధర్, నీరూ పాఠక్‌లతో కూడిన జట్టు 3:17. 6 సెకన్ల టైమ్‌తో రజత పతకాన్ని అందుకుంది.
అంతకుముందు జరిగిన మిక్స్‌డ్ 4×100 మీటర్ల రిలేలో ప్రణవ్ గౌరవ్, తమన్నా, అనిమేష్ కుజూర్, ఎస్‌ఎస్ స్నేహ సభ్యులుగా ఉన్న భారత జట్టు 41.27 సెకన్లలో రేసును పూర్తి చేసి కాంస్య పతకాన్ని సాధించింది. ఈ విభాగంలో థాయ్‌లాండ్ స్వర్ణం, చైనా రజతం గెలుచుకున్నాయి. ఇక పురుషుల 4×400 మీటర్ల రిలేలో భారత జట్టు 3:05.33 సెకన్లతో ఐదో స్థానంలో నిలిచింది. మహిళల 4×400 మీటర్ల రిలే జట్టు 3:34.88 సెకన్లతో నాలుగో స్థానంలో నిలిచి పతకాన్ని తృటిలో చేజార్చుకుంది.
Winning against the Chinese. In China.
At the Asian Relay Championships.
Srabani, Sudeshna, Sneha & Tamanna in the 4×100 relay.
Power. Speed. Grace. Commitment.
But above all, teamwork.
This clip has it all.
I’m watching it on loop.
More of this please. 🇮🇳 pic.twitter.com/E00i0muduc
— anand mahindra (@anandmahindra) June 24, 2026
భారత మహిళల స్వర్ణ విజయంపై ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రిలే అథ్లెట్ల అద్భుత ప్రదర్శనను కొనియాడుతూ వారికి అభినందనలు తెలిపారు. భారత అథ్లెటిక్స్ భవిష్యత్తు మరింత ఆశాజనకంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ఆసియా రిలేస్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ల ప్రదర్శన దేశ అథ్లెటిక్స్ రంగానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ముఖ్యంగా మహిళల 4×100 మీటర్ల రిలేలో స్వర్ణ పతకం సాధించడం భారత క్రీడా చరిత్రలో మరో మైలురాయిగా నిలిచింది.




